రచయిత్రి, ఫొటోగ్రాఫర్ అయిన కరిష్మా మెహతా హ్యూమన్స్ ఆఫ్ బాంబే వెబ్‌సైట్ వ్యవస్థాపకురాలు, నిర్వాహకురాలు. హృదయాలను కదిలించే ప్రత్యేకమైన కథా విధానం ద్వారా ప్రజాదరణ పొందిన రచయిత్రి. ముంబై వాసి కరిష్మా మెహతా కాలక్షేపంగా కాకుండా సామాజిక బాధ్యతనూ తన కథనాల ద్వారా పంచుకుంటూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై డిజిటల్ రంగంలో తనను తాను ఆవిష్కరించుకోవడం, లక్షలమందికి చేరువైన తీరుతో సహా
తన కథనంతటినీ పంచుకున్నారు.
దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభించిన ఫేస్ బుక్ పేజీ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ కరిష్మా మెహతాకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినప్పుడు ఆమె వయసు కేవలం 21 ఏళ్లు. ఇప్పుడు విస్తృతమైన ప్లాట్‌ఫారమ్‌గా పరిణామం చెందింది. సామాన్యుల నుంచి ఉన్నతస్థాయి వ్యక్తుల వరకు ముంబై నివాసితుల కథనాలను వెలుగులోకి తెచ్చింది. అందుకోసం ఆమె పడిన కష్టం సామాన్యమైనది కాదు. సంపన్న వర్గంలో పుట్టినా తనకున్న ఆసక్తితో సామాన్యులలో తిరిగి, ఫొటోలతో వారి కథనాలను ప్రజలకు అందిస్తూ వచ్చింది.
మొదట్లో ఇద్దరు టెక్నికల్ వ్యక్తులతో కలిసి ప్రారంభించిన ఈ పని మెహతాను నేడు మిలియన్ల మందికి చేరువ చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో పలువురు ఆమె వెబ్‌సైట్‌కి ఫ్రీలాన్సర్లుగా ఉండేలా చేసింది. కిందటేడాది ‘హౌ ది హెల్ డిడ్ డూ ఇట్’ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఇతర నిష్ణాతులైన వ్యక్తుల ఇంటర్వ్యూల ద్వారా తనలో ఉన్న మరో ప్రతిభను పరిచయం చేసింది. రైటర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా, ప్రెజెంటర్‌గా రాణిస్తున్న కరిష్మా మాట్లాడుతూ –
చేయూతగా మారడం సంతోషం
‘‘కష్టంలో ఉన్న వ్యక్తులను గుర్తించడం, కలుసుకోవడం, మాట్లాడటం ప్రతిరోజూ జరుగుతుంటుంది. వారి కథను ఐదు వందల పదాల్లో మా పోర్టల్ ద్వారా తెలియజేయడం మాత్రమే కాదు ఏళ్లుగా జరుగుతోంది... అవసరమైన వారికి డబ్బు సేకరించి వారు తమ కష్టమైన పరిస్థితి నుండి బయట పడటానికి సహాయం చేయడం సంతోషంగా ఉంటుంది. ఒకరోజు హాస్పిటల్‌లో ఒక గర్భిణిని చూశాను. ఆమెకు అప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.
మగపిల్లవాడు కావాలనే ఆశతో పిల్లలను కంటూనే ఉంది. మద్యానికి బానిసైన భర్త ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె ఆసుపత్రి పాలు, భర్త జైలు పాలూ అయ్యారు. ఆమె కథనాన్ని జనం ముందుకు తీసుకువచ్చాను. ఆమెకు, ఆమె ఐదుగురు కూతుళ్లకు సమాజం నుంచి ఆర్థిక భద్రత లభించింది. ఆసరాగా అందిన రూ. 25 లక్షల రూపాయలు వారి జీవనం సాఫీగా గడపడానికి ఉపయోగపడ్డాయి. మరొక కథ జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అలీ భాయ్‌ది. చేయని నేరానికి ఏళ్లుగా జైలు జీవితం గడుపుతుండేవాడు.
అతని కథ బయటకు రావడంతో ఆ జీవితం నుంచి విముక్తి లభించింది. అలాగే, యాసిడ్ బాధితులకు, సెక్స్‌వర్కర్ల పిల్లలకు, ఎముక గుజ్జు మార్పిడి అవసరమయ్యే పిల్లల కోసం క్రౌడ్ ఫండింగ్ చేసి ఐదుకోట్ల నిధులను సేకరించి, అందించాం. వెబ్‌సైట్‌కు నిధులు సమకూర్చడానికి చేసిన మొదటి ప్రయత్నంలో ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పుస్తకం పబ్లిష్ అయ్యింది. అంటే, మా కథలు ప్రజలలో పెద్ద మార్పును తీసుకువచ్చాయి. ఎన్నోచోట్ల నుంచి మాకు కథనాలు అందుతుంటాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని, సేవను అందించగలుగుతున్నాం’’అని వివరిస్తారు ఆమె.
ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే!
‘ఏ కలా సాధించలేనంత పెద్దది కాదు’ అని చెప్పే కరిష్మా జీవితంలో చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని భావించే వ్యక్తి. యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ నుండి బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందిన కరిష్మా ఎప్పుడూ వ్యాపార వ్యూహాలను రూపొందిస్తూ ఉండేది. కెనడాలో డిగ్రీ పూర్తయిన ఆరు నెలల తర్వాత హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ నుంచి స్ఫూర్తి పొంది ముంబైలోని వ్యక్తుల కథలు, వారి జీవితాలను పరిచయం చేయడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేసింది.
ఎటువంటి గుర్తింపు లేని వ్యక్తుల గురించి కథలు చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్ ద్వారా ఆరువేలకు పైగా కథనాలను అందించింది. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమైన వారని, స్ఫూర్తిదాయకంగా ఉంటారని చూపించింది. నాలుగు లక్షలకు పైగా ఉండే సమూహాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. ఫేస్‌బుక్‌లో మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రెండింతలకు పైగా ఉన్నారు. ఫ్రీలాన్స్ రైటర్‌గా టెడెక్స్ ప్రెజెంటర్‌గానూ రాణిస్తున్న కరిష్మాకు సామాన్యుల కథనాలను పరిచయం చేయడం పట్ల ఆమెకున్న అభిరుచి, వ్యవస్థాపక స్ఫూర్తి అత్యంత ప్రభావంతమైన వేదికగా రూపొందించడానికి ఉపయోగించుకుంది.
ఆమె ఈ ప్రయాణం అంత సాఫీగా ఏమీ జరగలేదు. ఎన్నో ఒడిదొడుకులనూ ఎదుర్కొంది. కాపీ క్యాట్ అనే పేరును సొంతం చేసుకుంది. వివాదాలను, సవాళ్లను స్వీకరించింది. అయినా, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ సమాజంలో తన ఉనికిని, బాధ్యతనూ సమానంగా నిలబెట్టుకుంటున్నానని తన మాటలు, చేతల ద్వారా నిరూపిస్తున్న కరిష్మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment