Reliance Jio Offers
-
జియో ఫోన్‌పై మరో రూమర్, అదే నిజమైతే..!
బడ్జెట్ ఫోన్ 'జియోనెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే జియో ఫోన్ వినాయక చవితికి విడుదల కావాల్సి ఉండగా..సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్ కాంపోనెట్స్ ధరల కారణంగా..గతంలో అనౌన్స్ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే' విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. జియో ఫోన్ పై రూమర్స్ జియో - గూగుల్ భాగస్వామ్యంలో అతి తక్కువ ధరకే విడుదల కానున్న ఆండ్రాయిడ్ ఫోన్‌పై మరోసారి కొన్ని రూమర్స్ వెలుగులోకి వచ్చాయి. గతంలో (సెప్టెంబర్ 10 రిపోర్ట్ ప్రకారం) ఈ ఫోన్ ధర రూ.5వేలని ప్రచారం జరిగింది. ఈటి టెలికామ్ రిపోర్ట్ ప్రకారం..ఫోన్లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా వివిధ భాగాలు ( కాంపోనెంట్స్) ధర సుమారు 20శాతం పెరిగాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్ ధరలతో జియో ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని, రూ.5వేలకే వచ్చే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజా రూమర్స్‌తో ఫోన్ ధర రూ.3,499కే లభించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తొలిసారి భారతీయలు అతితక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే అవకాశం లభించినట్లవుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్ సంగతి ఎలా ఉన్నా..ఈ ఫోన్ ధర ఎంత అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంది. ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయ్ కాంపాక్ట్ డిస్ప్లేతో రానున్న ఈ ఫోన్ 5.5 అంగుళాలు ఉండనుంది. క్వాల్కమ్ క్యూఎం 215 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్, 2500ఎంఏహెచ్ బ్యాటరీ, 2జీబీ అండ్ 3జీబీ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ రేర్ కెమెరా, స్నాప్ చాట్ లెన్సెస్, వాయిస్ కమాండ్ కోసం గూగుల్ అసిస్టెంట్స్, గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్,ఇతర ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. -
'జియో క్రికెట్ ఫెస్టివల్': బంపర్ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్: భారత్ యావత్తూ ఐపిఎల్ క్రికెట్ పండగ కోసం సిద్ధమవుతుండగా, జియో మరోసారి ఆసక్తికరమైన వినోదాన్ని తన కస్టమర్లకు పంచేందుకు ముందుకు వచ్చింది. క్రికెట్, కామెడీ మేళవించిన రెండు వినోద కార్యక్రమాలను విడుదల చేసింది. ‘జియో ధన్ ధనా ధన్ లైవ్’ 'జియో క్రికెట్ ప్లే అలాంగ్' , అనే కొత్త పథకాలను లాంచ్ చేసింది. దీంతోపాటు ‘జియో క్రికెట్ సీజన్ ప్యాక్’ అనే కొత్త రీచార్జ్ పథకాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది. జియో క్రికెట్ ప్లే అలాంగ్: జియో క్రికెట్ ప్లే అలాంగ్ పేరుతో ఆవిష్కరించిన లైవ్ మొబైల్ గేమ్ షో ద్వారా వినియోగదార్లు క్రికెట్‌ను ఆస్వాదించడంతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండే ఈ మొబైల్ గేమ్ షో లో 25 కార్లను గెల్చుకునే అవకాశం. 7 వారాలు, 60 మ్యాచ్‌ల వరకు ఈ గేమ్ షో వినోదాన్ని పొందవచ్చు. ‘జియో ధన్ ధనా ధన్ లైవ్’: ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు క్రికెట్ తో పాటు స్వేచ్ఛమైన వినోదాన్ని అందించేందుకు జియో ప్రయత్నిస్తోంది. ఈ షో ఏప్రిల్ 7న ‘ మై జియో’ యాప్ లో అందుబాటులోకి వస్తుంది. జియో కస్టమర్లతో పాటు జియో యేతర కస్టమర్లు కూడా ఈ షోను ఉచితంగా వీక్షించవచ్చు. భారతదేశపు ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్, ప్రఖ్యాత స్పోర్ట్స్ యాంకర్ సమీర్ కొచ్చర్ కామెడీ షో ను సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇంకా శిల్పా షిండే, అలీ అస్గర్, సుగంధ మిశ్రా, సురేష్ మీనన్, పరేష్ గణత్ర, శివాని దండేకర్ , అర్చన విజయ్ కూడా ఈ షోలో పాల్గొంటారు. అంతేకాదు క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్‌ను చూసే అవకాశం. జియో క్రికెట్ సీజన్ ప్యాక్: క్రికెట్ పండుగను దృష్టిలో ఉంచుకుని జియో సరికొత్త రీఛార్జి ప్యాక్ ను ప్రవేశపెట్టింది. ‘జియో క్రికెట్ సీజన్ ప్యాక్’ పేరుతో అందించనున్న ఈ ప్యాక్ ద్వారా రూ. 251 చెల్లించి 51 రోజులకు 102 జీబీ 4జీ డేటాను పొందే వీలుంది. ఈ కొత్త రీఛార్జి ప్యాక్ ద్వారా ప్రేక్షకులు తమకిష్టమైన ఐపిఎల్ మ్యాచ్ లను ‘జియో టీవీ’ యాప్ ద్వారా వీక్షించవచ్చు. -
జియో ఆఫర్లపై ట్రాయ్ వివరణ కోరిన ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఆఫర్లు, టారిఫ్‌లకు సంబంధించిన మొత్తం అన్ని వివరాలను తమకందించాలని టెలికం ట్రిబ్యునల్ టీడీఎస్ఏటీ తాజాగా ట్రాయ్‌ని ఆదేశించింది. జియో ఉచిత ప్రమోషనల్ ఆఫర్ పొడిగింపునకు ట్రాయ్ అనుమతినివ్వడాన్ని సవాల్ చేస్తూ భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్ కంపెనీలు ఇదివరకే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఇవే టెల్కోలు ఇటీవల జియో టారిఫ్‌లకు ట్రాయ్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ట్రిబ్యునల్ తలుపుతట్టాయి. ఎయిర్టెల్, ఐడియా ఫిర్యాదులను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ తాజాగా జియో ప్రవేశపెట్టిన వెల్కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్లకు సంబంధించిన మొత్తం వివరాలను ఫిబ్రవరి 23లోగా తమకు అందించాలని ట్రాయ్‌ని ఆదేశించింది. -
జియో 'హ్యాపీ న్యూయర్'కి మరో ట్రబుల్...
ముంబై : టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న హ్యాపీ న్యూయర్ టారిఫ్ ప్లాన్లకు మరో చిక్కు వచ్చి పడింది. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో అందిస్తున్న సేవలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయంటూ క్లీన్ చీట్ ఇచ్చిన వెంటనే ట్రాయ్‌పై టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్‌లు పోరాటానికి దిగాయి. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెంట్ ట్రిబ్యునల్(టీడీశాట్) వద్ద ట్రాయ్‌పై ఫిర్యాదు దాఖలు చేశాయి. టెలికాం దిగ్గజాల ఫిర్యాదు మేరకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందిస్తున్న ఉచిత వాయిస్, డేటా సర్వీసులపై వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్, రెగ్యులేటరీని ఆదేశించింది. జియో ప్రకటించిన వెల్ కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. రెండూ వేర్వేరు అని ట్రాయ్ గతవారమే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే అవి ఎలా వేర్వేరో తెలుపుతూ ఫిబ్రవరి 15లోపు క్లారిఫికేషన్ ఇవ్వాలని ట్రాయ్‌ని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 20కు వాయిదా వేసింది. టీడీశాట్ వద్ద ఫిర్యాదు దాఖలు చేసిన ఎయిర్టెల్, ఐడియాలు ఉచిత కాల్స్, డేటా సర్వీసులు అందిస్తున్న ప్రమోషనల్ ఆఫర్‌నే పేరు మార్చి వినియోగదారులకు అందించడానికి జియోకు రెగ్యులేటరీ అనుమతించిందని ఆరోపిస్తున్నాయి. నిర్దేశిత 90 రోజులను కూడా అధిగమించి జియో 2017 మార్చి దాకా ఉచిత వాయిస్, డేటా ఆఫర్లను అందించడం నిబంధనలకు విరుద్ధమంటూ పేర్కొన్నాయి. ట్రాయ్ టెలికాం టారిఫ్ ఆర్డర్లను జియో ఉల్లంఘిస్తుందని చెప్పాయి.