న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ భవితవ్యంపై ఆడిటర్లు సందేహాలు వ్యక్తం చేశారు. కంపెనీగా కొనసాగే సత్తా దీనికి ఉందా అనే విషయమై వారు పలు అంశాలను ప్రస్తావిస్తూ సందేహం వెలిబుచ్చారు. రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఫలితాలపై ఆడిట్ సంస్థ, ప్రతాక్ హెచ్.డి. అండ్ అసోసియేట్స్ కొన్ని సందేహాలు లెవనెత్తింది.
నగదు నష్టాలు పెరిగిపోవడం, నెట్‌వర్క్ తగ్గిపోవడం, రుణదాతలు మంజూరు చేసిన రుణాలను వెనక్కి తీసుకోవడం, కంపెనీ చెల్లించాల్సిన అప్పులు, కంపెనీ ఆస్తుల కంటే అధికంగా ఉండటం... రుణదాతలు కొందరు ఇప్పటికే కంపెనీ మూసివేత కోరుతూ వైండింగ్ అప్ పిటిషన్లు దాఖలు చేయడం తదితర అంశాలను ఈ సంస్థ ప్రస్తావించింది. ఈ పరిస్థితులు కంపెనీ మనుగడపై అనిశ్చితిని పెంచుతున్నాయని వివరించింది.
సోమవారం వెల్లడైన కంపెనీ ఫలితాలు కూడా మరింత నిరాశమయంగా ఉన్నాయి. 2016–17 క్యూ4లో రూ.140 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.409 కోట్లకు పెరిగాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.523 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.956 కోట్లకు ఎగిశాయి.
కంపెనీ భవితవ్యంపై ఆడిట్ సంస్థ ఆందోళన వ్యక్తం చేయడంతో రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ 13 శాతానికి పైగా పతనమై రూ.23.4 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 18% క్షీణించింది. కంపెనీ మార్కెట్ క్యాపిట లైజేషన్ రూ.265 కోట్లు తగ్గి రూ.1,726 కోట్లకు పడిపోయింది.
ఈ కంపెనీ షేర్ల అమ్మకాలు.... ఇతర రిలయన్స్ గ్రూప్ షేర్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 10 శాతం, రిలయన్స్ పవర్ 4 శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రా 1.8 శాతం, రిలయన్స్ క్యాపిటల్ షేర్ 1.3 శాతం వరకూ నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment