'పద్మ అవార్డుల్ని విసిరికొట్టండి'
వివిధరంగాల్లో వ్యక్తుల సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అందించే పద్మ అవార్డులపై జేడీ (యూ) నేత శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ లేనివారికి (బే ఇమాన్), అధికారుల అండదండలు ఉన్నవారికి మాత్రమే ఆ అవార్డులు దక్కుతాయన్నారు. సాంఘికవాదులందరూ పద్మ అవార్డుల్ని విసిరికొట్టాలని పిలుపునిచ్చారు.
'పద్మ అవార్టులకు ఎంపియ్యేవారి జాబితా ఒక్కసారి చూడండి.. అందులో రైతులు, ఆదివాసీలు, దళితులు మచ్చుకైనా ఉండరు! ఎందుకంటే అవి అర్హులకు దక్కవు కాబట్టి! గత ఏడాదే కాదు.. గడిచిన 68 ఏళ్లుగా ఈ తంతు జరుగుతూ వస్తున్నదే' అని అన్నారు. శుక్రవారం రాత్రి ఓ సీనియర్ సామాజిక వేత్త సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శరద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశ మహిళల రంగుపై, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఏకంగా పార్లమెంటులోనే కామెంట్లు చేసిన శరద్ యాదవ్.. అనేక విమర్శల్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పద్మ అవార్డులపై ఆయన చేసిన కామెంట్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.