జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం
ఆదేశాలు పాటించకపోవడంపై మండిపాటు
వారంలోగా అమలు చేయాలని ఆదేశం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమ లు చేయకపోవడంపై మండిపడింది. ఫుట్‌పాత్‌లు, రహదారుల ఆక్రమణల తొలగింపుపై తమ ఉత్తర్వులను వారం రోజుల్లో అమలు చేయాలని.. లేని పక్షం లో కోర్టు ధిక్కారం కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాక కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేని స్థితిలో ఉన్నారంటూ తీర్పులో ప్రస్తావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. హైదరాబాద్, సిద్దంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, సోమవారం మరోసారి విచారించింది. కోర్టు ఆదేశించినా ఆక్రమణలు అలానే ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ధర్మాసనం జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడింది. వచ్చే వారంలోపు తమ ఉత్తర్వులను అమలు చేయాలని... లేని పక్షంలో కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ... విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.