అభివృద్ధికి బంగారు బాటలు
► స్థానికులకే ఉద్యోగ అవకాశాలు
► సింగరేణిలో వారసత్వ హక్కు కేసీఆర్ ఘనతే
► రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్
కమాన్ పూర్/పెద్దపల్లి : తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ బంగారు బాటలు వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ అన్నారు. సోమవారం ఆయన కమాన్ పూర్, పెద్దపల్లిలో పర్యటించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిగారిగా కమాన్ పూర్‌కు రావడంతో టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కమాన్ పూర్, పెద్దపల్లిలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి జిల్లాల పునర్విభజన చేపట్టారన్నారు. కొత్త జిల్లాల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తే త్వరగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. సింగరేణిలో వారసత్వ హక్కు పునరుద్ధరించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు.
బంగారు తెలంగాణ కోసం అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం తనకు అవకాశం ఇచ్చిందని, అయితే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో తనకు, తన తండ్రి వెంకటస్వామికి ఉన్న అనుబంధాన్ని వదులుకోలేకపోయానని తెలిపారు. పెద్దపల్లి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నగర పంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్య తన పాలకవర్గంతో కలిసి ప్రభు త్వ సలహాదారు వివేక్, హరితహారం అవార్డు గ్రహీత, ఉత్తమ నియోజకవర్గాన్ని సాధించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమాల్లో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మాజీ మంత్రి వినోద్, కమాన్ పూర్, మంథని, రామగుండం జెడ్పీటీసీలు మేకల సంపత్, మూల సరోజన,కందుల సంధ్యరాణీ, ఎంపీపీలు ఇనగంటి ప్రేమలత, వేగోలపు కమల, పీఏసీఎస్ చైర్మన్లు బాద్రపు మల్లేశ్, మల్క రామస్వామి, ఆకుల కిరణ్, గుజ్జుల రాజిరెడ్డి, సర్పం చ్ కొంతం సత్యనారాయణ, ఆకుల గట్టయ్య, టీజీబీకేఎస్ ఉపాధ్యాక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ కమాన్ పూర్ మండల అధ్యక్షులు దాసరి రాయలింగు, ప్రధాన కార్యదర్శి కిషన్ రెడ్డి, నాయకులు సందనవేని సునీత, సారయ్యగౌడ్, లంక సదయ్య, రాజ్‌కుమార్, అమ్రీశ్, తబ్రేజ్, చంద్రమౌళి, ముబిన్, హన్మంతు, డాక్టర్ వెంకటేశ్వర్రావు, సజ్జాద్, సతీశ్‌గౌడ్, కుక్క కనకరాజు తదితరులు పాల్గొన్నారు.