మొండి బకాయిలు గుదిబండే..!
ఐడియాలు కాదు.. పరిష్కారం కావాలి..
⇒ 2016 డిసెంబర్ నాటికి స్థూల ఎన్పీఏలు రూ.7 లక్షల కోట్లు
⇒ ఒత్తిడిలో ఉన్నవీ కలుపుకుంటే ఇవి సుమారుగా రూ.9 లక్షల కోట్లు
⇒ ఇప్పటి వరకు కేటాయింపులు రూ.3 లక్షల కోట్లే
⇒ రూ.6 లక్షల కోట్లు ఇంకా అందించాల్సి ఉంది
⇒ సమస్య ఆగిపోలేదు... ఎన్పీఏలు పెరిగితే దెబ్బే
⇒ మెకిన్సే ఇండియా హెడ్ రెన్నీ థామస్
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకుల మొండి బకాయిలకు కావాల్సింది ఐడియాలు కాదని, సరైన పరిష్కారమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. స్థూల మొండి బకాయిలు గత డిసెంబర్ నాటికి రూ.7 లక్షల కోట్లను దాటాయి. ఒత్తిడిలో ఉండి పునరుద్ధరించిన రుణాలు సైతం మొండి బకాయిలు (ఎన్పీఏ)గా మారే అవకాశం ఉందనుకుంటే మొత్తం ఎన్పీఏలు రూ.9 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ రూ.9 లక్షల కోట్ల ఎన్పీఏల్లో బ్యాంకులు ఇప్పటి వరకు సర్దుబాటు చేసినవి రూ.3 లక్షల కోట్లేనని, మిగిలిన రూ.6 లక్షల కోట్ల మాటేమిటని మెకిన్సే అండ్ కో దేశీయ విభాగం అధిపతి రెన్నీ థామస్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు దేశీయ బ్యాంకుల ఎన్పీఏలపై ఆయన ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సంఖ్య అనేది ఓ సమస్య కాదని, దీనికి పరిష్కారమన్నది మాత్రం కనిపించడం లేదన్నారు.
మొండి బకాయిలు ఇంకా...?
మొండి బకాయిలు ఇప్పటిస్థాయికంటే ఇక పెరగబోవని బ్యాంకర్లు పేర్కొంటుండగా... రెన్నీ థామస్ దీంతో ఏకీభవించడం లేదు. ‘‘ఎన్పీఏల పెరుగుదల పారిశ్రామిక స్తబ్ధతకు దారితీసింది. ఫలితంగా మరిన్ని రుణాలు మొండి బకాయిలుగా మారనున్నాయి. పారిశ్రామిక ఆర్థిక స్తబ్ధత ఆర్థిక గణాంకాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తిలో వృద్ధి కేవలం 0.3 శాతంగానే ఉంది. స్థూల పెట్టుబడుల స్వరూపంలో తగ్గుదల జీడీపీ వృద్ధి అంచనాల్లో వ్యక్తమవుతోంది. వీటన్నింటినీ చూస్తే, ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్ష పూర్తయినప్పటికీ మొండి బకాయిలు అన్నవి ఇంకా గరిష్ట స్థాయికి చేరలేదని అర్థమవుతోంది’’ అని థామస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మరింత నిదానిస్తే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు.
పరిష్కారమేంటి...?
ఎన్పీఏల సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న విషయంలో ఐడియాలకు కొదవు లేదు. వ్యూహాత్మక రుణ పునరుద్ధరణ, ఎస్4ఏ తదితర పథకాలను ఆర్బీఐ ఇప్పటికే ఆచరణలోకి తెచ్చింది. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేకుంటే... రుణ గ్రహీత కంపెనీల రుణ బకాయిల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకోవడం, ప్రైవేటు రీకన్స్ట్రక్షన్ కంపెనీల(ఏఆర్సీ)ను తెరపైకి తీసుకురావడం జరిగింది. దివాళా కోడ్ను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
విరాళ్ ఆచార్య సూచనలు
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య గత మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎన్పీఏల సమస్యకు రెండు పరిష్కారాలను సూచించారు. ‘‘ఒకటి ప్రైవేటు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం. ఇందులో ప్రభుత్వం కల్పించుకోదు. స్వల్ప కాలంలో ఆర్థికంగా ఆచరణ సాధ్యమయ్యే ఆస్తులను ఇది చక్కబెడుతుంది. ఆస్తుల పునరావాసం, చివరికి అవి అమ్ముడుపోయే వరకు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీయే వాటిని నిర్వహిస్తుంది. రెండోది నేషనల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు. విద్యుత్ వంటి కీలకమైన రంగాల్లో ఒత్తిడిలో ఉన్న ఆస్తులకు పరిష్కారం చూపే విషయంలో ఇది కఠినంగా వ్యవహరిస్తుంది’’ అని విరాళ్ ఆచార్య వివరించారు.
అయితే, ఇండోనేషియా, స్పెయిన్లో అనుసరించిన విధానాలు ఇక్కడ పాటించతగినవిగా రెన్నీ థామస్ సూచించారు. అమెరికాలో ఉన్న సమస్యాత్మక ఆస్తుల పునరావాస కార్యక్రమం కూడా అధ్యయనం చేయతగ్గదన్నారు. అయితే, అక్కడి ప్రభుత్వాల తరహాలో భారత సర్కారు కట్టుబడి ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
నికర విలువకు దగ్గరగా ఎన్పీఏలు
‘‘బ్యాంకుల ఎన్పీఏలు రూ.9లక్షల కోట్లుగా ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు వీటికి కేటాయించింది రూ.3 లక్షల కోట్లే. వీటిని బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం నికర విలువ రూ.8లక్షల కోట్లతో పోల్చి చూస్తే అది అసౌకర్య పరిస్థితే. అదే సమయంలో మరిన్ని ఎన్పీఏలకూ అవకాశం ఉంది. ఈ గణాంకాలే ఆందోళన కలిగిస్తున్నాయి’’ అన్నది రెన్నీ థామస్ వ్యక్తీకరించిన అభిప్రాయం.