కేబినెట్ తప్పుకుంటుందా?
ఏపీ మండలిలో బెరైటీస్‌పై రామచంద్రయ్య నిలదీత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిలాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాన్ని రిలయన్స్ కార్పొరేట్ సంస్థకు విక్రయించేందుకే స్థానికంగా పల్వరైజింగ్ యూనిట్లకు ప్రభుత్వం ఖనిజం సరఫరా నిలిపివేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు.
శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై చర్చ జరిగింది. సభ్యుడు చెంగల్రాయుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జవాబిస్తూ సుమారు 176 బెరైటీస్ పల్వరైజింగ్ యూనిట్లకు ఆగస్టు 8వ తేదీ నుంచి ఏపీఎండీసీ సంస్థ బెరైటీస్ ఖనిజ సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు.
దీంతో పల్వరైజింగ్ యూనిట్లు పనిచేయడం లేదన్నారు. ఈ సమయంలో రామచంద్రయ్య జోక్యం చేసుకుం టూ ఖనిజం సరఫరా నిలిపివేయడంతో దాదాపు 30 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. బెరైటీస్ ఖనిజ సంపద అంతా రిలయన్స్‌కు అమ్మడం కోసమే స్థానిక యూనిట్లుకు ఖనిజ సరఫరా నిలిపివే శారని ప్రచారం జరుగుతోందన్నారు.
దీనికి కొందరు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలపటంతో.. ‘నేను చెబుతున్నది జరిగితే మంత్రిమండలి మొత్తం రాజీనామా చేస్తుందా? జరగకుంటే నేను రాజీనామా చేస్తా’ అని రామచంద్రయ్య సవాల్ విసిరారు. కాం ట్రాక్టు ముగిసినందునే ప్రభుత్వం ఖనిజ సరఫ రా నిలిపివేసిందని యనమల చెప్పారు.