rescued woman
-
నీటిలో వణుకుతూ రాత్రంతా జాగారం
సూర్యాపేటరూరల్: ఓ మహిళ మూసీ వాగులో చిక్కుకుని రాత్రంగా నీటిలోనే జాగారం చేయాల్సి వచ్చింది. స్థానికులు గమనించి ఆమెను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కొల్లూరు గ్రామానికి చెందిన కట్ట రాములమ్మ (65)కాలినడకన గ్రామాలు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉప్పల పహాడ్ గ్రామానికి వచ్చింది. శుక్రవారం భిక్షాటన చేసి టేకుమట్ల శివారులోని మూసీవాగులో కల్వర్టు ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నీళ్లులేకపోవడంతో భోజనం చేసి నిద్రపోయింది. అయితే రత్నపురం మూసీ ప్రాజెక్టు అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా మూసీ వాగుకు నీటి తాకిడి పెరిగింది. దీంతో నిద్రలో ఉన్న ఆమె నీటిలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఓ రాయి దొరకడంతో దాన్నిపట్టుకుని రాత్రంతా నీళ్లల్లో వణుకుతూ గడిపింది. కాపాడమని కేకలు వేస్తోన్న ఆమెను రాయినిగూడెం వాసులు గమనించి వెంటనే సూర్యాపేట రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో పడవలు వేసుకుని వెళ్లి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ యాప్’ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. తాజాగా దిశ యాప్ సాయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను పోలీసులు కాపాడారు. పొరుమామిళ్లకు చెందిన సుభాషిణి అనే యువతి.. ఉపాధ్యాయ పరీక్ష రాసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో సదరు యువతితో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే దిశ యాప్ ఎస్‌వోఎస్ ద్వారా జిల్లా ఎస్పీకి ఫోను ద్వారా ఆ మహిళ ఫిర్యాదు చేసింది. (చదవండి: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు) వెంటనే స్పందించిన వైఎస్సార్ జిల్లా పోలీసులు సకాలంలో ఢిల్లీ పోలీసులను సంప్రదించి, స్థానికం స్వచ్చంద సంస్థ సహకారంతో ఆ మహిళను పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఆటో డ్రైవర్ నుంచి కాపాడి కడపకు చేరే వరకు యువతికి పోలీసులు అండగా నిలబడ్డారు. ఆపదలో ఉన్న సమయంలో తనను క్షేమంగా గమ్యానికి చేర్చిన జిల్లా పోలీసులకు బాధిత యువతి ధన్యవాదాలు తెలిపింది. జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ, దిశ యాప్ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: Google: గూగుల్‌కు షాకు మీద షాకులు -
అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది
అమలాపురం టౌన్: ఒక్క ఫోన్ కాల్ ఆమె ప్రాణాలను నిలిపింది.. అర్ధరాత్రి కారు చీకటి.. ఆపై 25 అడుగుల లోతు నూతిలో పడిపోయిన మహిళను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టడంతోనే ఇది సాధ్యమైంది. ఆపద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా అందుబాటులోకి తెచ్చిన 112 కాల్ బాధితురాలిని రక్షించింది. సాహసోపేత సేవలు అందించిన సిబ్బందిని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రశంసించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి కూడా అభినందించారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి గ్రామానికి చెందిన బొక్కా భవానీదుర్గ (49) ప్రతికూల పరిస్థితుల వల్ల ఇంటి ఆవరణలోని నూతిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడిపోయింది. ఆమె బంధువు తక్షణమే 112కు కాల్ చేసి ప్రమాద వార్తను చేరవేశారు. ఆ కాల్ సెంటరు వారు తక్షణమే 100కి కాల్ చేసి చెప్పారు. అక్కడి నుంచి అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. ఆ సమయంలో స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఏఎస్సై సత్యనారాయణ తక్షణమే అమలాపురం అగ్నిమాక దళానికి సమాచారం అందించారు. నైట్ రౌండ్స్‌లో ఉన్న కానిస్టేబుల్ కుడుపూడి వీరవెంకట సత్యనారాయణ, హోంగార్డు నాగులకు కూడా ఏఎస్సై తెలిపారు. రాత్రి 12.40 గంటలకు కాల్ రిసీవ్ చేసుకున్న ఏఎస్సై 15 నిమిషాల వ్యవధిలోనే కానిస్టేబుల్, హోంగార్డు, అగ్నిమాపక దళంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలగుమ్మికి వేగంగా వారు జీపులో వెళ్లారు. ఆ సమయానికి అగ్నిమాపక శకటం, అగ్నిమాపక దళాధికారి కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో లీడింగ్ ఫైర్‌మెన్ శ్రీరాములు, సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. నూతి లోతు 25 అడుగులకు పైగా ఉంది. అందులో పడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భవానీదుర్గను కాపాడే ప్రయత్నాలు చకాచకా మొదలు పెట్టారు. అగ్నిమాపక దళానికి చెందిన నిచ్చెన, తాడుతో సిబ్బంది నూతిలోకి దిగి బాధిత మహిళను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఆమె నూతిలో నిచ్చెన పట్టుకునే స్థితిలో లేకపోవడంతో తాడు కట్టి అతికష్టం మీద పైకి చేర్చారు. తర్వాత సపర్యలు చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట లోపు 112 కాల్, 100 కాల్లకు సంబంధించిన కేసును క్లోజ్ చేశారు. బాధిత మహిళ కుటుంబంలోని కొందరు కోవిడ్‌తో బాధపడుతున్నారు. కొద్దిరోజుల కిందటే ఆమె కూడా కోవిడ్ నుంచి కోలుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అర్ధరాత్రి నూతి వద్దకు వచ్చిన ఆమె ప్రమాదవశాత్తూ జారి పడిపోయిందని అంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు, తాలూకా ఎస్సై రాజేష్‌లు ఏఎస్సై, కానిస్టేబుల్, హోంగార్డులను అభినందించారు. చదవండి: బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి -
క్యాబ్ డ్రైవర్ కాపాడాడు
ముంబై: దేశంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయన్న మాట ఎంత నిజమో అదే మొత్తంలో కాకపోయిన మహిళలను కాపాడుతున్న వారు కూడా ఉన్నారు. హ్యూమన్స్ ఆఫ్ బొంబే పేరుతో ఫేస్ బుక్ లో నడుస్తున్న పేజీ షేర్ చేసిన ఓ పోస్టు మంచి, చెడుల సమూహమే సమాజం అన్న మాటను గుర్తు చేస్తుంది. పోస్టు లోని వివరాల ప్రకారం.. 35 ఏళ్లుగా ముంబై రోడ్లపై ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి వివరించారు. తెల్లవారుజామున 12.30నిమిషాల సమయంలో 25 ఏళ్ల వయసు గల ఓ యువతి బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు చెప్పారు. ఇంతలో కొంతమంది విజిల్స్, కేకలు వేస్తూ ఆమెను వెంబడించారని తెలిపారు. దీంతో ఆ యువతి కంగారుపడి వేగంగా నడవడం మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇదంతా గమనించిన తాను కారును వారి వెనుకే నడుపుతూ హారన్ మోగించినట్లు చెప్పారు. ఎవరో వస్తున్నట్లు భావించిన వాళ్లు వేరే దారిలో వెళ్లిపోయినట్లు తెలిపారు. తాను ఆ యువతిని తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలేసినట్లు చెప్పారు. కారు దిగిన యువతి తన రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. రెండు నిమిషాలు ఆగమని చెప్పిన యువతి ఇంట్లో నుంచి కొన్ని స్వీట్స్ తీసుకుని వచ్చి ఇచ్చిందని చెప్పారు. హ్యూమన్ ఆఫ్ బొంబే పేజీ ముంబైలోని ప్రజల జీవితాలను సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకువస్తోంది. హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ పేరుతో రన్ చేస్తున్న పేజీని చూసిన ముంబైకు చెందిన ఓ యువతి ఈ పేజీని ప్రారంభించారు.