మనవరాలి చదువు కోసం ఇల్లమ్మిన దేస్రాజ్
ముంబై: జీవితాంతం పిల్లల కోసం కష్టపడ్డాడు.. వారి కాళ్ల మీద వారు నిలబడేలా తీర్చి దిద్దాడు.. పెళ్లిల్లు చేశాడు.. బాధ్యత తీరింది. మలి సంధ్యలో మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ హాయిగా గడుపుదామనుకున్నాడు. అయితే అన్ని మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. తానోటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది. ఇద్దరు కుమారులు చనిపోయారు. కోడళ్లు, వారి పిల్లల బాధ్యత తన మీద పడింది. దాంతో విశ్రాంతిగా గడపాల్సిన జీవిత చరమాంకంలో రాత్రింబవళ్లు ఆటో నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఉన్న ఏకైక ఆస్తి ఇల్లు మాత్రమే. కానీ చివరకు దాన్ని కూడా అమ్మి.. ఆటోలోనే తిని.. అందులోనే పడుకుంటున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే....
దేస్రాజ్ ఆటో నడుపుతూ జీవితం సాగించేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిని పెంచి పెద్ద చేసి వివాహం చేశాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆరేళ్ల క్రితం పని కోసం బయటకు వెళ్లిన ఓ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదు. వారం రోజుల తర్వాత శవమై కనిపించాడు. చేతికి అందిన వచ్చిన కొడుకు అర్థాంతరంగా కన్ను మూస్తే.. ఆ తండ్రికి ఎంత కడుపుకోతే మాటల్లో చెప్పలేం. తన శరీరంలో సగం భాగం చచ్చిపోయినట్లు అనిపించింది దేస్రాజ్‌కు. కానీ తాను బాధపడుతూ కూర్చుంటే.. కుటుంబ సభ్యుల ఆకలి తీరదు కదా. అందుకే కొడుకు చనిపోయిన బాధను దిగమింగి మరుసటి రోజే ఆటో నడపడానికి వెళ్లాడు.
దెబ్బ మీద దెబ్బ.. మరో విషాదం
కొడుకు చనిపోయిన బాధ నుంచి కోలుకోకముందే.. రెండు సంవత్సరాల తర్వాత మరో విషాదం చోటు చేసుకుంది. మిగిలిన ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను పొగొట్టుకున్న ఆ తండ్రి బాధను వర్ణించడానికి మాటలు చాలవు. అప్పుడు కూడా దేస్రాజ్ కుంగిపోలేదు. కుమారుల మరణంతో ఒంటరి వాళ్లైన తన కోడళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్ల బాధ్యత అతడి కళ్ల ముందు మెదిలింది. దాంతో బాధను దిగమింగుకుని.. వారి బాధ్యతను భుజాన వేసుకున్నాడు దేస్రాజ్.
మనవరాలికిచ్చిన మాట కోసం
కుటుంబాన్ని పోషించాల్సిన ఇద్దరు మగాళ్లు చనిపోవడం.. వృద్ధుడైన తాత తమ కోసం కష్టపడుతుండటం చూసిన దేస్రాజ్ మనవరాలు విలవిల్లాడింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి చదువు మానేసి.. ఏదైనా పని చేస్తానని తాతకు చెప్పింది. చదువులో ముందుండే పిల్ల.. బడి మానేసి.. పనికి వెళ్లి జీవితం నాశనం చేసుకోవడం దేస్రాజ్‌కు నచ్చలేదు. ఆ క్షణమే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనవరాలి చదువుకు ఆటంకం కలగకూడదనుకున్నాడు. కోరుకున్న చదువు చెప్పిస్తానని మనవరాలికి మాట ఇచ్చాడు.
ఇక అప్పటి నుంచి ఉదయం ఆరు గంటలకు ఆటోతో ఇంటి నుంచి బయటకు వెళ్తే రాత్రి పదింటికి తిరిగి వచ్చేవాడు. అలా నెలంతా కష్టపడి 10 వేల రూపాయలు సంపాదిస్తే.. దానిలో ఆరు వేలు మనవరాలి చదువు కోసం ఖర్చు చేస్తే... మిగతా సొమ్ము కుటుంబ సభ్యుల తిండి కోసం కేటాయించేవాడు. తాత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది దేస్రాజ్ మనవరాలు. ఇంటర్‌లో 80 శాతం స్కోర్ చేసింది. ఆ రోజు ఆ ముసలి తాత సంబరం చూడాలి. తన ఆటో ఎక్కినవారందరికి ఈ విషయం చెప్పి తెగ మురిసిపోయాడు. ఆ రోజంతా ప్రయాణికుల దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు.
అప్పటి నుంచి ఆటోలోనే తిండి, నిద్ర..
ఆ తర్వాత మనవరాలు బీఈడీ చదవడం కోసం ఢిల్లీ వెళ్తానని తాతను అడిగింది. ఢిల్లీ పంపించి చదివించడం అంటే మాటలు కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కాలేజీ ఫీజు, అక్కడ ఉండి చదువుకోవడానికి హాస్టల్ ఫీజు ఇతరాత్ర ఖర్చులు చాలా ఉంటాయి. ఏం చేయాలో దేస్రాజ్‌కు తోచలేదు. ఎలాగైనా మనవరాల్ని ఢిల్లీ పంపిచాలనుకున్న ఆ ముసలి తాత.. తమకున్న ఒకే ఒక్క ఆస్తి ఇంటిని అమ్మేశాడు. భార్య, కోడళ్లు, ఇతర మనవలు, మనవరాళ్లను బంధువులు ఊరికి పంపించి.. వారు అక్కడే ఉండే ఏర్పాట్లు చేశాడు. ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మనవరాలిని ఢిల్లీ పంపించి చదివిస్తున్నాడు. ఇక నాటి నుంచి ఆటోనే తనకు ఇల్లు, వాకిలి అయ్యింది. రోజంతా ఆటో నడుపుతూ.. అందులోనే తింటూ.. ఆటోలోనే నిద్రపోతూ కాలం గడుపుతున్నాడు.
ఆ మాటతో నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను
దేస్రాజ్ గురించి తెలుసుకున్న హ్యుమన్స్ ఆఫ్ బాంబే వారు ఆయనతో మాట్లాడారు. ‘‘ఇంత కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.. ఎప్పుడు బాధ అనిపించలేదా’’ అని ప్రశ్నించగా.. అందుకు దేస్రాజ్ ‘‘నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టపడి పని చేయడం అలవాటయ్యింది. ప్రస్తుతం జీవితం మరీ అంత దారుణంగా ఏం లేదు. బాగానే సాగిపోతోంది. ఇక ఈ వయసులో కూడా కష్టపడటం అంటే.. నా కుటుంబం కోసమే కదా. బాధ ఎందుకు. నా మనవరాలు బాగా చదువుతోంది. మా కుటుంబం నుంచి తొలి గ్రాడ్యుయేట్ తనే. కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసి.. తను క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పింది. ఆ మాటతో నేను పడిన శ్రమ అంతా మర్చిపోయాను. తను తప్పకుండా టీచర్ అవుతుంది. ఆ రోజు తనను దగ్గరుకు తీసుకుని ‘‘నన్ను గర్వపడేలా చేశావ్ తల్లి’’ అని ఆశీర్వదిస్తాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు దేస్రాజ్.
వెల్లువెత్తుతున్న ప్రశంసలు.. ఆర్థిక సాయం
దేస్రాజ్ కథను హ్యూమన్స్ ఆఫ్ బాంబే గురువారం తన ఫేస్‌బుక్ పేజిలో షేర్ చేసింది. ఇది చదివిన వారంతా ‘‘తాత నీ గురించి చదువుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు.. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావ్.. యువతలో ఉన్న ఎందరో సోమరిపోతులకన్నా మీరు వంద రేట్లు నయం. తప్పక మీ మనవరాలు టీచర్ అవుతుంది.. మీ పేరు నిలబెడుతుంది’’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక చాలా మంది నెటిజనులు దేస్రాజ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో ఓ ఫేస్‌బుక్ యూజర్ గుంజర్ రాటి దేస్రాజ్ పేరు మీద క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 270 మంది 5.3 లక్షల రూపాయలు దేస్రాజ్ కోసం ఇచ్చారు. ఇక ఈ స్టోరి కాంగ్రెస్ నాయకురాలు అర్చనా దాల్మియాను కూడా కదిలించింది. ఆమె తన ట్విట్టర్‌లో దేస్రాజ్ ఆటో నంబర్, మొబైల్ నంబర్, అతడు పని చేసే ప్రాంతం వివరాలు షేర్ చేశారు. ‘‘మనం ఆయనకు సాయం చేయాలి.. దయచేసి ముందుకు రండి అని’’ పిలుపునిచ్చారు.
Desraj is a Auto driver on streets of Mumbai! His 2 sons hv died in accident & suicide. He drives frm 6am in th morn to 10 pm to earn Rs10000 /month. You cn find him at Khar Danda naka, Auto no 160. His no is 08657681857. We need to reach out to help. RT pl & Mumbaikars pl help. pic.twitter.com/5zAm9TtgT5
— Archana Dalmia (@ArchanaDalmia) February 11, 2021
చదవండి: ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది
వధువు కాళ్లకు నమస్కరించిన భర్త
Comments
Please login to add a commentAdd a comment