నకిలీ ఎస్సై హల్‌చల్‌ | Fake Police Cheated Unemployed Youth In Vizianagaram | Sakshi
Sakshi News home page

నకిలీ ఎస్సై హల్‌చల్‌

Published Sun, Jun 16 2019 10:36 AM | Last Updated on Sun, Jun 16 2019 10:37 AM

Fake Police Cheated Unemployed Youth In Vizianagaram - Sakshi

సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : పోలీస్‌ యూనిఫాం అంటే ఇష్టం ఉన్న యువకులు కష్టపడి చదివి పోలీస్‌ ఉద్యోగాన్ని సాధిస్తారు. కాని ఈ ఇద్దరు యువకులు మాత్రం అలా కష్టపడి చదవే ఓపిక లేక ఇష్టపడే పోలీస్‌ యూనిఫాంను వేసుకోవడం మొదలు పెట్టారు. అలా పోలీస్‌ యూనిఫాం వేసుకోవడం అలవాటుగా చేసుకుని తొలుత ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ఫొటోలు పెట్టడం తర్వాత ఏకంగా యూనిఫాంతో పబ్లిక్‌లో రావడం మొదలుపెట్టారు. ఇలా సమాజాన్ని మాత్రమే కాదు ఏకంగా వారిని కన్న తల్లిదండ్రులను కూడా తాము పోలీసులమే అంటూ నమ్మించి మోసం చేశారు. అందులో ఒకరు చీపురుపల్లి మండలంలోని గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్‌ అలియాస్‌ ప్రశాంత్‌ కాగా.. మరొకరు మచిలీపట్నంనకు చెందిన అంకాల బాబు. ప్రసాద్‌ ఎస్సై అవతారం ఎత్తగా... అంకాలబాబు కానిస్టేబుల్‌ అవతారం ఎత్తాడు. ఫేస్‌బుక్‌ ఖాతాల్లో వీరి ఫొటోలు చూసి పరిచయమైన ఓ ముగ్గురు యువకులకు హోంగార్డ్‌ ఉద్యోగాలు వేయిస్తామని వారి నుంచి అడ్వాన్స్‌గా రూ.24 వేలు తీసుకున్నారు. ఉద్యోగాల్లో చేరాక మిగిలిన డబ్బు ఇవ్వాలని ఒ ప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో నకిలీ ఎస్సై ప్రసాద్‌ తన స్వగ్రామానికి రావడంతో చీపురుపల్లి పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం వ్యవహారం బయిటకొచ్చింది. దీనికి సంబంధించి ఎస్సై ఐ.దుర్గాప్రసాద్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తుపాకీ, వాహనంతో గొల్లలపాలెంలో ప్రత్యక్షం....
గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్‌ అలియాస్‌ ప్రశాంత్‌ గతంలో ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అదే సమయంలో ఊరి నుంచి వెళ్లిపోయిన  ప్రసాద్‌ భీమవరంలో డీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో 2017లో డిగ్రీలో చేరాడు. అక్కడ ఎన్‌సీసీలో ఉంటూ భీమవరం పోలీస్‌ స్టేషన్‌లో కమ్యూనిటీ పోలీస్‌గా స్వచ్ఛంద సేవలు అందించేవాడు. అదే సమయంలో పోలీస్‌ యూనిఫాంపై ప్రసాద్‌కు మక్కువ పెరిగింది. అయితే ఒక ఏడాది మా త్రమే డిగ్రీ చదివి తర్వాత మానేసి విజయవాడ వెళ్లిపోయి అక్కడ సర్కార్‌గ్రాండ్‌ అనే హోటల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిలో జాయిన్‌ అయ్యాడు. అయితే ఎస్సై యూనిఫాంతో ఫొటోలు తీసుకుని ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తుం డడం ప్రసాద్‌కు అలవాటుగా మారింది. అంతా ఎస్సై అనుకుంటుండడంతో ప్రసాద్‌ కూడా తాను ఎస్సైననే అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అకస్మాత్తుగా ఈ నెల 13న ఎస్సై యూనిఫాంలో, తుపాకీతో పోలీస్‌ అని రాసి ఉన్న సుమో వాహనంలో గొల్లలపాలెంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ గ్రామంలో కొం తమంది అనుమానించి చీపురుపల్లి ఎస్సైకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వెళ్లి ప్రసాద్‌ను చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా అసల కథ బయిటకొచ్చింది.

డబ్బులు వసూలు..
ఎస్సైగా చలామణీలో ఉన్న బంకపల్లి ప్రసాద్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా మచిలీపట్నానికి చెందిన అంకాల బాబు పరిచయమయ్యాడు. ఆయన కూడా అప్పటికే కాని స్టేబుల్‌ దుస్తులు వేసుకుని నకిలీ కాని స్టేబుల్‌గా విజయవాడలో అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ ఇద్ద రు కలిసి ఫేస్‌బుక్‌ ఖాతాలో విపరీతంగా ఫొటోలు పెడుతుండడంతో పశ్చిమగోదావరి జి ల్లా భీమవరం మండలంలోని గొట్లపాడు గ్రామానికి చెందిన కె.స్వామి అనే డిగ్రీ విద్యార్థికి వీరు ఫేస్‌బుక్‌లో పరిచమయ్యారు. వీరు స్వామికి హోమ్‌గార్డు ఉ ద్యోగాలిప్పిస్తామని చెప్పారు. ఒక్కో పోస్టుకు రూ. లక్ష అవుతుందని, అడ్వాన్స్‌గా రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని చెప్పారు. దీంతో స్వామితో పాటు మరో ఇద్దరు మిత్రులు కలిసి ఒక్కొక్కరు రూ.8 వేలు చొప్పున 24 వేలు నకిలీ ఎస్సై ప్రసాద్‌ పంపించిన భాను అనే వ్యక్తి చేతికి ఈ నెల 11న ఇచ్చారు. 

హోమ్‌గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని అడ్వాన్స్‌ తీసుకున్న అభ్యర్థులకు నిందితులు డీజీపీ కార్యాలయం పేరుతో నకిలీ ఉత్తరాలు కూడా పంపించారు. అయితే ఉత్తరాల్లో తప్పులు ఉండడంతో అప్పటికే వారికి అనుమానం వచ్చింది.చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నకిలీ ఎస్సై ప్రసాద్‌ను విచారించే సమయంలో ఆయన మొబైల్‌లో బాధితుల ఫోన్‌ నంబర్లు స్థానిక ఎస్సైకు లభించాయి. దీంతో ఎస్సై వారితో ఫోన్‌లో మాట్లాడగా.. ఇదంతా మోసం అని తెలుసుకున్న స్వామి అనే యువకుడు భీమవరం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేసి చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వివరాలు పంపించారు. అంతేకాకుండా హోంగార్డు ఉద్యోగం కోసం డబ్బులు సమర్పించుకున్న స్వామి కూడా చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన వాంగ్మూలాన్ని స్థానిక పోలీసులకు ఇచ్చాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement