సన్నీ లియోన్ యాడ్‌ను చూడలేకపోతున్నాం
ముంబై: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఓ కండోమ్ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ చేసిన యాడ్‌పై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మహిళా విభాగం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను ఉద్దేశిస్తూ అనైతికంగా ఈ యాడ్ చిత్రీకరించారని, టీవీల్లో ఇలాంటివి చూడటం మహిళా ప్రేక్షకులకు ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాడ్ చాలా అసభ్యకరంగా తీశారని, తప్పుడు సందేశం తీసుకెళ్లేలా ఉందని, దీన్ని వెంటనే నిషేధించాలని ఆర్పీఐ (ఏ) మహిళా విభాగం కార్యదర్శి షీలా గంగుర్డె డిమాండ్ చేశారు.
పలు టీవీ చానళ్లలో ఈ యాడ్ ప్రసారమవుతోందని, ఇంట్లో తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె అందరూ కలసి కూర్చుని ఇలాంటి దృశ్యాలు చూడటం ఇబ్బందికరంగా ఉంటుందని షీలా అన్నారు. దీనిపై చాలా మంది మహిళా ప్రేక్షకులు, మహిళా కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎలాంటి విలువలు పాటించకుండా అనైతికంగా, అసభ్యకరరీతిలో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా ఈ యాడ్ చిత్రీకరించారని షీలా విమర్శించారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సారథ్యంలోని ఆర్పీఐ (ఏ).. సన్నీలియోన్ యాడ్‌ను వారం రోజుల్లోగా నిషేధించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.