ముగిసిన అటవీశాఖ పరీక్షలు
- ఆఖరి విడత ‘ఎఫ్ఎస్వో’ పరీక్షతో ముగిసిన పర్వం
- 580 మంది అభ్యర్థులకు 242 మంది గైర్హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి గత మూడు విడతలుగా నిర్వహించిన పరీక్షల పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఆఖరి విడతగా ఆదివారం నిర్వహించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్(ఎఫ్ఎస్వో) పరీక్ష ఆదివారంతో ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించమని అధికారులు హెచ్చరించడంతో అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు ఉరుకులు, పరుగులు తీశారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంగా జరిగిన ఈ పరీక్షకు 580 మంది అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉండగా 338 మంది మాత్రమే హాజరయ్యారు.
పకడ్బంధీగా పరీక్షల నిర్వహణ..
ఇదిలా ఉండగా అటవీశాఖ పరీక్షలకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి సఫలీకృతమయ్యారు. జేఎన్టీయూ(హైదరాబాద్) నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బమ్మిడి పోలీసు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. దీనికితోడు జేఎన్టీయూకి చెందిన పరిశీలకుడు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేశారు. జిల్లా అటవీశాఖాధికారి బి.విజయ్‌కుమార్, కార్యాలయ సిబ్బంది పరీక్షలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మొత్తం మీద అటీవీశాఖ ఉద్యోగాల భర్తీకి మూడు విడతలుగా నిర్వహించిన పరీక్షలన్నీ సజావుగా, సాఫీగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.