కొత్త జిల్లాలపై కదలిక..!
* ‘పునర్వ్యవస్థీకరణ’ నివేదిక తయారీలో కలెక్టర్ బిజీ
* సమగ్ర సమాచారం సేకరించాలని సర్కారు ఆదేశం
* నెలాఖరులోపు వివరాలు పంపే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: కొత్త జిల్లాల ఏర్పాటుపై కదలిక మొదలైంది. జిల్లా లు, మండలాల పునర్వ్యవస్థీకరణకుగాను నిర్దేశిత సమాచారాన్ని తక్షణమే పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. వీటి ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది.
ఈ కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది జూన్ 2వ తేదీలోపు నూతన జిల్లాలను ప్రకటించాలని భావిస్తోంది. దీంతో ఆరు రకాల అంశాలపై నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలను పంపాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఫార్మెట్ (నమూనా)లను పంపింది. కోరిన సమాచారాన్ని సేకరించడంలో యంత్రాంగం తలమునకలైంది.
సమగ్ర సమాచారం
మండలాల భౌగోళిక స్వరూపం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, విద్యాసంస్థలు, భూ వినియోగం, పట్టణ జనాభా, అక్షరాస్యత, లింగ నిష్పత్తి, రవాణా వ్యవస్థ, మండలాలు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని నివేదించాలని సూచించింది. దాదాపు 180 అంశాలకు సంబంధించిన వివరాలను సాధ్యమైనంత త్వరగా తమకు పంపాలని ఆదేశించారు. ప్రతి మండలానికి సంబంధించిన నైసర్గిక స్వరూపం, మ్యాపులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర విషయాలను కూడా నివేదికలో పొందుపరచాలని నిర్దేశించారు.
దీంతో నూతన జిల్లాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో కదలిక వచ్చింది. నగరీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. జనసంఖ్య 40 లక్షలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో 2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు కాస్తా పదిహేనుకు చేరాయి. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలోని గొల్కోండ, సికింద్రాబాద్, చార్మినార్పేరుతో కొత్త జిల్లాలను ప్రకటిస్తే ...హైదరాబాద్ జిల్లాకు అదనంగా కొత్త ప్రాంతాలను కలపాల్సి ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు మాత్రమే ఉన్నాయి.
ఈ కసరత్తు తర్వాతే..
కొత్త మండలాలు/ రెవెన్యూ డివిజన్లపై కసరత్తు పూర్తయిన తర్వాతే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పష్టత రానుంది. ఈ తరుణంలోనే మండలాల సరిహద్దులు, చారిత్రక నేపథ్యం, దర్శనీయ స్థలాలు, రవాణా సౌకర్యం తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి తుది నివేదికను పంపనుంది.
ఉప్పల్‌లో టీడీపీకి పూర్వ వైభవం
ఉప్పల్: ఉప్పల్‌లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కందికంటి అశోక్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగుదేశం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శిగా ఉప్పల్‌కు చెందిన కందికంటి అశోక్ కుమార్ గౌడ్‌ను నియమించడంతో స్థానిక టీడీపీ నాయకులు ఆయనను ఉప్పల్‌లో ఆదివారం ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు.
పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసి పార్టీ పూర్వ వైభవ ం తీసుకు వస్తామన్నారు. వచ్చే బల్దియా ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌ను టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆశోక్‌ను సత్కరించిన వారిలో బొబ్బాల రమణారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అరిటి కాయల భాస్కర్, కొట్టాల బాలరాజు, పబ్బతి శేఖర్‌రెడ్డి, కల్లూరి వేణు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కందికంటి నిఖిల్ గౌడ్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.