ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని మళ్లీ దాడి చేస్తోంది. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతో కరోనా ఖతమైందనుకున్నాం. అందుకు తగ్గట్టే అన్ని రాష్ట్రాలు మాస్క్ ధరించడం మినహా అన్ని కోవిడ్ ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తున్నాయి. అయితే తాజాగా మహమ్మారికి సంబంధించి మరో పిడుగులాంటి వార్త ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.
భారత్‌లో ఒమిక్రాన్‌లో రెండు కొత్త వేరియంట్‌లు వెలుగు చూశాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒకరికి ఒమిక్రాన్ ఎక్స్‌ఈ (XE) వేరియంట్ కేసు నమోదైనట్లు బృహాన్ ముంబై కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు మరొకరికి కాపా వేరియంట్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. జెనెటిక్ ఫార్ములా డిటర్మినేషన్‌లో భాగంగా మొత్తం 230 శాంపిల్స్‌ను పరీక్షించగా 228మందికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. ఒక శాంపిల్‌లో కప్పా రకం వైరస్ బయటపడగా.. మరో వ్యక్తికి XE వేరియంట్ గుర్తించారు. అయితే కొత్త రకం వేరియంట్ నమోదైన వారిలో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని, ఎవరికీ ఆక్సిజన్ సపోర్ట్, ఐసీయూ అవసరం లేదని బీఎంసీ అధికారులు తెలిపారు.
చదవండి: నుదుటిపై తిలకం పెట్టుకుందని విద్యార్థినిని చితకబాదిన టీచర్
ఇదిలా ఉండగా యూకేలో జనవరి 19న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE కేసు నమోదైంది. ఇక ఒమిక్రాన్ - BA.1, BA.2 నుంచి రూపాంతరం చెందినదే ఈ కొత్త వేరియంట్ XE. ప్రస్తుతంలో ప్రపంచంలో దీని కేసులు ఎక్కువ నమోదు కాలేదు కానీ ఇతర వేరియంట్ల కంటే ఇది 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.
కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 1086 కోవిడ్ కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,97,567కు చేరింది. ప్రస్తుతం 11,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76గా.. పాజిటివిటీ రేటు 0.22గా ఉంది.
చదవండి: Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా!
Comments
Please login to add a commentAdd a comment