పేరుకుపోయిన ‘అద్దె'
- హెచ్ఎండీఏ వాణిజ్య భవనాలపై కమిషనర్ నజర్
- 12లోగా అద్దె బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ
- గడువు ముగిశాక షాపుల సీజ్‌కు నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ వాణిజ్య సముదాయాల్లో అద్దె చెల్లించకుండా కొనసాగుతోన్న కిరాయిదారులపై కమిషనర్ శాలిని మిశ్రా కొరడా ఝుళిపించారు. ఈ నెల 12లోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ హుకుం జారీ చేశారు. ఈ మేరకు అమీర్‌పేటలోని మైత్రివనం, మైత్రి విహార్, స్వర్ణజయంతి, ఆదర్శనగర్‌లోని హెర్మిటేజ్ బిల్డింగ్, తార్నాక కాంప్లెక్స్‌ల్లోని పలువురు లీజు దారులకు తాజాగా నోటీసులు అందాయి.
నిర్దేశిత గడువులోగా అద్దె బకాయిలు హెచ్ఎండీఏ అకౌంట్‌కు జమచేయకుంటే ఆయా షాపులను సీజ్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వారం రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ పీకలపై కత్తిపెట్టడంతో కిరాయిదారుల్లో కలవరం మొదలైంది. కొందరు తట్టాబుట్టా సర్దుకునేందుకు సిద్ధమయ్యారు. హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో నెలవారీగా కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి వచ్చే అద్దెల ఆదాయంపై కమిషనర్ ఆరా తీశారు.
నెలకు సుమారు రూ.1.5 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉండగా అందులో సగం కూడా వసూలు కావట్లేదని, ఇప్పటికే రూ.9 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్లు తేలింది. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆర్అండ్డీ సెక్షన్‌లోని సిబ్బందికి ఛార్జి మెమోలు జారీ చేశారు. హెచ్ఎండీఏ వద్ద ఉన్న డిపాజిట్ సొమ్ముకంటే వారు చెల్లించాల్సిన అద్దె బకాయిలే అదనంగా ఉండటంతో కమిషనర్ అధికారులపై కన్నెర్ర జేశారు. అయితే, కొందరు సిబ్బంది అద్దె బకాయిదారులతో కుమ్మక్కై నెలవారీగా మామూళ్లు పుచ్చుకొంటూ సంస్థ ఆదాయానికి గండికొట్టిన విషయం బహిరంగ రహస్యమే.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో రూ.9 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో గతంలో పార్కింగ్ లాట్ తీసుకొన్న ఓ వ్యక్తి హెచ్ఎండీఏకు లీజు మొత్తం చెల్లించకుండా దర్జాగా వ్యాపారం చేసుకొని తీరా వత్తిడి తేవడంతో ఉడాయించాడు. ఇందుకు ఓ అధికారి సహకరించాడన్న పుకార్లు అప్పట్లో దుమారం రేపాయి. అయితే, ఆ అధికారి పదవీవిరమణ చేయడంతో ఆయన హయాంలో జరిగిన అక్రమాలకు అధికారులు సమాధి కట్టేశారు. ఇలా పలువురు అధికారులు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వండంతో సంస్థకు అద్దె బకాయిలు భారీగా పెరిగిపోయాయి.
వసూళ్లకు ప్రత్యేక బృందాలు..
అద్దె బకాయిల వసూలును సీరియస్‌గా తీసుకొన్న హెచ్ఎండీఏ కమిషనర్ ఇం దుకోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక తహశీల్దార్/ఏఓ, ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించి వారికి వసూలు బాధ్యతను అప్పగిం చారు. ఒక్కో కాంప్లెక్స్‌కు ఒక బృం దాన్ని నియమించి ఈనెల 12లోగా బకాయిలు మొత్తం వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అప్పటికీ స్పందించకపోతే గడువు తీరాక, ఆయా షాపులను సీజ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.
ఈమేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి బకాయిదారులపై వత్తిడి తెచ్చారు. గతంలో సకల జనుల సమ్మె సందర్భంగా 45 రోజుల పాటు తాము షాపులను మూసుకోవాల్సి వచ్చిందనీ, వ్యాపారాలు సాగకపోవడంతో అప్పట్లో అద్దె చెల్లించలేకపోయామే తప్పా ఎగ్గొట్టాలనే ఆలోచన తమకు లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. ఒకేసారి కాకుండా రెండు మూడు వాయిదాల్లో అద్దె బకాయిలు చెల్లించే విధంగా తమకు వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు,