వాటా కోసం పాట్లు..!
ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురు చూపు
పంచాయతీలకే నేరుగా జమ చేసిన కేంద్రం
జెడ్పీ, మండల పరిషత్‌లు నిర్వీర్యం
వనరులు లేక రెండంచెలు విలవిల
శ్రీకాకుళం టౌన్: స్థానిక సంస్థల మధ్య వాటాల సమస్య రోజురోజుకూ రగులుతోంది. మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలోగ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు పనిచేస్తున్నాయి. మూడుచోట్ల పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు తమ హోదాలకు తగ్గట్టు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న ఆర్థిక సంఘం నిధులే దిక్కు. ఈ నిధును నేరుగా పంచాయతీల ఖాతాలకే కేంద్రం జమచేయడం, జెడ్పీ వాటాను కేటాయించేందుకు కొందరు సర్పంచ్‌లు అలక్ష్యం చేయడం ప్రస్తుతం సమస్యగా మారింది.
గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవాటాగా 13వ ఆర్థిక సంఘం నిధులు 2011–12 ఆర్థిక సంవత్సరం నుంచి విడుదల చేసింది. మూడు చోట్లకు వేర్వేరుగా కేటాయించేది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015–16లో 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ మిగిలిన రెండంచెలకు నిధుల విడదలను నిలిపివేసింది. వాటి నుంచి ఒక్కో బోర్ వెల్‌కు రూ.1000 చొప్పున, సీడబ్ల్యూస్కీంల నిర్వహణకు కొంత నిధులు తిరిగి జిల్లాపరిషత్ ఖాతాకు జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు పంచాయతీలు వినియోగించుకునేందుకు వీలు లేదని ఆదేశాలిచ్చింది. అయితే, పంచాయతీల నుంచి తిరిగి జెడ్పీలకు నిధులు జమచేయడంలో కొందరు సర్పంచ్‌లు శ్రద్ధ చూపడం లేదు. ఫలితం.. బోర్ మెకానిక్‌ల జీతాలు, వాటర్ స్కీంల నిర్వహణ మూలకు చేరింది. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఒక్క రూపాయి కూడా జిల్లా పరిషత్‌కు విడుదల చేయక పోవడంతో రూ.రెండున్నర కోట్లతోనే కార్యాలయ అవసరాలు, నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అభివృద్ధి పనులు మంజూరుకు వీలులేకుండా పోయిందని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
మండల పరిషత్‌లు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక సంఘం నిధులు ఒక్కో మండలానికి రూ.20 నుంచి 25 లక్షలు విడుదలయ్యేవి. గత రెండేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో కుర్చీలు అలంకారంగా మారుతున్నాయి. జిల్లాలోని 1100 గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి గత ఏడాది రూ.97.99 కోట్లు మంజూరయ్యాయి. తాజాగా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ61.68 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో 25శాతం తాగునీటి పథకాల నిర్వహణకు తిరిగి జిల్లాపరిషత్‌లకు జమచేయాల్సి ఉన్నా సర్పంచ్‌లు సహకరించడంలేదని జిల్లా పరిషత్ అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంఘం నిధులు నేరుగా జిల్లాపరిషత్, మండల పరిషత్‌లకు కేటాయించాలని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కోరుతున్నారు. కేంద్రం పునరాలోచిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదని వారు వాపోతున్నారు.