క్యాబ్ డ్రైవర్ కాపాడాడు
ముంబై: దేశంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయన్న మాట ఎంత నిజమో అదే మొత్తంలో కాకపోయిన మహిళలను కాపాడుతున్న వారు కూడా ఉన్నారు. హ్యూమన్స్ ఆఫ్ బొంబే పేరుతో ఫేస్ బుక్ లో నడుస్తున్న పేజీ షేర్ చేసిన ఓ పోస్టు మంచి, చెడుల సమూహమే సమాజం అన్న మాటను గుర్తు చేస్తుంది.
పోస్టు లోని వివరాల ప్రకారం.. 35 ఏళ్లుగా ముంబై రోడ్లపై ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి వివరించారు. తెల్లవారుజామున 12.30నిమిషాల సమయంలో 25 ఏళ్ల వయసు గల ఓ యువతి బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు చెప్పారు. ఇంతలో కొంతమంది విజిల్స్, కేకలు వేస్తూ ఆమెను వెంబడించారని తెలిపారు.
దీంతో ఆ యువతి కంగారుపడి వేగంగా నడవడం మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇదంతా గమనించిన తాను కారును వారి వెనుకే నడుపుతూ హారన్ మోగించినట్లు చెప్పారు. ఎవరో వస్తున్నట్లు భావించిన వాళ్లు వేరే దారిలో వెళ్లిపోయినట్లు తెలిపారు. తాను ఆ యువతిని తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలేసినట్లు చెప్పారు.
కారు దిగిన యువతి తన రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. రెండు నిమిషాలు ఆగమని చెప్పిన యువతి ఇంట్లో నుంచి కొన్ని స్వీట్స్ తీసుకుని వచ్చి ఇచ్చిందని చెప్పారు. హ్యూమన్ ఆఫ్ బొంబే పేజీ ముంబైలోని ప్రజల జీవితాలను సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకువస్తోంది. హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ పేరుతో రన్ చేస్తున్న పేజీని చూసిన ముంబైకు చెందిన ఓ యువతి ఈ పేజీని ప్రారంభించారు.