‘‘నాకు ఎప్పుడైతే కోవిడ్-19 సోకిందని డాక్టర్లు చెప్పారో.. అప్పుడు నా మనసులో తలెత్తిన తొలి ప్రశ్న.. నా కూతురి పరిస్థితి ఏంటి?. ఇప్పుడు నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రతి రోజూ నా చిన్నారితల్లి బెడ్‌రూం కిటికీ వద్దకు వస్తుంది. తన చిట్టిపొట్టి వేళ్లను గ్లాసుపై ఆనిస్తుంది. అక్కడికి నేను చేరుకోగానే పరుగెత్తుకుని వెళ్లి తనని గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది. కానీ వెంటనే నేను కోవిడ్ పేషెంట్‌ననే విషయం గుర్తుకువస్తుంది. అయినా నాలో భాగమైన తనలో నేను ఎల్లప్పుడూ కలిసే ఉంటాను కదా అని సర్ది చెప్పుకొంటాను’’ అంటూ ముంబైకి చెందిన ఆలిఫ్యా ఝవేరీ అనే మహిళ హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్‌బుక్ పేజీలో తన బాధను పంచుకున్నారు. కరోనా కారణంగా 17 నెలల తన చిన్నారికి దూరంగా ఉండటం జీవితంలో అన్నింటికంటే పెద్ద విషాదమని అని ఉద్వేగానికి లోనయ్యారు. కరోనా లక్షణాలు బయటపడిన వెంటనే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని.. పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. (వైరల్: క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి.. కానీ..)
ఇక ఆనాటి నుంచి తాను వేరుగా ఉంటున్నాన్న ఝవేరి..‘‘నా భర్త, వదినమ్మ మా పాపను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయినా నేను తన దగ్గర లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటలకు లేచి అమ్మా అమ్మా అని కలవరిస్తుంది. అప్పుడు నా హృదయం పగిలినట్లుగా అనిపిస్తుంది. కానీ తప్పదు. ఎప్పుడూ నా చేయి పట్టుకుని.. గుండెలపై తలదాచుకుని నిద్రపోయేది. ఇకపై అలా జరుగుతుందో లేదో తెలియదు. ఏ తల్లికైనా ఇంతకంటే నరకం ఉండదేమో’’అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఝవేరికి సంబంధించిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఆమె ఆవేదనకు చలించిపోయిన నెటిజన్లు.. ‘‘త్వరలోనే మీరు కోలుకుని మీ పాపను తనివితీరా హత్తుకుంటారు. మీరు కోవిడ్‌ను తప్పక జయించి తీరుతారు’’అంటూ ఆమెలో ధైర్యాన్ని నింపుతున్నారు. కాగా 60 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులతో దేశంలో అత్యధిక కోవిడ్ బాధితులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన సంగతి తెలిసిందే. (వికలాంగుడికి తోడుగా.. వీల్‌చైర్ నెట్టుతూ)
Comments
Please login to add a commentAdd a comment