Reliance Naval
-
అదానీ చేతికి రిలయన్స్ ఎనర్జీ
ముంబై: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా ముంబైలోని విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని విక్రయించటం పూర్తయింది. ముంబై నగర విద్యుత్ సరఫరా వ్యాపారాన్ని (రిలయన్స్ ఎనర్జీ కపెనీని) రూ.18,800 కోట్లకు అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించడం పూర్తయిందని కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీ తెలియజేశారు. ఈ విక్రయంతో మూడింట రెండొంతుల రుణ భారం తగ్గిందన్నారు. ఇంతకు ముందు రూ.22,000 కోట్లుగా ఉన్న కంపెనీ రుణ భారం ఇప్పుడు రూ.7,500 కోట్లకు తగ్గిందని తెలియజేశారు. వచ్చే ఏడాది కల్లా ఎలాంటి రుణభారం లేని కంపెనీగా అవతరించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. రూ.133 కోట్ల ఎన్‌సీడీలకు చెల్లింపులు... రిలయన్స్ ఇన్‌ఫ్రారూ.133 కోట్ల ఎన్సీడీల చెల్లింపుల్లో విఫలమైంది. అయితే అదానీకి ముంబై విద్యుత్ వ్యాపార విక్రయం వల్ల వచ్చిన డబ్బులతో మరికొన్ని రోజుల్లో ఈ చెల్లింపులు జరుపుతామని అనిల్ అంబానీ తెలిపారు. బాంద్రా వెర్సోవా సీలింక్ ప్రాజెక్ట్ పనులు అక్టోబర్ 1 నుంచి ఆరంభమవుతాయన్నారు. 10 కిమీ ఈ ప్రాజెక్ట్‌ను ఇటలీకి చెందిన ఆస్టాల్డి కంపెనీ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.6,994 కోట్లని తెలిపారు. -
మునుగునా... మనగలుగునా?
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ భవితవ్యంపై ఆడిటర్లు సందేహాలు వ్యక్తం చేశారు. కంపెనీగా కొనసాగే సత్తా దీనికి ఉందా అనే విషయమై వారు పలు అంశాలను ప్రస్తావిస్తూ సందేహం వెలిబుచ్చారు. రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఫలితాలపై ఆడిట్ సంస్థ, ప్రతాక్ హెచ్.డి. అండ్ అసోసియేట్స్ కొన్ని సందేహాలు లెవనెత్తింది. నగదు నష్టాలు పెరిగిపోవడం, నెట్వర్క్ తగ్గిపోవడం, రుణదాతలు మంజూరు చేసిన రుణాలను వెనక్కి తీసుకోవడం, కంపెనీ చెల్లించాల్సిన అప్పులు, కంపెనీ ఆస్తుల కంటే అధికంగా ఉండటం... రుణదాతలు కొందరు ఇప్పటికే కంపెనీ మూసివేత కోరుతూ వైండింగ్ అప్ పిటిషన్లు దాఖలు చేయడం తదితర అంశాలను ఈ సంస్థ ప్రస్తావించింది. ఈ పరిస్థితులు కంపెనీ మనుగడపై అనిశ్చితిని పెంచుతున్నాయని వివరించింది. సోమవారం వెల్లడైన కంపెనీ ఫలితాలు కూడా మరింత నిరాశమయంగా ఉన్నాయి. 2016–17 క్యూ4లో రూ.140 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.409 కోట్లకు పెరిగాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.523 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.956 కోట్లకు ఎగిశాయి. కంపెనీ భవితవ్యంపై ఆడిట్ సంస్థ ఆందోళన వ్యక్తం చేయడంతో రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ 13 శాతానికి పైగా పతనమై రూ.23.4 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 18% క్షీణించింది. కంపెనీ మార్కెట్ క్యాపిట లైజేషన్ రూ.265 కోట్లు తగ్గి రూ.1,726 కోట్లకు పడిపోయింది. ఈ కంపెనీ షేర్ల అమ్మకాలు.... ఇతర రిలయన్స్ గ్రూప్ షేర్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 10 శాతం, రిలయన్స్ పవర్ 4 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 1.8 శాతం, రిలయన్స్ క్యాపిటల్ షేర్ 1.3 శాతం వరకూ నష్టపోయాయి. -
రిలయన్స్ డిఫెన్స్ పేరు మార్పు
కొత్త పేరు రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ న్యూఢిల్లీ: రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్‌డీఈఎల్) సంస్థ పేరు మార నుంది. రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌గా పేరును మార్చేందుకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు సంస్థ తెలిపింది. భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ దళాలకు అందించే సర్వీసులకు అనుగుణంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఆగస్టు 22న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకోసం వాటాదారుల అనుమతి తీసుకుంటా మని పేర్కొంది. ఆర్‌డీఈఎల్ గతంలో పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో ఉండేది. 2016లో పిపావవ్ డిఫెన్స్‌లో కీలక వాటాలు కొనుగోలు చేసిన తర్వాత రిలయన్స్ గ్రూప్.. ఈ సంస్థ పేరును ఆర్‌డీఈఎల్ కింద మార్చింది.