కేజీ-డీ6లో మళ్లీ తగ్గిన గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి మళ్లీ రెండు నెలల తర్వాత తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో రోజుకు 13.63 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ)కు పెరిగిన ఉత్పత్తి ఈ నెలలో 13.28 ఎంసీఎండీలకు తగ్గింది. చమురు శాఖకు సమర్పించిన స్థాయీ నివేదికలో నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫిబ్రవరిలో తొలివారంలో కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాలతో పాటు ఎంఏ చమురు క్షేత్రం నుంచి 13.58 ఎంసీఎండీల గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసింది. ఆతర్వాత వారంలో ఇది 13.68 ఎంసీఎండీలకు పెరిగింది. అయితే, ఈ నెల 9తో ముగిసిన వారంలో గ్యాస్ ఉత్పత్తి 13.28 ఎంసీఎండీలకు తగ్గిందని డీజీహెచ్ తెలిపింది. ఇందులో డీ1, డీ3 క్షేత్రాల నుంచి 8.17 ఎంసీఎండీలు, ఎంఏ చమురు క్షేత్రం నుంచి 5.11 ఎంసీఎండీల ఉత్పత్తి నమోదైంది.
ఇంకా సగానికిపైగా బావుల మూత...
అంతకంతకూ పడిపోతున్న ఉత్పత్తిని తిరిగి పెంచే ప్రణాళికలో భాగంగా ఆర్ఐఎల్ జనవరిలో ఎంఏ చమురు క్షేత్రంలోని ఎంఏ-8 బావిలో మళ్లీ గ్యాస్ వెలికితీతను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఉత్పత్తి గత నెలలో 1.5 ఎంసీఎండీలు పెరిగి 5.33 ఎంసీఎండీలకు చేరింది. మూడేళ్లపాటు వరుస తగ్గుదలకు బ్రేక్‌పడింది. అయితే, మళ్లీ తాజాగా ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్ఐఎల్కు 60 శాతం, బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు 30 శాతం, కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌కు 10 శాతం చొప్పున వాటాలున్నాయి.
ఇప్పటిదాకా డీ1, డీ3 క్షేత్రాల్లో 22 బావులను తవ్విన ఆర్ఐఎల్ కేవలం 18 బావుల్లోనే ఉత్పత్తిలోకి తీసుకొచ్చింది. కాగా, ప్రస్తుతం 8 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోందని, 10 బావులు మూతబడేఉన్నాయని డీజీహెచ్ తాజా నివేదికలో పేర్కొంది. అదేవిధంగా ఎంఏ క్షేత్రాల్లో మొత్తం 7 బావులకుగాను 5 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోంది. ఒక బావి(ఎంఏ-6హెచ్)లో మరమ్మతులు చేపడుతోందని నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2009 ఏప్రిల్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత 2010 మార్చిలో గరిష్టంగా 69.43 ఎంసీఎంసీలను తాకింది. ఇప్పుడు 80 శాతం పైనే ఉత్పత్తి దిగజారినట్లు లెక్క. కాగా, వచ్చే నెల 1 నుంచి గ్యాస్ రేటు రెట్టింపు కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 8 డాలర్లకు ఎగబాకనుంది. ధర పెరిగాక అనూహ్యంగా లాభాలు దండుకోవడగానికే రిలయన్స్ అక్రమంగా గ్యాస్‌ను దాచిపెడుతోందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.