rentala jayadeva
-
అలీకి అన్నం పెట్టిన... దాసరి 5 వేలు!
“ఇప్పటికి 1200కు పైగా సినిమాల్లో నటించిన నేను నా తొలి రోజుల్లో పడ్డ కష్టాలను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజుల్లో నా లాంటి ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టి ఆదరించి, అవకాశాలిచ్చి ఆదుకున్న పెద్ద వ్యక్తి దాసరి” అని ప్రముఖ నటుడు అలీ గుర్తు చేసుకున్నారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడిగా వినుతికెక్కిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘వంశీ ఇంటర్నేషనల్’ సంస్థ, దాని అధినేత వంశీ రామరాజు హైదరాబాద్‌లో తెలుగు ‘డైరెక్టర్స్ డే’ జరిపారు. త్యాగరాయగానసభలో జరిగిన ఆ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న అలీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.అప్పట్లో మద్రాసులో ఏటా డిసెంబర్ 31న దాసరి గారు అయ్యప్ప పూజ నిర్వహించేవారు. సినీ రంగంలోని ప్రముఖుల మొదలు సామాన్యుల దాకా అందరూ దాసరి ఇంట్లోని ఆ పూజకు హాజరయ్యేవారు. పూజయ్యాక అక్కడే అందరికీ భోజన ప్రసాదాలు. అంతేకాకుండా, ప్రతి ఒక్కరికీ రూ. 2 నుంచి రూ. 5 వేల దాకా వేర్వేరు మొత్తాల్లో డబ్బులున్న కవర్లు పంచేవారు. ఎవరికి ఏ మొత్తం ఉన్న కవర్ అందుతున్నది అదృష్టం. కొత్త సంవత్సరం రాబోయే ముందు దాసరి చేతుల మీదుగా అలా డబ్బులు అందుకోవడం శుభసూచకంగా అందరూ భావించేవారు. ముఖ్యంగా, జరుగుబాటు కష్టంగా ఉన్న సామాన్య సినీ కార్మికులు, కళాకారులు అందరూ అధిక మొత్తం డబ్బులున్న కవర్ తమ చేతికి వస్తే బాగుండని ఆశ పడుతుండేవారు.‘వంశీ – దాసరి… ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు అందుకున్న నటుడు అలీ మాట్లాడుతూ, “పరిశ్రమలో అవకాశాల కోసం కష్టపడుతున్న తొలి రోజుల్లో నేను కూడా దాసరి గారి అయ్యప్ప పూజకు వెళ్ళాను. ప్రసాదం తీసుకున్నాక, దాసరి గారి చేతుల మీదుగా నూతన సంవత్సర శుభాకాంక్షల కవర్ తీసుకున్నాను. బయటకొచ్చి చూస్తే, ఏకంగా రూ.5 వేలున్నాయి అందులో అలా అదృష్టం నన్ను వరించింది. అప్పట్లో నెలకు రెండు పూటలా భోజనానికి మెస్ టికెట్ల కార్డు రూ. 170 కట్టాలి. దానికి కూడా కష్టపడుతున్న నాకు దాసరి వరాలిచ్చిన దేవుడిలా కనిపించారు. ఆ డబ్బుల్లో రూ. 4 వేలు తీసుకెళ్ళి, అప్పటికప్పుడు మెస్ లో కట్టేసి, ఆ డబ్బులకు సరిపడా మెస్ టికెట్ల కార్డులు తీసుకున్నాను. అంటే, ఆ రూ. 4 వేలకు సరిపడా రోజుల దాకా నాకు మద్రాసులో భోజనానికి ఢోకా లేకుండా చేసింది – గురువు గారు దాసరి గారి చేతి చలవే! నాలుగు వేలు పోగా, మిగిలిన వెయ్యి రూపాయలు ఊళ్ళో ఉన్న మా అమ్మ గారికి పంపించాను. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను” అన్నారు.హీరోగా అలీ డేట్లడిగిన దాసరి!నటుడిగా ఎదిగి, హీరోగా ‘యమలీల’తో ఘన విజయం అందుకున్న తర్వాత దాసరితో ఎదురైన మరో అనుభవాన్ని కూడా అలీ పంచుకున్నారు. “కమెడియన్‌గా గుర్తింపు పొందాక ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో హీరోగా ‘యమలీల’తో కమర్షియల్ హిట్ సాధించడం మరో పెద్ద విజయం. ఆ సినిమా సూపర్ హిట్టయిన రోజుల్లో ఒకసారి హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో దాసరి నన్ను చూశారు. ప్రత్యేకంగా నన్ను పిలిచి, అభినందించారు. దాసరి గారి మాతృమూర్తి కన్నుమూసి అప్పటికి కొద్ది కాలమైంది. మదర్ సెంటిమెంట్ నిండిన ‘యమలీల’కు ఆయన బాగా కనెక్టయ్యారు. ‘పిక్చర్ చాలా బాగుందయ్యా. ముఖ్యంగా, అమ్మ పాత్రతో నీ సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నీలో ఇంత మంచి నటుడున్నాడనీ, హీరో మెటీరియల్ ఉందని నేను గుర్తించలేదు. నువ్వు డేట్స్ ఇస్తే, నిన్ను హీరోగా పెట్టి ఓ మంచి సినిమా చేస్తా’ అన్నారు దాసరి గారు. నా ఆనందానికి అవధులు లేవు. ఉబ్బితబ్బిబ్బై ‘మీరు ఎప్పుడంటే అప్పుడు చేద్దాం గురువు గారూ’ అన్నాను. కానీ, ఆ తరువాత ఆయన రాజకీయాలు వగైరాతో బిజీ అయిపోవడంతో ఆ ఛాన్స్ తప్పిపోయింది. అనుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు” అని అలీ ఆ సంగతులు వివరించారు.“తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలతో పాటు నేపాలీ భాషలోనూ నటించే అదృష్టం నాకు దక్కింది. తెలుగు నటులమైన నన్ను, బ్రహ్మానందం గారిని అక్కడి నేపాలీ ప్రేక్షకులు గుర్తుపట్టి, అభిమానించడం మరపురాని విషయం. ఇప్పటికి 1200కి పైగా సినిమాల్లో నటించాను. మరో రెండేళ్ళలో 2028లో సినీ రంగంలో నాకు 50 ఏళ్ళు నిండుతాయి. గతంలో బెస్ట్ కమెడియన్, బెస్ట్ హీరో, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఇలా అనేక అవార్డులు వంశీ సంస్థ నుంచి అందుకున్నా, ఇప్పుడు ఇలాంటి సమయంలో వంశీ సంస్థ నుంచి దాసరి గారి పేరిట ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అని గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది” అని ఆయన తన ఆనందానుభూతిని పంచుకున్నారు.ఇద్దరు కమెడియన్లను కలిపిన అమ్మ ప్రేమ!మరో ప్రముఖ నటుడు శివారెడ్డి సైతం ఈ సందర్భంగా దాసరి గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. “సినీ రంగానికి గురువు లాంటి పెద్దాయన పేరు మీద నాకు ‘నవరస నటుడు’ అంటూ అవార్డుతో అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. అలీ గారికి వారి అమ్మ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. అలీ గారినీ, నన్నూ కలిపిన అతి పెద్ద బంధం కూడా అమ్మ ప్రేమ. అమ్మ అనేది రెండక్షరాలే అయినా, ఆ పదంలోని ఆత్మీయత, అనుబంధం అందరికీ ఒకటే. ఆయన నాకు అన్న లాంటివాడే కాదు... సినీ రంగంలోనూ, వ్యక్తిగతంగానూ దేవుడు. నాకు ఆదర్శప్రాయుడు. ఇవాళ ఆయన ఇంటి పక్కనే నేనూ నివసిస్తున్నాను. అది అక్షరాలా అలీ అన్న చలవే” అని శివారెడ్డి వ్యాఖ్యానించారు.ప్రముఖ సాహితీవేత్త వోలేటి పార్వతీశం సభాధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 35 మంది ప్రతిభావంతులను అవార్డులతో సముచిత రీతిన సత్కరించడం విశేషం.వివిధ రంగాల్లోని ప్రతిభకు పట్టం!‘ఆపరేషన్ సిందూర్’ లాంటి అంశాన్ని తీసుకొని, ‘వందే భారత్’ చలనచిత్రాన్ని రూపొందించిన దర్శక – నిర్మాత మల్లం రమేశ్‌కు ‘సెన్సేషనల్ ఫిల్మ్’ అవార్డు అందజేశారు. తెలుగునాట రాష్ట్ర ప్రభుత్వాల నంది, గద్దర్ అవార్డులు రెంటినీ పొందిన తొలి జర్నలిస్టు అయిన డాక్టర్ రెంటాల జయదేవకు ప్రత్యేకంగా ‘ఉత్తమ సినీ విమర్శకుడు – చరిత్రకారుడు’ అవార్డును అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేసి, గౌరవించారు. అలాగే, మరో సీనియర్ జర్నలిస్ట్, సినీ గ్రంథ రచయిత, సినీ రచయిత పులగం చిన్నారాయణకు ‘బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్’ అవార్డునిచ్చారు.సినీ రంగంతో పాటు సంగీతం, సాహిత్యం, విద్య, వైద్యం, సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ‘వంశీ – దాసరి గ్లోబల్ అవార్డు’లను అలీ, శివారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే, ప్రవాస రాష్ట్ర – భారతీయ సంస్థల ప్రతినిధులతో పాటు, ఆదర్శ దంపతులను సైతం ప్రత్యేకంగా గుర్తించి గౌరవించారు.డైరెక్టర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శక సమ్రాట్!1972లో స్థాపితమైన వంశీ సంస్థ ఇప్పటికి 54 ఏళ్ళుగా సాంస్కృతిక రంగంలో ఉంటూ, వివిధ దేశాలకు సైతం విస్తరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికే 3 విశ్వవిద్యాలయాల్లో తమ సంస్థ పక్షాన ప్రతిభావంతుల్ని గుర్తించేలా స్వర్ణపతకాలు ఏర్పాటుచేసినట్టు వంశీ రామరాజు వివరించారు. సాహితీ, సినీ రంగాల్లో మరపురాని సేవలు అందించిన మహామహుల్ని క్రమం తప్పకుండా స్మరించుకోవడానికి సంస్థ సాగిస్తున్న కృషిని వోలేటి పార్వతీశం ప్రశంసించారు. “దాసరి కన్నా ముందు ఎందరో దిగ్గజ దర్శకమూర్తులు లేకపోలేదు. వారు ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించనూ లేకపోలేదు. కానీ, దర్శకుడికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చి, డైరెక్టర్ పేరు మీద సినిమా చూడాలనే ఆసక్తిని ప్రేక్షకులలో కలిగించిన దిగ్దర్శకుడు దాసరి. కౌటుంబిక కథలు, సన్నివేశాలు, సామాన్యంగా అనిపించే, వినిపించే టైటిల్స్‌తోనే అఖండ విజయాలు సాధించిన దర్శక సమ్రాట్ ఆయన” అని పార్వతీశం విశ్లేషించారు.కళాత్మకత... కమర్షియాలిటీల మేళవింపు!‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి డాక్టర్ వెలుదండ నిత్యానందరావు సోదాహరణ పూర్వక విశ్లేషణ సాగిస్తూ, “కుటుంబ ఇతివృత్తాలు, వ్యంగ్యం నిండిన డైలాగులు, నూతన ప్రతిభాన్వేషణ, వేగవంతమైన సినీ రూపకల్పన... దాసరి ప్రత్యేకత. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ లాంటి చిత్రాల్లో కథావస్తు స్వీకరణలో ఆయన చూపిన కొత్తదనం కనిపిస్తుంది. ‘మేఘసందేశం’ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన ‘ఆకులో ఆకునై...’ లాంటి గీతాన్ని సందర్భోచితంగా వాడుకోవడం దర్శకుడి కళాత్మకతను తెలియబరుస్తుంది. అందుకే దాసరి అటు కళాత్మకతకు, ఇటు వాణిజ్య అంశాల్ని మేళవించిన అపురూప దర్శకుడు. ఒకప్పుడు ‘వంశీ – బర్కిలీ’ అవార్డు పొందిన ఆయన ఆ పైన తన పేరు మీదే ‘దాసరి – వంశీ’ అవార్డులిచ్చే స్థాయికి ఎదగడం, 150 సినిమాలకు దర్శకత్వం వహించడం అసాధారణం” అని పేర్కొన్నారు. 1987లో ‘ఉదయం’ పత్రికతో దాసరి సృష్టించిన సంచలనాన్ని ప్రస్తావిస్తూ, తాను ఎం.ఏ. విద్యార్థిగా ఉన్న రోజుల్లో తన తొలినాళ్ళ సాహితీ వ్యాసాలెన్నో ఆ పత్రికలోనే వచ్చాయని వైస్ – ఛాన్సలర్ గుర్తు చేసుకున్నారు.ఈ అవార్డుల ప్రదానోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని, వివిధ రంగాల ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం ఎప్పుడూ ముందుంటాయని నిత్యానందరావు తెలియజేయడం విశేషం. ఎంతైనా, ఆయనే అన్నట్టు “యోగ్యులనూ, అర్హులనూ గౌరవించి, సత్కరిస్తే... అది వారిని గౌరవించినట్టు కాదు... మనల్ని మనం గౌరవించుకున్నట్టు!”- రెంటాల జయదేవ -
అక్షరాల... సినిమా బయోపిక్
ప్రముఖుల జీవితకథలు పుస్తకాలుగా నిరంతర ఆదరణకు నోచుకుంటాయి. అందులోనూ వారు సినీ తారలైతే ఇక చెప్పేది ఏముంది! సినీ తారల పట్ల అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది. సదరు సినిమా తార అనేక విధాలుగా ప్రథమశ్రేణిలో నిలిచిన వ్యక్తి అయితే, చారిత్రకంగానూ ఆ రచనకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి భారతీయ బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’ (1936)లో టైటిల్ రోల్ ధరించడంతో మొదలుపెట్టి, హీరోయిన్గా ఎదిగి, దర్శక – నిర్మాత మీర్జాపురం రాజా వారితో వివాహంతో మహారాణిగా మారి, స్వయంగా నిర్మాత అయి, శోభనాచలా సినీ స్టూడియో అధినేత్రిగా నిరూపించుకొని, నూరేళ్ళ నిండు జీవితం గడిపి, ఇటీవలే మరణించిన చిత్తజల్లు కృష్ణవేణి (1924 – 2025) జీవిత కథ అందుకనే ఆసక్తిగా అనిపిస్తుంది.జీవితచరిత్రను సైతం కేవలం వివరాలు, విశేషాలను ఏకరవు పెట్టే రూపంలో కాకుండా, కాల్పనిక సాహిత్య మార్గంలో ఒక మంచి నవలను చదువుతున్న పద్ధతిలో అందించడం ఎప్పుడైనా ఆకర్షించే పద్ధతే. సమకాలీన రచయితలు కొందరు ఆ కోవలో అక్షరబద్ధం చేసిన జీవిత కథలు సాహితీ లోకానికి ఇప్పటికే సుపరిచితం. పైగా, రచయిత్రి పల్లవి రాసిన మహానటి సావిత్రి జీవితకథ ‘సావిత్రి’ లాంటివి గతంలో బెస్ట్ సెల్లర్స్ కావడమూ అందుకు నిదర్శనం. ఆ రకమైన రచనా సంవిధానంలో మెప్పించే మెరుపులు చాలానే ఉంటాయి కానీ, కొన్నిసార్లు... అసలు జరిగిన వాస్తవమేదో, కొసరు కవికల్పన ఏదో తెలియనంతగా పాలు, నీళ్ళు కలసినట్టు సాగిపోతాయి. వీలైనంత వరకు చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను పేర్కొంటూనే, సంఘటనను నాటకీయంగా చెప్పడంలో రచయిత నిజాయతీ, నైపుణ్యం రాణకెక్కుతాయి. ఉత్తమ పత్రికా రచయితగా నంది అవార్డులు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ భగీరథ తన తాజా ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచనలో అక్షరాలా చేసినది అదే!ఒక మంచి ఇతివృత్తం చేయి తిరిగిన వ్యక్తి చేతిలో పడినప్పుడు అది కొత్త సొబగులు సంతరించుకోవడం సహజం. రచయితగా, పత్రికా రచయితగా ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న భగీరథ ఈ రచనలో దాన్ని సమర్థంగా వినియోగించారు. ఇటీవల ఎన్టీఆర్‌పై ‘తారకరామం’, ‘శకపురుషుడు’ లాంటి పుస్తకాలు, అలాగే కృష్ణదేవరాయల కాలంపై రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి’ ద్వారా నవతరం పాఠకులకు సైతం ఆయన సుపరిచితులే. సినీ సుప్రసిద్ధుల జీవిత కథలు రాయడం కూడా ఆయనకేమీ కొత్త కాదు. గతంలో నటి జమున అంతరంగావిష్కరణ ‘జమునా తీరం’, భాగ్యనగర్ స్టూడియోస్ వ్యవస్థాపక అధినేత బాదం రామస్వామిపై ‘మహర్జాతకుడు’, హీరో జగపతి బాబు తండ్రి – ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌పై ‘దసరా బుల్లోడు’ లాంటి సినీ జీవిత కథలు ఆయన కలం నుంచి వచ్చి, అశేష ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు అలనాటి హీరోయిన్ కృష్ణవేణి కుమార్తె, ప్రముఖ నిర్మాత ఎన్.ఆర్. అనూరాధాదేవి పనుపున భగీరథ ఈ ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచన చేశారు. కృష్ణవేణి జీవితంతో పాటు ఆ సమకాలీన పరిస్థితుల్ని రచనలో ప్రతిబింబించేందుకు రచయిత కసరత్తు చేశారు. నిజానికి, నటుడు ఎన్టీఆర్ – సంగీత దర్శకుడు ఘంటసాల – సుస్వరాల రమేశ్ నాయుడు... ఇలా ఎందరో మహామహుల్ని సినీ రంగానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది.చిన్న వయసులోనే తల్లి లేని బిడ్డగా సవతి తల్లితో ఇబ్బందులు పడడం, పిన్ని – బాబాయ్ వద్ద పెరగడం, రంగస్థలంపై ఆసక్తి పెరగడం, అప్పట్లో భానుమతి, రేలంగి, అంజలీదేవి సహా ఎందరినో స్టార్లుగా తీర్చిదిద్ది ‘తారాబ్రహ్మ’గా పేరొందిన సినీ దర్శక – నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహం లభించడం, ఎనిమిది – తొమ్మిదేళ్ళ వయసులోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ’లో టైటిల్ రోల్ పోషించడం, పితృసమానుడైన పుల్లయ్య గారి మీద అపార గౌరవంతో యర్రంశెట్టి కృష్ణవేణి కాస్తా చిత్తజల్లు కృష్ణవేణిగా మారడం, ఆ పైన హీరోయిన్గా రాణించడం, మీర్జాపురం రాజా వారు (మేకా వెంకట్రామయ్య అప్పారావు)తో వివాహం, భర్త జస్టిస్ పార్టీ అయితే తాను కాంగ్రెస్ సానుభూతిపరురాలిగా ‘మన దేశం’ (1949) లాంటి చిత్ర నిర్మాణం సాగించడం, ‘కీలుగుర్రం’ – ‘గొల్లభామ’, 'లక్ష్మమ్మ' లాంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాల రూపకల్పన లాంటి తొలినాళ్ళ సినీ చరిత్రలోని ఆసక్తికరమైన ఘట్టాలెన్నో ఈ రచనలో చదవవచ్చు. నిండు నూరేళ్ళు జీవించిన ఆమె ప్రస్థానంలోని అనేక ఘట్టాలను చదువుతుంటే... అచ్చంగా ఓ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా ఈ రచనా శైలి సాగుతుంది. ప్రతి సంఘటననూ దృశ్యమానమయ్యే రీతిలో రాయడంతో... ఒక రకంగా ఇది కాగితంపై అక్షరాలలో కనిపించే ఓ బయోపిక్ అనవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ మొదలు ‘సాక్షి – ఎక్సలెన్స్ అవార్డ్’ (లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్) సహా ఎన్నో గుర్తింపులు పొందిన సి. కృష్ణవేణి జీవితకథ చదువుతుంటే... కేవలం ఓ వ్యక్తి జీవితంగా అనిపించదు. దాదాపు నూరేళ్ళ కాలగతిలో సమాజంలోనూ, సినిమాలోనూ వచ్చిన మార్పులు సైతం కళ్ళ ముందు రీళ్ళు తిరుగుతాయి. మహిళలను ద్వితీయశ్రేణి వ్యక్తులుగా చూస్తూ, సమాజం ఇంతగా పురోగమించని రోజుల్లోనే... కృష్ణవేణి సాగించిన జీవితం, సాధించిన విజయం అబ్బురపరుస్తాయి. ఇవాళ్టికీ ఎందరికో స్ఫూర్తిమంత్రంగా నిలుస్తాయి. అరుదైన ఫోటోలతో పాటు, అవి అందుబాటులో లేని కీలక ఘట్టాలకు రేఖాచిత్రాలను సుప్రసిద్ధ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్‌తో ప్రత్యేకంగా గీయించడం ఈ 516 పేజీల రచనకు వన్నె తెచ్చింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అనేక అడ్డంకులున్న ఆ రోజుల్లోనే ఎంత సమున్నత స్థాయికి చేరి, నూరేళ్ళ జీవితాన్ని పండించుకుందో తెలిపే ఈ రచన నేటి తరానికీ ప్రేరణనిచ్చే పాఠం. ఆపకుండా చదివించడంతో పాటు... అన్నీ కళ్ళ ముందే జరుగుతున్న అనుభూతిని కలిగించడంతో... ఈ జీవితకథ సినీచరిత్రపై ఆసక్తి గలవారికి అందమైన బహుమానం.మీర్జాపురం రాణి... కృష్ణవేణి (నటి కృష్ణవేణి జీవితకథ), రచన – భగీరథ, ప్రతులకు – నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్. మొబైల్ – 92474 71361).– రెంటాల జయదేవ -
ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి, ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్‌గా!
పుణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్టీఐఐ) గురించి ఇవాళ జాతీయంగానే కాదు... అంతర్జాతీయంగానూ బాగా తెలుసు. కానీ, 1961లో కేవలం రూ. 3 లక్షల వార్షిక బడ్జెట్‌తో ఆ సంస్థను ఆరంభించినప్పుడు దాన్ని ఇలాంటి ఓ వ్యవస్థగా తీర్చిదిద్దడం వెనుక ఉన్న అరుదైన వ్యక్తి గురించి కొద్దిమందికే తెలుసు. ఆయన... జగత్ మురారి (1922–2007). స్వయంగా ఫిల్మ్మేకరైన ఆయన జీవితకథ, ఆయన సారథ్యంలో సినీ సృజనాత్మక కార్యశాలగా ఎఫ్టీఐఐ అవతరించిన కీలక సమయం, సందర్భాలకు చెరగని అక్షరరూపం... ‘ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’. భవిష్యత్ సినీ రూపకర్తలను తండ్రి తీర్చిదిద్దుతున్న సమయంలో ఆ సృజనాత్మక ప్రాంగణంలో పెరిగిన రాధ ఇప్పుడు ఆ పురావైభవ చరిత్రను ఆసక్తికరంగా అందించారు. పట్నాలో ఓ మామూలు కుటుంబంలో పుట్టి, ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయి, ఒంటరి తండ్రి పెంపకంలో పెరిగి, భౌతికశాస్త్రం చదువుకొన్న జగత్ అసలు సైంటిస్ట్ కావాల్సిన వ్యక్తి. అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సినిమా చదువు చదువుకొని, ఆయన కళారంగంలోకి రావడం యాదృచ్ఛికమే అయినా, భారతీయ సినీ రంగానికి బోలెడంత మేలు చేసింది. ఫిల్మ్స్ డివిజన్లో కెరీర్‌ను మొదలుపెట్టి, 1940లు, 50లలో పలు డాక్యుమెంటరీ లతో భారతీయ ఆత్మను కెమెరాతో కోట్లాది జనం ముందుకు తెచ్చారు. తొలి రాష్ట్రపతి స్వర్ణపతకం (ఇప్పటి పరిభాషలో నేషనల్ అవార్డ్) సాధించిన ఘనత ఆయన తీసిన ‘మహాబలిపురం’ (1952) డాక్యు మెంటరీదే! అందుకే, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను పెట్టాలనుకున్నప్పుడు దాని సారథ్యానికి అన్నివిధాలా ఆయనే అర్హుడయ్యారు. 1947లో ‘మ్యాక్బెత్’ తీస్తున్న సినీ దిగ్గజం ఆర్సన్ వెల్స్ వద్ద పాఠాలు నేర్చుకున్న జగత్ ఆ తరువాత ఎందరికో పాఠాలు చెప్పే గురువయ్యారు. ఎఫ్టీఐఐకి ప్రిన్సిపాల్‌గా జగత్ దూరదృష్టి అపూర్వ పథనిర్దేశం చేసింది. జయా బచ్చన్, షబానా ఆజ్మీ, సుభాష్ ఘయ్, అదూర్ గోపాలకృష్ణన్, శత్రుఘ్నసిన్హా లాంటి ఎందరో నటులు, దర్శకులు, ఇంకా సినిమా టోగ్రాఫర్లు, ఎడిటర్లు ఆయన వదిలిన బాణాలే. భారతీయ సినీ రంగంలో ‘న్యూ వేవ్ సినిమా’కు వారే కీలక పాత్రధారులు. ముఖ్యమైన వ్యక్తిగా ఉండడం కన్నా మంచి వ్యక్తిగా ఉండడం ప్రధానం – ఇదీ జగత్ జీవన తాత్త్వికత. పుణేలోని ప్రసిద్ధ జయకర్ బంగళా (ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫీసు)లోని నివాసంలో విద్యార్థుల్ని సొంత బిడ్డల్లా చూసిన వైనం, అలాగే ఆయన జీతం పెంపు కోసం అప్పటి సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ జోక్యం చేసు కోవడం లాంటివి అబ్బురపరుస్తాయి. అప్పటికే ప్రసిద్ధ సినిమాలు తీసినా, అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో వీధిన పడ్డ ముగ్గురు చిన్నపిల్లల తండ్రి రిత్విక్ ఘటక్‌ను ఎఫ్టీఐఐలో వైస్ ప్రిన్సిపాల్‌గా తీసు కోవడానికి జగత్ పడ్డ కష్టం, అవస్థలు పడుతూనే రిత్విక్‌ను కాపాడుకొనేందుకు పడిన శ్రమ చదువుతూ గుండె చిక్కబట్టుకోవడం కష్టం. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆరంభ, వికాసాలకు జగత్ చేసిన అపార కృషి సహా ఎన్నో సంఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ఇదీ చదవండి: Cyclone Montha.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!జగత్ రాసుకున్న డైరీలు, దాచిపెట్టుకొన్న ఆత్మ కథ నోట్సులు ప్రధాన ఆధారమైనప్పటికీ, ఈ రచన కోసం లోతుగా పరిశోధించి, అనేక అంశాలను గుదిగుచ్చారని అర్థమవుతుంది. అదే సమయంలోఈ పుస్తకం ఒక మంచి నవలలా సాగుతూ, భారత సినీ చరిత్రలో అవిస్మరణీయ అధ్యాయాన్ని పాఠకుల ముందు ఉంచుతుంది. ఇవాళ్టికీ రికార్డు కాని ఇలాంటి తెర వెనుక కథలు, వ్యక్తుల విశేషాలెన్నో తెలుసు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అరుదైన ఫొటోలు, అనుబంధ సమాచారం అదనపు హంగులు. భారతీయ డాక్యుమెంటరీ చిత్రనిర్మాణ చరిత్రలో ప్రత్యేక స్థానమున్న జగత్‌తో పాటు ఎఫ్టీఐఐ తొలి నాళ్ళను తెలుసుకోవడానికి ఈ రచన సినీ ప్రియులకు ఓ అపురూప సమాచార విందు! -రెంటాల జయదేవ(‘ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’ : హౌ జగత్ మురారి అండ్ ఎఫ్.టి.ఐ.ఐ. ఛేంజ్డ్ ఇండియన్ సినిమా ఫరెవర్ రచయిత్రి – కాలమిస్ట్ : రాధా చడ్ఢా) -
తెలంగాణ గద్దర్ అవార్డులు.. ఉత్తమ సినీ గ్రంథంగా రెంటాల జయదేవ పుస్తకం
రచయిత, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డు వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలపై ఆయన రచించిన 'మన సినిమా... ఫస్ట్ రీల్' అనే పుస్తకం ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు అవార్డ్ లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ ఈ విషయాన్ని ప్రకటించింది.దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ల పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం ఈ మన సినిమా... ఫస్ట్ రీల్ పుస్తకం. ఇప్పటికీ మన సినీ చరిత్రలో నమోదు కాకుండా మిగిలిపోయిన అనేక అంశాలను తవ్వి తీసిన అరుదైన రచన ఇది. మూకీ సినిమాల రోజుల నుంచి తెర మీద బొమ్మ మాటలు నేర్చి.. భాషల వారీగా ప్రత్యేక శాఖలుగా విడివడిన టాకీల తొలి రోజుల దాకా మన భారతీయ సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాలో జరిగిన మనకు తెలియని అనేక పరిణామాలను సాక్ష్యాలతో, సవిశ్లేషణాత్మకంగా రాసిన గ్రంథం ఇది. రచయిత జయదేవ శ్రమించి సేకరించిన దాదాపు వందేళ్ల క్రితం అలనాటి పత్రికా సమాచారం, ఫోటోల లాంటి ప్రామాణిక ఆధారాలతో... అరుదైన సమాచారంతో... ఈ సినీ చరిత్ర రచన సాగింది.తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం కాళిదాస్(1931)పై అనేక కొత్త సంగతులను రెంటాల జయదేవ ఇందులో తవ్వితీశారు. నిజానికి, అది ఒక సినిమా కాదనీ.. మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారమనీ, అందులో ప్రధాన భాగమైన ‘కాళిదాస్’ కథాచిత్రం మాత్రం 4 రీళ్ల నిడివిలో పూర్తిగా తెలుగులోనే తీసిన లఘుచిత్రమని తెలిపారు. అలనాటి సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని నిరూపించారు. తమిళులు దాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే... పూర్తి తెలుగు డైలాగులు ఆ సినిమాను తెలుగువాళ్లం మన సినీ చరిత్ర లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామని గుర్తుచేశారు. అలా మనం విస్మరిస్తున్న మన తొలినాళ్ల తెలుగు సినీచరిత్రను అక్షరబద్ధం చేశారు.హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీసీమల్లో వచ్చిన మొట్టమొదటి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ రచనలో జయదేవ అందించారు. అత్యంత అరుదైన దాదాపు 2 వేల పత్రికా ప్రకటనలు, ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 90 ఏళ్ల చరిత్ర గల ప్రతిష్ఠాత్మక పుస్తక ప్రచురణ సంస్థ ఎమెస్కో 566 పేజీల ఈ బృహత్ రచనను ప్రచురించింది. ఈ పుస్తకం పండిత, పామరుల ప్రశంసలందుకొని, ప్రామాణిక చరిత్ర గ్రంథంగా పాఠక లోకంలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది.ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా.. అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుంచి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని జయదేవ సేకరించి మన సినిమా... ఫస్ట్ రీల్ అనే పుస్తకంలో పొందుపరిచారు. పైపైన వివరాలకు పరిమితం కాకుండా సినిమాల రూపకల్పన, అందుకు జరిగిన కసరత్తు, నటీనటుల ఎంపిక, వాటి విడుదలకు నిర్మాతలు పడిన పాట్లు, అనేక పరిమితుల మధ్యనే ఆనాటి దర్శకులు చూపిన సృజనశీలత, అప్పటి సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాల తీరు, సినిమా వ్యాపారం జరిగే పద్ధతులు, కాలానుగుణంగా వచ్చిన పరిణామాలు... అన్నీ ఈ రచనలో కళ్లకు కట్టినట్లు వివరించారు.తెలుగునాట రచయితగా, పరిశోధకుడిగా, పత్రికా రంగంలో ఫీచర్స్ రచయితగా, సినీ విశ్లేషకుడిగా, విలేఖరిగా ప్రసిద్ధమైన పేరు డాక్టర్ రెంటాల జయదేవ. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల పైగా నిరంతరాయంగా ఆయన తన రచనలతో ప్రత్యేక కృషి చేస్తున్నారు. తండ్రి గారైన ప్రముఖ అభ్యుదయ కవి, దాదాపు 200 పుస్తకాలు రాసిన గ్రంథకర్త, జర్నలిస్టు, కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ సాహితీ, పత్రికా వారసత్వాన్ని జయదేవ పుణికిపుచ్చుకున్నారు. పాత తరం పత్రికా విలువల జెండాను కొత్త తరంలో ముందుకు తీసుకువెళుతున్న అతి కొద్దిమంది నిఖార్సయిన జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. జయదేవ పత్రికా సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు, సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో లోతైన టీవీ, పత్రికా ఇంటర్వ్యూలు ప్రజలకూ, పరిశ్రమ వారికీ సుపరిచితం. ఆపకుండా చదివించే ఆయన రచనలు పాఠకుల్ని ఆకట్టుకోవడమే కాక, పలుమార్లు చర్చనీయాంశం అవుతుంటాయి.తొలి పూర్తి నిడివి పది రీళ్ల తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని కూడా గతంలో రెంటాల జయదేవే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా దినోత్సవం విషయంలో అనేక దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న తప్పులను ఆయన సాక్ష్యాధారాలు చూపి సరిదిద్దారు. తెలుగు సినీరంగ చరిత్రను మార్చేసిన ప్రామాణికమైన ఆయన పరిశోధనను ప్రముఖ చరిత్రకారులు, సినీ పెద్దలు బాహాటంగా ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా జయదేవ పరిశోధన అంగీకారం పొందడంతో, ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మన తెలుగు సినిమా దినోత్సవాన్ని సవరించుకొని, ఆయన చెప్పిన ఫిబ్రవరి 6నే అధికారికంగా తెలుగు సినిమా డేను జరుపుకొంటూ ఉండడం విశేషం.ఇది చదవండి: తెలుగు సినిమా పండగ రోజురెంటాల జయదేవ విశిష్ట కృషిని గుర్తించి.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుకు ఎంపిక చేసింది. 2011కి గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఈ పరిశోధనాత్మక గ్రంథంతో తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ వరించింది. తొలినాళ్ల తెలుగు సినిమా చరిత్రపై కనివిని ఎరుగని పరిశోధన చేస్తూ, ఎన్నో కొత్త సంగతులు బయటపెట్టిన రెంటాల జయదేవ (Rentala Jayadeva) నిరంతర అపూర్వ కృషిని తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికీ ప్రాతినిధ్య సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం గుర్తించింది. భక్త ప్రహ్లాద సరైన విడుదల తేదీని పురస్కరించుకొని ఆయనను ఇటీవల ప్రత్యేకంగా సత్కరించడం విశేషం. -
సంపదలిచ్చే కల్పవల్లి... మోక్షమిచ్చే తల్లి
నేడు... క్షీరాబ్ధి ద్వాదశి ఈ రోజు తులసి దగ్గర దీపదానం చేస్తే, సమస్త పాపాలూ నశిస్తాయి. వంద దీపాలను దానం చేసినవారు భగవత్ సాన్నిధ్యం చేరతారు. ఒక వత్తితో దీపం దానమిస్తే, విజ్ఞాని అవుతారు. రెండు వత్తులతో ఇస్తే, రాజు అవుతారు. పది వత్తులతో ఇస్తే, దైవసాక్షాత్కారం లభిస్తుంది. వెయ్యి వత్తులతో దీపదానం చేస్తే, తుదిశ్వాసతో ఆ దైవంలో లీనమవుతారని వ్యాసుడి మాట. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తిక మాసం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు వచ్చే మాసం కాబట్టి, దీని పేరు ‘కార్తికం’. ఈ నెలలో రోజూ పుణ్యప్రదమే. కొన్ని ప్రత్యేకదినాలు మరింత పుణ్యప్రదం. వాటిలో ఒకటి - కార్తిక శుక్ల ద్వాదశి. కార్తికంలో 12వ రోజైన ద్వాదశిని ‘క్షీరాబ్ధి ద్వాదశి’ అంటారు. దీనికే ‘మథన ద్వాదశి’, ‘చిలుకు ద్వాదశి’, ‘చినుకు ద్వాదశి’, ‘తీర్థన ద్వాదశి’, ‘తులసి ద్వాదశి’, ‘యోగేశ్వర ద్వాదశి’, ‘హరిబోధిని ద్వాదశి’ - ఇలా రకరకాల పేర్లు. విష్ణుమూర్తి నిద్ర లేచిన నాడు... ఈ ‘క్షీరాబ్ధి ద్వాదశి’కి ముందు రోజు ‘ఉత్థాన ఏకాదశి’. ప్రతీ పక్షానికీ, అంటే పదిహేను రోజులకూ ఏకాదశులు వస్తూనే ఉంటాయి. అలా వచ్చే ఏకాదశులు అన్నింటిలోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తిక శుద్ధ ఏకాదశి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశికి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. కాబట్టి అది ‘శయన ఏకాదశి’. అలా శయనించిన విష్ణుమూర్తి నాలుగు మాసాల తరువాత ఈ కార్తిక శుద్ధ ఏకాదశికి నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్థానమంటే లేవడమని అర్థం. కాబట్టి, దీనికి ‘ఉత్థాన ఏకాదశి’ అని పేరు. దీన్నే ‘ప్రబోధిన్యేకాదశి’ అని కూడా అంటారు. పాలకడలిని చిలికింది ఈ రోజే! ఆ మరునాడైన ద్వాదశి నాడే అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలకడలిని మథించడం మొదలైందని కథనం. క్షీరసాగర మథనం ప్రారంభమైంది కాబట్టి, అది ‘క్షీరాబ్ధి ద్వాదశి’. పాల కడలిని మథించారు. అంటే చిలికారు కాబట్టి, ఇది ‘మథన ద్వాదశి’. మామూలు మాటల్లో ‘చిలుకు ద్వాదశి’. ద్వాదశి ముందు రోజైన ఏకాదశి నాడు పండరీపురంలోని విఠలేశ్వర ఆలయంలో పెద్ద ఉత్సవం చేస్తారు. ఆ రోజు ఉపవాసం ఉండాలి. కాయధాన్యాల ఆహారం తినకుండా, ఫలహారం చేయాలి. రాత్రి జాగారం చేయాలి. ద్వాదశి ఉదయాన్నే తలంటు స్నానం చేసి, వ్రతం ఆచరించాలి. శ్రీహరికి నైవేద్యం పెట్టాలి. కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయాలి. ఈ అన్నదానం అనంత పుణ్యాన్నిస్తుంది. సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగాతీరంలో కోటిమందికి అన్నదానం చేస్తే వచ్చేంత పుణ్యం ఈ రోజు అన్నదానంతో వస్తుందంటారు. తెలుగు నాట... తులసి, ఉసిరికల పూజ భారతీయ సంప్రదాయంలో తులసి పరమ పవిత్రం, శుభకరం. అందుకనే, స్త్రీలు ప్రతిరోజూ తులసి చెట్టును పూజించి, తులసి చెట్లన్నిటినీ పెంచే ‘బృందావనం’ (తులసి కోట)లో నీళ్ళు పోస్తారు. ఇక, క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి చెట్టును సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మిగా భావించి, పూజిస్తారు. ఈ ద్వాదశి నాటి తులసీ పూజ వెనుక ఒక కారణం ఉంది. అప్పటి దాకా పాలకడలిపై శయనించి ఉన్న విష్ణువు ‘ఉత్థాన ఏకాదశి’ నాడు శ్రీమహాలక్ష్మితో కలసి, బ్రహ్మాది దేవతలు వెంట రాగా, తులసి బృందావనంలోకి ప్రవేశిస్తాడని పెద్దల మాట. అందుకే, ‘క్షీరాబ్ధి ద్వాదశి’ నాడు ఇలా భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తికి ప్రతీకగా తులసి చెట్టునూ, ఉసిరిక చెట్టునూ పూజించడం సంప్రదాయం. విష్ణువు, లక్ష్మీదేవి సహితంగా ఈ రెండు చెట్లకూ ఆవు నెయ్యితో తడిపిన 360 వత్తులతో నీరాజనమిస్తారు. ఇంట్లో ఉసిరిక చెట్టు ఉండకపోవచ్చు కాబట్టి, తులసి చెట్టు పక్కనే, ఉసిరి కాయతో ఉన్న ఉసిరి చెట్టు కొమ్మ పాతి, పూజ చేయడం ఆచారం. అందుకే, ‘క్షీరాబ్ధిశయన వ్రతకల్పం’లో ‘తులసీ సహిత ధాత్రీ లక్ష్మీనారాయణ’, ‘తులసీ ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ’ లాంటి మాటలు కనిపిస్తాయి. ‘ధాత్రి’ అంటే ఉసిరిక అనీ అర్థం. ఈ ద్వాదశికి ఉసిరికాయల్లో పూజా సమయంలో దీపారాధన చేయడం తెలుగు నాట ఆచారం! తులసి, ఉసిరిక ఒకేచోట, ఒకేసారి పుట్టినట్లు ‘శివపురాణ’ కథ. ఈ ‘క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం’ చేస్తే కోర్కెలన్నీ నెరవేరతాయని ధర్మరాజుకు వ్యాసుడు చెప్పాడు. ఎలా పూజించాలి? ద్వాదశి నాటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కలన్నిటినీ పెంచే తులసి కోట దగ్గర స్త్రీలు శుభ్రం చేసి, ముగ్గులు తీర్చాలి. తులసి కోటను అలంకరించాలి. తులసికి కుంకుమ పెట్టాలి. కోట చుట్టూ దీపాలు వెలిగించాలి. దీపారాధనకు ఆవు నూనె కానీ, నువ్వుల నూనె కానీ శ్రేష్ఠం. ధూప, దీప, నైవేద్యాలతో తులసిని పూజించి, విష్ణు స్తోత్రం, లక్ష్మీ స్తుతి చేస్తారు. ఇది కాక కొందరికి తులసి చెట్టును చీరతో అలంకరించి, పువ్వులు, ఎర్ర గాజులు పెట్టి, తాంబూలం కూడా సమర్పించే ఆచారం ఉంది. ‘క్షీరాబ్ధి ద్వాదశి’ నాడు ఇలా శ్రద్ధాసక్తులతో శ్రీమహావిష్ణువునూ, తులసినీ పూజిస్తే సమస్త పాపాలూ నశిస్తాయి. విష్ణువు సంతుష్టుడవుతాడు. ఆయురారోగ్యాలు, సిరిసంపదలు సిద్ధిస్తాయని నమ్మకం. మహారాష్ట్రలో... తులసీ కల్యాణం మహారాష్ర్ట, మాళవ ప్రాంతాల్లో ఈ రోజున శ్రీమహావిష్ణువు అవతారమైన కృష్ణుడికీ, తులసికీ కల్యాణం చేసే సంప్రదాయం ఉంది. పాలకడలిని చిలుకుతుంటే కల్పవృక్షం, కామధేనువు పుట్టాయి. లక్ష్మీదేవి కూడా అలా పాలకడలి నుంచి పుట్టినదే. ఆమెను క్షీరాబ్ధి ద్వాదశి నాడే విష్ణుమూర్తి వివాహం చేసుకున్నట్లు మరో కథనం. దానికి గుర్తుగా ఏటా ఆనాటి సాయంత్ర వేళ లక్ష్మీదేవిని పూజించడంతో పాటు విష్ణువు అవతారమైన కృష్ణుడికీ, లక్ష్మికి ప్రతిరూపమైన తులసికీ కల్యాణం చేస్తారు. తెలుగునాట ఈ తులసి వివాహతంతు లేదు కానీ, తులసి పూజ ఎక్కువ. కార్తికంలో నిత్య దీపారాధన శ్రేష్ఠం. రోజూ చేయలేకపోయినా, కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమినాడైనా దీపారాధన మంచిది. తులసి వద్ద దీపారాధన చేసినంతనే అమితపుణ్యమిచ్చే రోజు కాబట్టే, ‘క్షీరాబ్ధి ద్వాదశి’కి అంత విశిష్టత. నమ స్తులసి కల్యాణి... నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి... నమః సంపత్ ప్రదాయికే. - రెంటాల జయదేవ


