సీఎంల భేటీతో కేంద్రం భారం తగ్గినట్లే
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్
న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగు విషయాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన పరిణామమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ చెప్పారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పర అవగాహనతో సమస్యలు పరిష్కరించుకుంటే కేంద్రం భారం తగ్గినట్టేనన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంల భేటీకి చొరవ చూపిన గవర్నర్కు అభినందనలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించామని చెప్పారు. ఈ వారంలో తెలంగాణలో జరగనున్న పార్టీ కార్యవర్గసమావేశాలలో జాతీయ అధ్యక్షుడు అమిత్షా పాల్గొంటున్నారని చెప్పారు. జాతీయ అధ్యక్షుడి తొలి సమావేశం తెలంగాణ నుంచే మొదలవ్వడం ఆ రాష్ట్రానికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఏపీ, తెలంగాణలో వ్యూహాలపై ఆయా రాష్ట్రకార్యవర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
భగవత్ వ్యాఖ్యలపై అనవసర వివాదం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యల్లో వివాదం చేయాల్సిన విషయమేమీలేదని రామ్మాధవ్ చెప్పారు. భారతదేశం హిందూ రాజ్యమని ముంబైలో భగవత్ చేసిన వ్యాఖ్యలపై వివరణ అడగ్గా.. ‘‘భారతదేశ సాంస్కృతిక గుర్తింపు కోసం ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుంచి నిర్దిష్ట అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తోంది. ఇది మతపరమైన గుర్తింపు కాదు. ఇదే విషయాన్ని భగవత్ ముంబైలో చెప్పారు. దీన్ని వివాదం చేయడం గోబెల్ ప్రచారం చేసేవారికి అలవాటు. దుష్ప్రాచారం చేయడంలో వారిది అందెవేసిన చేయి’’ అని విమర్శించారు.