మాఫీ ఉచ్చులో అన్నదాత !
- బీమా, రీషెడ్యూల్కు చెడుతున్న రైతులు?
- రుణమాఫీ జరగక... కొత్త రుణాలకు దూరం
- రీషెడ్యూల్తో 11 శాతం మందికే ఉపశమనం
- రుణాలు తీసుకోని కారణంగా పంటల బీమా చేసుకోలేని పరిస్థితి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రుణాలను చెల్లించొద్దు...అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామంటూ చంద్రబాబునాయుడు పదేపదే వల్లించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటామని, ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని నమ్మబలి కారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులను ప్రలోభపెట్టారు. నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక పిల్లి మొగ్గలేస్తున్నారు. మాఫీ చేయాలన్నదానిపై కమిటీ వేశామని, ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తొలుత చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి బాగోలేదని, ఆర్బీఐ వ్యతిరేకిస్తోందని, రుణా ల రీషెడ్యూల్కు లైన్ క్లియర్ చేస్తున్నామని మరో మోసానికి తెరలేపారు.
కేవలం 11 శాతం మందికే రీషెడ్యూల్ ?
రుణాల రీషెడ్యూల్ అనేది రైతులకు మేలు చేసేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. దీనిలో ఆంక్షలు పెడుతున్నారు. గత ఏడాది కరువు, వరదలతో నష్టపోయిన రైతులకు మాత్రమే వర్తిస్తుందన్నట్టు సూచన ప్రాయంగా సంకేతాలిస్తున్నారు. అదే జరిగితే రుణాల రీషెడ్యూల్ కూడా కొందరికే వర్తిస్తోంది. జిల్లాలో 2.67లక్షల మంది రైతులు రూ.1462కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. వీరిలో గత ఏడాది వరదలు, కరువు వల్ల 30,445 మంది రైతులు నష్టపోయారు. చంద్రబాబు చేస్తున్న ప్రకటనల మేరకు ఆ 30,445 మందికి మాత్రమే రుణాల రీషెడ్యూల్ పరిమితం కానుంది. ఈ లెక్కన బ్యాంకు రుణాలు తీసుకున్న 11శాతం మందికి మాత్రమే ఆ కాసింత ప్రయోజనం చేకూరనుంది. ఇక మిగతా రైతుల పరిస్థితి అగమ్యగోచరమే...
బీమాకూ దూరం
మాఫీ, రీషెడ్యూల్కే కాకుండా పంటల బీమా పథకానికీ రైతు లు దూరం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. బీమా చేసుకున్నట్టయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తగు పరిహా రం అందుతుంది. కానీ జిల్లాలోని రైతులు ఆ అవకాశాన్ని కో ల్పోతున్నారు. రుణమాఫీ చేస్తారన్న ఉద్దేశంతో రైతులు బకాయిలు చెల్లించడం మానేశారు. రికవరీ లేదన్న కారణంగా బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వడం ఆపేశాయి. కొత్తగా రుణాలు తీసుకుంటేనే రైతుల పేరున బీమా ప్రీమియాన్ని బ్యాంకులు చెల్లిస్తాయి. రుణాలే ఇవ్వని పరిస్థితిలో బీమా ప్రీమియం చెల్లించే అవకాశం లేదు. దీంతో రైతులంతా ఇప్పుడు బీమాకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడింది.
రుణాలపై ఆధారపడకుండా నేరు గా ప్రీమియం చెల్లించేవారికి మాత్రమే బీమా వర్తిస్తోంది. ఈ నెలాఖరు వరకే ఆ గడువు ఉంది. కానీ ఈ విషయైమై రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో బీమా విషయమే గుర్తుకు రావడం లేదు. ఈ ఏడాది వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటలకు బీమా పథకం, అరటి, జీడి, మామిడి పంటలకు వాతావరణం బీమా అమలవుతోంది. ఇప్పుడు ఆ పంటలు వేసుకుని బీమా ప్రీమియం కట్టని వారి పరిస్థితి దైవాధీనం కానుంది.