రుణమాఫీ కోసం రణం
బేల : పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బేల మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం కాంగ్రెస్, బీజేపీ నాయకులు, రైతులు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రుణ మాఫీ వెంటనే చేసేలా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించాలని నాయకు లు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
దీంతో పాటు స్థానిక ఇందిరా చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. అయితే బుధవారం వారసంత కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో ధర్నా విరమించి, వెనుదిరిగారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కి వచ్చి, 2 నెలలకు పైగా గడుస్తోందని, ఇప్పటిదాకా సమీక్షలు, సమావేశాలతో కాలయాపన తప్ప చేసేందే మీ లేదని దుయ్యబట్టారు.
రుణ మాఫీపై ముఖ్యమం త్రి వెంటనే స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచులు వాంఖడే రూప్రావు, మెస్రం దౌలత్, బీజెపీ మండల అధ్యక్షుడు బోనిగిరివార్ గణేశ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గెడాం మాధవ్, మైనార్టీ అధ్యక్షుడు ఫైజుల్లాఖాన్, బేల సహకార సంఘం మాజీ అధ్యక్షుడు సుధాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోపత్ శంకర్, నాయకులు మల్లారెడ్డి, రమేశ్, గుండవార్ సంజయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.