480 పోస్టులకు పచ్చజెండా
నీటి సరఫరా విభాగంలో అదనపు పోస్టులు
ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ
హైదరాబాద్: భారీగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో 480 కొత్త పోస్టులకు ఆమోదం తెలిపింది. ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకం చేపడుతున్నందున అదనపు పోస్టులు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పరిధిలో ఈ అదనపు పోస్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో అత్యధికంగా 337 ఇంజనీరింగ్ పోస్టులుండగా, మిగతా 143 ఇతర పోస్టులున్నాయి. సోమవారం ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టులు, స్కేల్ ఆఫ్ పే వివరాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
ఈఎన్సీ–01, సూపరింటెండెంట్ ఇంజనీర్–01, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–22, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–40, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–205, అసిస్టెంట్ ఇంజనీర్–68, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్–22, సూపరింటెండెంట్–24, సీనియర్ అసిస్టెంట్–26, జూనియర్ అసిస్టెంట్–70, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ (ఎన్టీపీఏ)–1 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను భర్తీ, నియామకం చేపట్టే సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగం ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.