‘నాన్న ప్రత్యక్ష నరకం చూపించేవాడు’ | Mumbai Woman Who Failed In Suicide Attempt Got New Life | Sakshi
Sakshi News home page

‘ఫినాయిల్‌ తాగేశా; సిగ్గుపడాల్సింది ఏమీలేదు’

Published Tue, Aug 20 2019 7:12 PM | Last Updated on Tue, Aug 20 2019 8:00 PM

Mumbai Woman Who Failed In Suicide Attempt Got New Life - Sakshi

భారతీయ సం‍స్కృతికి విదేశాలు జేజేలు పలకడానికి ముఖ్య కారణం ఇక్కడున్న వివాహ, కుటుంబ వ్యవస్థలే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం ఒక కుటుంబంగా రూపాం‍తరం చెందుతుంది. అది క్రమేణా వృద్ధి చెంది సంస్కారవంతమైన సమాజానికి బీజం వేస్తుంది. అయితే ఇదంతా సవ్యంగా సాగడం అనేది భార్యాభర్తలుగా మారిన ఆ ఇద్దరు వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. జంటలో ఏ ఒక్కరూ బాధ్యతగా, బంధం నిలుపుకొనే విధంగా మసలుకోకపోయినా ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోతే వారి పిల్లలు అనుభవించే మానసిక వేదన వర్ణనాతీతం. ఆ గొడవల తాలూకు ఛాయలు జీవితాంతం వారిని వెంటాడుతాయి.

అంతేకాదు ఆ చేదు ఙ్ఞాపకాలు ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తాయి. అయితే ప్రతీ సమస్యకు చావే పరిష్కారం కాదని బలంగా విశ్వసించిన వారు..అటువంటి ప్రయత్నాల నుంచే పాఠాలు నేర్చుకుని అందమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. ముంబైకి చెందిన ఓ యువతి జీవితానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేస్తున్న ఆమె స్టోరీని ప్రఖ్యాత హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ఫేస్‌బుక్‌ పేజీ షేర్‌ చేసింది. ‘కష్టాలను తట్టుకుని విధిని ఎదిరించి నిలబడగలిగే నీలాంటి వాళ్లు.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విరమించుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు’ అంటూ నెటిజన్లు ఆమె స్టోరీని వైరల్‌ చేస్తున్నారు.

సమకాలీన పరిస్థితుల్లో రెండు కోణాలను స్పృశిస్తున్న ఆ పోస్టు సారాంశం ఇది...
‘చిన్నపాటి, ఇరుకైన అపార్టుమెంటులోని ఓ ఇంట్లో పుట్టిపెరిగాను. పెరిగి పెద్దవుతున్న కొద్దీ తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు నాకు అర్థమవసాగాయి. తరచుగా తగువులాడుకునే వారు. మా నాన్నకు అక్రమ సంబంధం ఉందని అమ్మ ఆరోపణ. ఆ వేదనతో తానెంతో కుంగిపోయేది. బాధ భరించలేక ఓ రోజు నాన్నతో తీవ్రంగా గొడవపడింది. దీంతో నాన్నకు పట్టలేనంత కోపం వచ్చింది. బెల్టు తీసుకుని అమ్మను దారుణంగా కొట్డాడు. ఆ మరుసటి రోజు నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, సరుకులు తేవడం మానేశాడు.నాన్న ప్రవర్తనతో విసిగిపోయిన అమ్మ చచ్చిపోదామని నిర్ణయించుకుంది. నన్ను తనతో పాటు బీచ్‌కు తీసుకువెళ్లి ఇద్దరం చనిపోదాం అని చెప్పింది. కానీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంది. తన ఆలోచన తప్పు అని తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చింది. నాన్న మారతాడేమోనని ఎదురుచూసింది కానీ అలా జరుగలేదు.

ఇక లాభం లేదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాన్న మీద కేసు పెట్టింది. కాసేపటి తర్వాత నాన్న హాయిగా ఇంటికొచ్చేశాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు.ఆనాటి నుంచి మాకు ప్రత్యక్ష నరకం చూపించే వాడు. అమ్మ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. అక్కడే నాకొక వ్యక్తి పరిచయమయ్యాడు. నాకన్నా ఐదేళ్లు పెద్దవాడు. ఎంతో చక్కగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో తనతో ఎప్పుడు ప్రేమలో పడిపోయానో నాకే తెలియదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా తను వెళ్లిపోతున్నానని, ఇక ఇక్కడ ఉండటం కుదరని చెప్పేశాడు. దాంతో అతనితో బాగా గొడపపడ్డాను. అచ్చం అమ్మానాన్నల గొడవలాగే అనిపించింది. నా గుండె పగిలిపోయింది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది.

ఆరోజు బాధతో వీధి వెంట పిచ్చిగా పరిగెత్తాను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. దగ్గర్లో ఉన్న ఓ షాపులోకి వెళ్లి ఫినాయిల్‌ బాటిల్‌ కొనుక్కుని అక్కడే తాగేశాను. తెల్లవారి మెలకువ వచ్చింది. ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్నాను. 24 గంటల పాటు ఐసీయూలో ఉంచారు. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. నిజంగా చావాలనుకుంటే కాస్త గట్టిగా ప్రయత్నం చేయవచ్చు కదా అన్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక నా స్నేహితులు ఎవరూ నన్ను చూడటానికి రాలేదు. నాలాంటి వాళ్లతో వాళ్లకు స్నేహం అక్కర్లేదట. ఇరుగుపొరుగు వారికి నేనొక గాసిప్‌ అయిపోయా. నా జీవితం మరింత కఠినంగా మారింది. వాళ్ల కారణంగా ఎంతో వేదన అనుభవించా. కనీసం ఒక్కరైనా నా బాధను అర్థం చేసుకుని ఆత్మీయంగా పలకరిస్తే చాలు అనుకున్నా. అలా జరగలేదు. అయితే ఆ సంఘటనలే నాలో మార్పునకు కారణమయ్యాయి. నేనెందుకు చావాలి అనే ప్రశ్నను రేకెత్తించాయి. కౌన్సిలింగ్‌కి వెళ్లాను. ధ్యానం చేశాను. జీవితాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టాను. కొన్నాళ్ల తర్వాత అమ్మా, నేను ఇళ్లు వదిలి వచ్చేశాము.

జర్నలిజంలో మాస్టర్స్‌ చేశాను. ప్రస్తుతం ఆల్‌ ఇండియా రేడియోలో జాబ్‌ చేస్తున్నా. ఇదంతా జరిగి చాలా ఏళ్లు అవుతుంది. ఇప్పుడు నాకంటూ ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్‌ ఉంది. నాకు తోడుగా కొంతమంది ఉన్నారు. మేమంతా కలిసి చిన్న చిన్న సామాజిక కార్యక్రమాలు చేపడతాము. సరదాగా బయటికి వెళ్తాం. అయితే ఇప్పటికీ నా గతానికి సంబంధించిన మరకలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. కానీ వాటి వల్లే కదా ఎలా ఉండకూడదో అన్న విషయం తెలిసింది కదా అని సర్దిచెప్పుకొంటాను. నిజానికి ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీలేదు’ అంటూ తన గతం, వర్తమానం గురించి చెప్పుకొచ్చింది సదరు యువతి. ఎదుటివారి గురించి మాట్లాడే ముందు, వారిని జడ్జ్‌ చేసే ముందు ఒక్కసారి ఆలోచించమని సలహా కూడా ఇచ్చింది. ఎందుకంటే కనిపించేదంతా నిజం కాకపోవచ్చు... ఎదుటి వారు మన నుంచి ప్రేమ, దయ, ఆప్యాయత కోరుకుంటూ ఉండవచ్చు. బహుశా మీరు చూపించే చొరవ వారి చావుబతుకులను నిర్ధేశించేదిగా ఉండవచ్చు అనేది ఆమె భావన. అంతేకదా.. బాధలో ఉన్న వారి వైపు ఆత్మీయంగా చూసే చూపు...చిందించే ఓ చిరునవ్వు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎదుటి వారిలో ఆత్మన్యూనతను పోగొట్టి.. సానుకూల దృక్పథంతో కొత్త జీవితానికి పునాదులు వేసే ప్రేరణా శక్తిని కలిగి ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement