Religious harmony
-
బ్రిటన్‌లో అమర్ అక్బర్ ఆంటోనీ..! మూడు పదవుల్లో ఆ ముగ్గురు
లండన్: మందిరం, మసీదు, చర్చి.. మత సామరస్యం వెల్లి విరిసేలా ఈ మూడు పక్క పక్కనే ఉంటే ఎంతో హృద్యంగా ఉంటుంది కదా. ఇప్పుడలాంటి దృశ్యమే బ్రిటన్‌లో ఆవిష్కృతమైంది. ఒక్కో మతానికి చెందిన వారు ఒక్కో పదవిలో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను తలపిస్తున్నారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్–3 క్రిస్టియన్. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ముస్లిం. 2016లో నగర తొలి ముస్లిం మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన బస్సు డ్రైవర్ కుమారుడైన సాదిక్ లండన్ లా వర్సిటీ నుంచి న్యాయవాద పట్టా తీసుకొని దశాబ్దానికి పైగా మానవ హక్కుల లాయర్‌గా పనిచేశారు. ఇప్పుడు భారతీయ మూలాలున్న హిందువు రిషి ప్రధాని అయ్యారు. హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తానని రిషి ప్రకటించుకున్నారు. మూడు మతాలకు చెందిన ముగ్గురు బ్రిటన్‌లో కీలక హోదాల్లో ఉండటం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మళ్లీ హోం మంత్రి బ్రేవర్మన్ ప్రధాని కాగానే సునాక్ తన కేబినెట్‌కు టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. భారతీయ మూలాలున్న సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను మళ్లీ హోం మంత్రిగా నియమించారు. ఆర్థికమంత్రి జెరేమీ హంట్‌ను కొనసాగించనున్నారు. తనకు సానుకూలంగా కాకపోయినా విదేశాంగ మంత్రి జేమ్స్ క్లవర్లీనీ కొనసాగిస్తున్నారు. జాన్సన్ హయాంలో ఉపప్రధాని, న్యాయ మంత్రిగా పనిచేసిన డొమినిక్ రాబ్‌ను అవే పదవుల్లో నియమించనున్నారు. మంత్రిత్వ శాఖ వ్యవహారాలు చూసే భారతీయ మూలాలున్న ఎంపీ అలోక్ మిశ్రా తన పదవి నుంచి తప్పుకుంటున్నారు. చదవండి: ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..! -
ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!
మనుషుల మధ్య అంతరాలను పెంచుతున్నప్పుడు అందరం కలిసి మానవీయ సమాజాన్ని కాపాడు కోవాలి. ఏకమైతేనే నిలుస్తామన్న సత్యానికి అల్లుకుపోవాలి. విడి విడిగా విడిపోతే మనకు మనంగా కృంగిపోతాం. సామూహిక తత్వం నశించిపోయిన వ్యవస్థ గడ్డకట్టుకు పోతుంది. కరోనా కాలంలో మాస్క్నే భరించలేని వాళ్ళం మనుషుల మధ్య దూరాలను పెంచుకొని ఎట్లా బతుకుతాం! మనుషులుగా మనం ఎడం ఎడంగా, ఎడమొఖం పెడమొఖంగా, గోడకు కొట్టిన మేకుల్లాగా విడిపోయి ఎట్లా జీవించగలం! వేష భాషలు ఎన్ని ఉన్నా, ఈ ప్రపంచానికి మహా బోధితత్వపు సంఘజీవన భాష ఉంది. మనిషిని మనిషి ద్వేషించుకునే విద్వేష భావజాలం చాలా ప్రమాద కరమైనది. విభిన్న తత్వాల కలయికగా ఉన్న దేశ ప్రజలు... ద్వేషరూపులుగా మారితే మిగిలేది బూడిదే కదా! నువ్వూ నేను, వాడు వీడు, అతను ఆమె ... అందరం పిల్లల మనసులపై కుల విభజన రేఖలు, మతం పచ్చ బొట్లు పొడిస్తే సమతుల్యత అల్ల కల్లోలమై సమాజం గందరంగోళం కాదా? దేన్నైనా భరిస్తాం. దేన్నైనా సహిస్తాం. మన ఇంటి వెనుక, ఇంటి ముందు ఎవరికి వాళ్లుగా కలువలేని గోడలను కట్టుకుంటే మనందరం బావిలో కప్పలుగా మారిపోతాం. ఇట్లే ఎవరి కులం వారిదనీ, ఎవరి మతం వారిదనీ; రంగు, రూపు, ఊరు, వాడ పేర్లతో విభజన రేఖలు గీసుకుంటూ పోతే ఆటవిక సమాజ మూలాల దగ్గరకు పోతాం. వేల సంవత్సరాల సాంస్కృతిక మానవ పరిణామ క్రమాన్నీ, మన ఐకమత్య సమాజ ఉన్నత తత్వాన్నీ... విభేదాల, విద్వేషాల పేరుతో మనకు మనమే కూల్చుకుంటూ పోతే చివరకు మిగిలేదేమిటి? మానవ సంబంధాల వనంలో మానవీయ ప్రేమ మొక్కలు నాటటానికి మారుగా విద్వేషపు మొక్కలు నాటితే దేశమే విద్వేషాల కుంపటిగా మారుతుంది. సమస్త వృత్తుల, సకల కులాల, మతాల ఐక్యమత్య సమాజాన్ని విభజించి చూడగలమా? హుస్సేన్ సాగర్ కీవల ఆవల, గండిపేటకు అటువైపు ఇటువైపు, చార్మినార్‌కు ముందు వెనక బెర్రలు గీసి.. మసీదుకు, మందిరానికి భేదాలు పెట్టి; చర్చిలకు, గుళ్లకు పోటీలు పెట్టి చూసే దుస్థితిని ఊహల దరిదాపులకు సైతం రానివ్వలేం కదా! గుడి, మసీదు, చర్చి అన్నీ ఒకటే. నమ్మకాలు, విశ్వాసాలన్నీ ఎవరి మదిలో వాళ్ళం భద్రంగా గుండె గుండెల్లో దాచు కుందాం. ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ఎవరి వేషధారణలు వారివి. ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి భాషలు వారివి. దేవుళ్ళందరూ ఒకటే. మనుషులందరూ సమానమేనన్న సర్వమత సమానత్వ లౌకికతత్వం మన దేశానికి ప్రాణవాయువు. దాన్ని రక్షించుకుందాం. పరిరక్షించుకుందాం. పరమత సహనం పవిత్ర జెండాగా, మనందరి సామూహిక లక్ష్యంగా, ధ్యేయంగా ముందుకు సాగుదాం. కలలో కూడా మన మానవీయ సమాజ గూడుపై ఎవరు చెయ్యేసినా వదిలేది లేదు. ‘గంగా జమునా తెహాజీబ్’ అని గొప్పగా కీర్తించబడ్డ ఈ నేల మీద మత ముద్రల విభజనలను గీస్తే సహిస్తామా? ఐకమత్య దారులపైనే అభివృద్ధి సగర్వంగా నడుచుకుంటూ పోతుంది. మనందరం ఐకమత్య సమాజానికి చిహ్నాలుగా నిలవాలి. సోదరభావంతో ఎదగాలి. అందర్నీ ఆదరించి అక్కున చేర్చుకునే హైదరాబాద్ మహాసంస్కృతి ఇంకో వేయ్యేళ్లు వర్ధిల్లే విధంగా మనందరం మానవీయ మహా మొక్కల్ని ఎద ఎదలో నాటడాన్ని ఒక మహోద్యమంగా చేపడదాం. విభిన్న సంస్కృతుల సంగమ స్థలిని విష సంస్కృతుల కూడలిగా మార్చే కుట్రలను తిప్పికొడదాం. తెలంగాణ అంటే కలిసి జీవించే ఆత్మీయతల అలయ్ బలాయ్ సంస్కృతి. సబ్బండ వర్ణాల ఐక్య సంస్కృతే తెలంగాణ అసలు అస్తిత్వం. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చెదరగొట్టే కుట్రలు ఎవరు చేసినా వారిని తెలంగాణ సమాజం విడిచిపెట్టదని గుర్తుపెట్టుకోవాలి. తెగించి తెలంగాణను బెర్రగీసి తెచ్చుకున్నోళ్లం సమాజాన్ని ఛిద్రంచేసే మత దురహంకారాన్ని తిప్పికొట్టి తీరాలి. విచ్ఛిన్నకర మత, కుల ఆధిపత్య కుట్రలను చూసి తెలంగాణ విలపిస్తోంది. సమూహాల, గుంపుల తలలు లెక్కలు కట్టుకొని; పోటీపెట్టి, విద్వేషాల్ని రెచ్చగొడుతున్న విచ్ఛిన్నకర శక్తుల్ని చూసి తెలంగాణ తల్లడిల్లుతోంది. సబ్బండ వర్ణాల సంస్కృతిని పరిరక్షించుకోవటానికి తెలంగాణలో జరగాల్సిందేమిటో అభ్యుదయ తెలంగాణ సమాజమే నిర్ణయించుకుని ముందుకు సాగుతది. అలసత్వం వద్దు. చూద్దాంలే చూసుకుంటూ కాసేపా గుదాం అనుకోవద్దు. నాకెందుకులే, మనకెందుకులే, నాదాకా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే అందరూ అయిపోయినాక ఆ మతభూతం చివరివానిగా నిన్ను కూడా వదిలిపెట్టదు. విషవాయువులు వ్యాపించిన ప్రాంతమంతా విషకోరల బారిన పడకతప్పదు. అందులో ఎవరికీ మినహాయింపు ఉండదని గుర్తు పెట్టుకోవాలి. కన్నీళ్లను తుడుచుకుని, ఇప్పటిదాకా పడ్డ కష్టాల పట్టె నుంచి బైట పడుతూ, నెర్రలు బాసిన నేలల్లో పచ్చటి పంటలను చూసి పరవశిస్తూ ముందుకు సాగుతోంది తెలంగాణ. కలహాల చిచ్చులు పెడ్తున్న కుట్రపూరిత రాజకీయ మత పిచ్చిగాళ్ల నుంచి తక్షణం ఈ నేలను రక్షించుకోవాలి. తెలంగాణను కలహాల రణస్థలంగా మార్చే వారిని గుర్తుపట్టాలి. ఆదర్శాలకు అగ్గి పెట్టేవాళ్ల నుంచి తెలంగాణను కాపాడుకోవాలే! (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) ‘మనిషిని ద్వేషించడానికి సరిపడా మతం వుంది మనకు. ప్రేమించడానికి కావలసినంత మతం లేదు’ అన్నాడు జోనాథన్ స్విఫ్ట్. అంటే మనుషులు మను షులుగా బతకడానికి ఇప్పుడున్న మతం సరిపోదు. కాస్త ప్రేమను అరువు తెచ్చుకోవాలి. మనిషిని మనిషితో కలిపి కుట్టే కన్నీటి దారం పేరు ప్రేమ. మనిషిని మనిషితో కలిపి బంధించే ఆనంద ఉద్వేగం పేరు ప్రేమ. ఇప్పుడు మరింత ప్రేమ కావాలి! మరింత సహనం కావాలి!! (క్లిక్: ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు) - జూలూరు గౌరీశంకర్ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
మత విద్వేషాలకు భారీ కుట్ర
సాక్షి, అమరావతి: అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్న రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలను రగిల్చేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇలాంటి సంఘ విద్రోహ చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ఇటీవల భారీ కుట్ర జరుగుతోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడం ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నాయని, ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి విధ్వంసకర శక్తులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే దుశ్చర్యలు.. దేశవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని సీఎస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలపై దాడులు చేస్తూ దేవతామూర్తుల విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. పథకం ప్రకారం విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు సమాజాన్ని విడదీసి ప్రజల దృష్టి మరల్చానే కుట్ర జరుగుతోందన్నారు. దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను, శక్తులను సమాజం అంతా కలిసి అడ్డుకుంటుందని, ఇందులో భాగంగానే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 6 జారీ చేసినట్లు వివరించారు. కమిటీల్లో అన్ని మతాలకు స్థానం.. మతసామరస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటైన కమిటీలు తరచూ సమావేశమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేయడంతోపాటు శాంతియుత వాతావరణం వెల్లివిరిసేలా దోహదం చేస్తాయని సీఎస్ వివరించారు. అన్ని వర్గాల్లో విశ్వాసం, మనోధైర్యాన్ని పెంపొందిస్తూ మత సామరస్యాన్ని పరిరక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మత సామరస్య కమిటీలు దోహదం చేస్తామని సీఎస్ తెలిపారు. కమిటీల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కమిటీలు సందర్శిస్తాయని చెప్పారు. కొన్ని ఘటనలకు సంబంధించి వెంటనే కేసులు నమోదు చేశామని, నిందితులను గుర్తించడంతో పాటు వీటి వెనక ఎవరున్నారో కూడా బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ అధికారులకు కులమతాలను ఆపాదించడం హేయమైన చర్య అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎస్, కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీకి డీజీపీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు, జైన్‌లతో పాటు ఇతర మతాలకు చెందిన ఒక మత పెద్ద ప్రతినిధిగా ఉంటారు. హోం, దేవదాయ, మైనార్టీ వెల్ఫేర్, సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా, ఇతర భాగస్వామ్యులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వైస్ చైర్మన్‌గా జిల్లా ఎస్పీ ఉంటారు. జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ) కన్వీనర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీ విధివిధానాలు.. ►మతవిద్వేషాలను రగిల్చేలా సందేశాలను ప్రచారం చేయడం, మతసామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై చర్చించాలి. ►స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్, ప్రార్థన మందిరాల వద్ద భద్రతా చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలి. మత సామరస్యం పెంపొందించేలా కార్యక్రమాలతో పాటు కార్యాచరణ సిద్ధం చేయాలి. ►జిల్లా స్థాయి మతసామరస్య కమిటీలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలి ►మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ కింద నమోదైన క్రిమినల్ చర్యలన్నింటినీ పరిశీలించాలి. ►మతసామరస్యం వెల్లివిరిసేలా పాఠశాల, కళాశాల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలి జిల్లా స్థాయి కమిటీ విధివిధానాలు ►జిల్లా స్థాయిలో ఏదైన సంఘటన వల్ల మతసామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంటే తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారా గట్టి సంకేతాన్ని పంపాలి. క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలు నిర్వహించాలి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక, మతపరమైన సమతుల్యతను కాపాడే విధంగా జిల్లాస్థాయి కమిటీ సభ్యులు కృషి చేయాలి. ►గతంలో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ►సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు సమీక్షించాలి ►భూములు, లేదా ఇతర సంఘటనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉన్నచోట్ల పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలి. ►ప్రార్థనా మందిరాలు, ప్రముఖ భవనాలు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి. ► ప్రజల్లో మతసామరస్యం పెంపొందించేలా జిల్లా స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ►మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ వివిధ సెక్షన్ల కింద నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పురోగతిపై సమీక్షించాలి. కరెంట్ రంపం వాడిన దుండగులు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం విధ్వంసానికి వినియోగించిన ఎలక్ట్రికల్ రంపాన్నే రాజమహేంద్రవరం, కృష్ణా జిల్లాలో విగ్రహాల ధ్వంసానికి ఉపయోగించినట్లు ఆధారాలు సేకరించామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారం దేవాలయాలపై దాడులు చేస్తూ మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. కేసుల దర్యాప్తులో ఆధారాలను సాంకేతికంగా, ఇతర రూపాల్లో సేకరిస్తున్నామని వాటిని క్రోడీకరించి నిందితులను పట్టుకుంటామని, వారి వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల విచారణ బాధ్యతను సీఐడీ విభాగానికి అప్పగించామన్నారు. ముందే ఒక అభిప్రాయానికి వచ్చి దర్యాప్తు చేయడం లేదని, సీసీ కెమెరాలు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలోనూ దేవాలయాలపై దాడులు జరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవతా విగ్రహమూర్తులపై 2017లో రెండు, 2018లో మూడు, 2019లో ఒకటి, 2020లో 29, ఈ ఏడాది మూడు చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. 2019లో నమోదైన కేసులకు సంబంధించి ఆరు చోట్ల గతంలో దెబ్బతిన్న విగ్రహాలను ఇప్పుడు దెబ్బతిన్నట్లుగా చిత్రీకరించారని తెలిపారు. సమావేశంలో సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్, కమిషనర్ అర్జునరావు, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలో దృశ్యాలు: ఆ ఘటన వెనుక కుట్ర
కర్నూలు: మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర పన్నిన నలుగురు ముఠా సభ్యులను ఆదోని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ ఎస్సీ యువమోర్చా, ఆదోని పట్టణ ప్రధా న కార్యదర్శి వడ్డెమాను పరమేశ్‌తో పాటు ఆదోని పట్టణానికి చెందిన రవికుమార్, ఉలిద్ర అజయ్, నాగలదిన్నె రామకృష్ణ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా కేంద్రంలో ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట హాజరు పర్చారు. వివరాలను ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. ఆదోని పట్టణంలోని రణమండల కొండపై ఉన్న మసీదు గోడపై హిందీలో జైశ్రీరామ్, ఓం, కోట ముఖద్వారంపై ఆంగ్లంలో రాం, ఓం అక్షరాలు పెయింట్‌తో గుర్తు తెలియని వ్యక్తులు రాశారని మసీదు ముతవల్లి అబ్దుల్ సత్తార్ గత నెల 21న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: అనుమతులు గోరంత.. దోచేది కొండంత !) దర్యాప్తులో భాగంగా మసీదు వద్ద అమర్చిన సీసీ ఫుటేజీలను పరిశీలించగా దండుగేరి రవికుమార్, అరుణజ్యోతి నగర్ ఉలిద్ర అజయ్ మసీదులోని వైర్లను కత్తిరించి కరెంట్ సరఫరా నిలిపేసిన దృశ్యాలు లభించాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బీజేపీ ఎస్సీ యువమోర్చా కార్యదర్శి వడ్డెమాను పరమేశ్ డబ్బులిచ్చి నేరానికి ఉసిగొల్పినట్లు అంగీకరించారు. దీంతో నలుగురి నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సెల్ఫోన్లతో పాటు నేరానికి ఉపయోగించిన పెయింట్ డబ్బా, బ్రష్, మోటారు సైకిల్, ఎలక్ట్రికల్ బల్బు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి కొమ్మి ప్రతాప్ శివకిశోర్, ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, ఎస్బీ డీఎస్పీ వెంకట్రాది, సీఐ శ్రీధర్, ఆదోని త్రీ టౌన్ సీఐ నరేష్కుమార్, ఎస్ఐ మన్మథవిజయ్ పాల్గొన్నారు. (చదవండి: ఆంధ్రాలో చంపి.. తెలంగాణలో పాతి పెట్టారు) హుండీ కానుకలు చోరీ చేసింది బాలికలే నంద్యాల పట్టణం గోపాల్‌నగర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న హుండీ కానుకలు చోరీ చేసింది ఇద్దరు బాలికలేనని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ నెల 2న హుండీని ధ్వంసం చేసి సుమారు రూ.35 వేల కానుకలు దొంగలించారని పూజారి సాకుత్ కుమార్ ఫిర్యాదు మేరకు నంద్యాల 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా చిత్తుకాగితాలు ఏరుకునే బండి ఆత్మకూరు మండలం పర్నపల్లి గ్రామానికి చెందిన బాలిక(15), నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన మరో బాలిక(15) ఆలయంలోకి ప్రవేశించి వారి సంచుల్లో ఉన్న ఇనుపరాడ్‌తో హుండీని పెకిలించి నగదు, కానుకలను మూటకట్టుకుని ఉడాయించిన దృశ్యాలు లభ్యమయ్యా యి. పక్కా ఆధారాలతో బాలికలను అరెస్ట్ చేసి బుధవారం ఎస్పీ ఎదుట హాజరు పరచగా ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతరం బాలికలను కర్నూలులోని బాలల పరిశీలన గృహానికి తరలించారు. సమావేశంలో నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి, నంద్యాల 2వ పట్టణ సీఐ కంబగిరి రాముడు పాల్గొన్నారు. -
పరిమళించిన మానవత్వం
బులంద్‌షహర్ : ప్రపంచమంతా కరోనా ధాటికి గడగడ వణుకుతున్న వేళ మానవత్వానికి ఆలంబనగా నిలిచిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో వెలుగు చూసింది. ఆపత్కాలంలో ఆయువు తీరిన నిరుపేద హిందూ మతస్థుడి అంత్యక్రియలకు అయినవారు రాలేకపోయిన వేళ సాటి ముస్లింలు మానవత్వం ప్రదర్శించి మతసామరస్యం చాటారు. మతాల అడ్డుగోడలను అధిగమించి ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచారు. మానవత్వానికి, మతసామరస్యానికి అద్దం పట్టిన ఈ ఘటన బులంద్‌షెహర్‌లోని మౌలానా ఆనంద్ విహార్‌లో చోటుచేసుకుంది. రవిశంకర్ అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో ఆదివారం మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేకపోయారు. నిరుపేద కుటుంబం దీనావస్థను గమనించిన చుట్టుపక్కల ముస్లింలు.. రవిశంకర్ అంత్యక్రియల్లో సాయం చేశారు. స్వయంగా పాడె మోసి మృతదేహాన్ని శ్మశానికి తరలించడంలో సహాయపడ్డారు. భౌతికకాయాన్ని తరలించే సమయంలో 'రామ్ నామ్ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ మతసామరస్యాన్ని చాటారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు. లాక్డౌన్ కారణంగా బంధువులు రాలేకపోయారని, ముస్లిం సోదరుల అండతో తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించామని రవిశంకర్ కుమారుడు చెప్పారు. కరోనా మహమ్మారి విరుచుకుపోతున్న వేళ మునుపెన్నడూ చూడని ప్రత్యేక పరిస్థితులు నెలకొనడంతో దేశంలోని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేదలు, బడుగులు, కూలీలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బులంద్‌షెహర్‌లోని ముస్లింలు చూపిన మానవత్వం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. (వైరల్ వీడియో : వలస కార్మికుడు దీనస్థితి) -
మత సామరస్యం పెంపొందించాలి
సాక్షి, బెంగళూరు: దేశంలోని ప్రజల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని వివిధ మతాలకు చెందిన మత పెద్దలు సూచించారు. ప్రజల్లో మత సామరస్యం, ఐక్యతను పెంపొందించేందుకు నగరంలో ఆదివారం నిర్వహించిన ‘హుస్సేన్ డే’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నగరవాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పూరి పీఠాధిపతి స్వామి అధోక్షానంద్జీ మహారాజ్ శంకరాచార్య మాట్లాడుతూ... ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని పెంచాల్సిన బాధ్యత మత గురువులపై ఎక్కువగా ఉందని తెలిపారు. ఏ మతాన్ని ఆచరించినా తాము భారతీయులమన్న మాటను ఎవ్వరూ మరువరాదని సూచించారు. అనంతరం మజ్లిస్-ఇ-ఉలేమా-ఇ-హింద్ ప్రధాన కార్యదర్శి మౌలానా సయ్యద్ కాల్బే జావాద్ మాట్లాడుతూ... ప్రపంచంలోని ఏ దేశంలోనూ కనిపించని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను భారతదేశం తన ప్రజలకు కల్పించిందని చెప్పారు. ఎవరికైనా సరే తనకు న చ్చిన మతాన్ని అనుసరించే హక్కు ఉందని అన్నారు. తన మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ ఎదుటివారికి హాని తలపెట్టని వాడే నిజమైన ముస్లిం అని ఇస్లాం బోధిస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ముస్లిం నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హ్యారిస్‌తో పాటు ఇతర మతాలకు చెందిన మత గురువులు పాల్గొన్నారు.