జాలర్ల వలలో నల్లత్రాచు
జంగారెడ్డిగూడెం : జలాశయం వద్ద చేపలు, రొయ్యల కోసం ఏర్పాటు చేసిన మావు(ఇనుప ఊసలతో ఏర్పాటు చేసిన జల్లెడ లాంటి చతురాస్రాకార బాక్సు)లో నల్లత్రాచు పడడంతో జాలర్లు బెంబేత్తిపోయిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎర్రకాలువ జలాశయంలో వరదనీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో జాలర్లు మండలంలోని ఎ.పోలవరం జలాశయంలో చేపలు, రొయ్యల కోసం మావులు ఏర్పాటు చేశారు. ఈ మావుల్లో సుమారు 9 అడుగుల పొడవున్న నల్లత్రాచు పాము పడింది. మావులు బయటకు తీసి చూసేసరికి జాలర్లకు చేపలకు బదులు నల్లత్రాచు కనబడటంతో హడలెత్తారు. వెంటనే తేరుకుని మావు నుంచి త్రాచును చేపల వలలోకి మళ్లించారు. అరుదుగా కనిపించే ఈ నల్లత్రాచును చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. అయితే భక్తిభావంతో మత్స్యకారులు నల్లత్రాచును చంపకుండా సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లి వదిలివేశారు.