ప్రాణ స్నేహితులు మంచి భార్యాభర్తలు కాలేకపోవచ్చు... కానీ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న దంపతులు ప్రాణ స్నేహితులుగా మెలగవచ్చు...పెళ్లికి ముందు కనీసం పరిచయం లేకున్నా సరే ప్రేమికులుగా మారి జీవన మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినా వైవాహిక బంధంతో ఒక్కటైన ఆ జంట కష్టసుఖాలను పంచుకుంటూ తోడూనీడలా ఒకరికొకరు వెన్నంటి ఉంటే ప్రతీ ఇల్లూ స్వర్గసీమే అవుతుంది. దాంపత్య బంధాన్ని దృఢంగా ఉంచే ప్రేమ.. పెళ్లికి ముందు పుట్టిందా లేదా పెళ్లి తర్వాత మనసులను పెనవేసిందా అనే విషయంతో సంబంధం లేదంటున్నారు ఈ ముంబై కపుల్. ఒకరికొకరై బతికితే అందం, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు.
‘నేనో చిన్నపట్టణంలో జన్మించాను. నాకు తొమ్మిది మంది తోబుట్టువులు. పెద్ద కుటుంబం కాబట్టి నేనెప్పుడూ ఊరు దాటి బయటికి వెళ్లింది లేదు. మాకు అంత స్థోమత, సమయం లేవు. అయితే కాలం గిర్రున తిరిగింది. పెళ్లితో నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి పెళ్లి రోజే నేను తొలిసారిగా ఆయనను చూశాను. అప్పుడు నాతో ఆయన అన్న మాటలన్నీ ఇంకా గుర్తున్నాయి. పెళ్లైన వెంటనే ఆయన నన్నో మాట అడిగారు. నువ్వు సరదాగా ఏనాడైనా బయటికి వెళ్లావా అని. ఎక్కడికీ వెళ్లలేదు. నాకు పాస్‌పోర్టు కూడా లేదు అని చెప్పాను. అప్పుడు నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నాలో భాగమయ్యావు. మనమిద్దరం కలిసి ప్రపంచాన్ని చుట్టేద్దాం అని చెప్పారు.
హనీమూన్ కోసం డార్జిలింగ్..
ఇద్దరం ఉద్యోగస్తులం కావడంతో సరదా ట్రిప్ కాస్త వాయిదా పడింది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సరే ఏడాదికి రెండుసార్లు కచ్చితంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాం. అలా హనీమూన్ కోసం డార్జిలింగ్ వెళ్లిన నాటి నుంచి మా ప్రయాణం ప్రారంభమైంది. బస్సులో బయల్దేరాం. ఓ వైపు ఉరుములు..మెరుపులు.. మరోవైపు కుండపోత వర్షం. కిటికీలు తెరచి ఉండటంతో మాపై నీళ్లు పడ్డాయి. దీంతో వెంటనే ఆయన కిటికీని మూసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో కిటికీని పూర్తిగా విరగ్గొట్టేశారు. ఇక చెప్పేదేముంది బస్సు మొత్తం నీళ్లతో నిండిపోయింది. దాదాపు 12 గంటల పాటు అలాగే కూర్చుండిపోయాం. హోటల్‌కి వెళ్లిన తర్వాత ఇవన్నీ గుర్తుచేసుకుని హాయిగా నవ్వుకున్నాం.
ఆరోజు చాలా భయం వేసింది..
ఖాట్మండు, షిమ్లా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పర్యటించాం. సరైన సమయానికి రైల్వే స్టేషనుకు చేరుకోలేక ఎన్నోసార్లు ప్లాట్‌ఫాంపై సూట్‌కేస్‌లపై నిద్ర పోవాల్సి వచ్చేది. అయినా ఏనాడు విసుగు చెందలేదు. కలిసి చేసే ప్రయాణంలోని మాధుర్యం అది. ఒకరోజు బద్రీనాథ్‌కు పయనమయ్యాం. కొద్దిదూరం వెళ్లగానే దారులన్నీ మూసివేశారు. దీంతో అక్కడున్న ఓ గుడిసెలో బస చేయాల్సి రావచ్చని మా గైడ్ సూచించాడు. అయితే రాత్రంతా ఏవో శబ్దాలు వినబడ్డాయి. నాకు చాలా భయం వేసింది. తెల్లవారి బయటికి వచ్చి చూస్తే మా ఆయన ఒకటే నవ్వడం. రాతి మీద నీళ్లు పడుతున్న శబ్దం అది.
రొమ్ము క్యాన్సర్ రావడంతో..
మా ‘జీవన ప్రయాణం’లో భాగంగా యూరోప్ వెళ్లేందుకు పొదుపు చేయడం మొదలుపెట్టాం. అదేవిధంగా వీలు చిక్కినప్పుడల్లా యూరోప్ పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు పుస్తకాలు చదివేవాళ్లం. ఇలా సాఫీగా.. సరదాగా సాగుతున్న జీవితంలో పెద్ద కుదుపు. ఛాతిలో నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకోగా నాకు రొమ్ము క్యాన్సర్ సోకినట్లు తేలింది. కీమోథెరపి మొదలైంది. అప్పుడు నా భర్త బాధ వర్ణనాతీతం. నన్ను కోల్పోతాననే భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అలా ఐదేళ్లు గడిచిన తర్వాత నేను పూర్తిగా కోలుకున్నాను. మళ్లీ మా ప్రయాణం మొదలైంది. యూరోప్, లండన్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్... ఆఖరికి ఇటలీ కూడా వెళ్లొచ్చాం. ఇక ఆస్ట్రేలియా, రష్యాలకు వెళ్లడమే మా ముందున్న లక్ష్యం.
తనను కలిసిన మొదటిరోజు తను నాకు అపరిచితుడు. కానీ ఇప్పుడు తనే నా కలల ప్రపంచం. తనతో జీవితం అత్యద్భుతం. తనతో ప్రేమలో మునిగిపోతానని ఏనాడు ఊహించలేదు. అలాగే ఇద్దరం కలిసి ఇలా ప్రపంచాన్ని చుట్టొస్తామని కూడా. నన్ను సర్‌ప్రైజ్ చేయడంలో తను ఎన్నడూ విఫలమవ్వలేదు. నోరు తెరచి ఏదీ అడగకపోయినా జీవితకాలానికి సరిపడా ఎన్నెన్నో మధురానుభూతులను నాకు మిగిల్చాడు’
హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్‌బుక్ పేజీ షేర్ చేసిన ఈ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. లైకులతో షేర్లతో దూసుకుపోతున్న ఈ అందమైన ప్రేమకథ ప్రతీ యువ జంటకు ఆదర్శనీయమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీ బంధం ఇలాగే కలకాలం వర్థిల్లాలి అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment