రిలయన్స్ ఎంఎఫ్ చేతికి గోల్డ్‌మన్ శాక్స్ ఫండ్
డీల్ విలువ రూ.243 కోట్లు
ముంబై: అంతర్జాతీయ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ భారత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ రూ.243 కోట్లకు కొనుగోలు చేయనున్నది. ఈ లావాదేవీ అంతా నగదు రూపేణా జరగనున్నది. రూ.13 లక్షల కోట్ల భారత మ్యూచువల్ ఫండ్ మార్కెట్ నుంచి తాజాగా మరో విదేశీ సంస్థ, గోల్డ్‌మన్ శాక్స్ వైదొలుగుతోంది. ఈ డీల్‌కు రెండు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపాయని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్(ఆర్సీఏఎం) మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది.
అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ క్యాపిటల్ బీమా, బ్రోకరేజ్, వెల్త్ మేనేజ్మెంట్ తదితర ఆర్ధిక సేవలనందిస్తోంది. గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీ 2011లో రూ. 120 కోట్లకు బెంచ్‌మార్క్ మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేయడం ద్వారా భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ దిగ్గజాలు భారత మ్యూచువల్ ఫండ్ రంగం నుంచి నిష్ర్కమిస్తున్నాయి.
స్టాండర్ట్ చార్టర్డ్ సంస్థ తన మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని 2008లో ఐడీఎఫ్సీకి, ఫెడిలిటి సంస్థ తన మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌కు 2012లో విక్రయించాయి. మోర్గాన్ స్టాన్లీ ఫండ్ వ్యాపారాన్ని హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ కొనుగోలు చేయగా, ఐఎన్జీ మ్యూచువల్ ఫండ్‌ను బిర్లా సన్‌లైఫ్, పైన్‌బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కోటక్ ఎంఎఫ్, డాయిష్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని అమెరికా కొనుగోలు చేశాయి. ప్రస్తుతం భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో 40కు పైగా సంస్థలు ఉన్నాయి.