పోలీసులపై తిరగబడ్డ గిరిజనులు
నిర్మల్ జిల్లా పెంబిలో రిమాండ్ ఖైదీ మృతిపై ఆందోళన
ఖానాపూర్: రిమాండ్‌లో ఉన్న ఖైదీ మృతి చెందడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఆదివారం గిరిజనులు పోలీసులపై తిరగబడ్డారు. పెంబి మండలంలోని ఇటిక్యాల తండాకు చెందిన ఉమారాణి(22) ఈ నెల 3న ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న మంజ్యానాయక్(80) గుండెపోటుతో శనివారం చనిపోయాడు. ఆదిలాబాద్ నుంచి 24 గంటలు గడిచినా మృతదేహం రావడంలేదని ఆగ్రహంతో రహదారిపై బైఠాయించారు.
కాగా, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని తీసుకురాగా, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతికి కారకులైన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రాథోడ్ రమేశ్, నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ డీఎస్పీ మనోహర్‌రెడ్డి వచ్చి గిరిజన నాయకులను సముదాయించారు.