చిరుతదాడిలో మరొకరి బలి
చెన్నై, సాక్షి ప్రతినిధి: మనిషి మాంసం రుచిమరిగిన చిరుతలు ఇప్పటికే ఇద్దరిని హతమార్చాయి. గురువారం రాత్రి మరో నిండుప్రాణాన్ని బలిగొన్నాయి. ఈరోడ్డు జిల్లా సత్యమంగళానికి చెందిన రేశన్ (40) బేల్దారి కూలీ ప్రాణాలు చిరుతదాడిలో మరొకరి బలికోల్పోయాడు. చిరుతలు ఇటీవల జనారణ్యంలో సంచరించడం ప్రారంభించాయి. పశువులు, గొర్రెలు, మనుషులు ఏది దొరికితే వాటిని ఆరగించడం అలవాటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలను బెంబేలెత్తించిన చిరుతలు ఇటీవల చెన్నై నగర శివార్ల ప్రజలను సైతం భయపెడుతున్నాయి.
శివారు ప్రాంతమైన ఊరపాక్కం సమీపంలో చిరుత సంచారం జనాన్ని హడలెత్తిస్తోంది. చెంగల్పట్టులోని ఇరుకున్రపల్లిలో గత నెల ఒక చిరుత నాలుగు గొర్రెలను చంపి తినివేసింది. ఈరోడ్డు జిల్లా సత్యమంగళం వేదారాణ్యం, అంజూర్, అరుంగాల్, ఆతనూరు, పనంగపట్టుపాక్కం తదితర కొండ ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని అధికారులు ధ్రువీకరించారు.
ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బోన్లు అమర్చి పట్టుకునే ఏర్పాట్లు చేశారు. గత నెల 17వ తేదీన అంజూరు అటవీ ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల్లో చిరుత సంచారం నమోదైంది. సత్యమంగ ళం అటవీ ప్రాంతంలోని దింబమ్ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తించే మహ్మమద్ ఇలియాస్, కృష్ణన్‌లను చిరుత చంపివేసింది. దీంతో బోనుల సంఖ్యను పెంచారు. తెలివిగల చిరుత తన సంచారాన్ని ఆతనూరు, కారనైపుదుచ్చేరి ప్రాంతాలకు మార్చుకుంది.
గత వారం నీటికోసం చెరువుకు వెళ్లిన మహిళలు అక్కడ నీళ్లుతాగేందుకు వచ్చిన చిరుతను చూసి హడలిపోయారు. ఈ లోగా కారనైపుదుచ్చేరి నివాస ప్రాంతాల్లో చుక్కల జింక మృతదేహం దొరికింది. కారనైపుదుచ్చేరిలో చిరుత సంచారం తెలుసుకున్న 12 మందితో కూడిన తాంబరం అటవీశాఖ అధికారుల బృందం దాని పాదముద్రలు సేకరించింది. చిరుతపులి సంచారం అధికమైనట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అనేక బోనులను అమర్చారు.
చిరుత పులి సంచరిస్తున్న కారైనె పుదుచ్చేరి ప్రాంతం తాంబరం నుంచి కేవలం 10 కి.మీ కావడంతో నగర శివార్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, గతంలో ఇద్దరిని బలిగొన్న దింబమ్ అటవీ ప్రాంతంలో కొత్తగా నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఒక బోనులో చిరుత పడింది. దీనిని ఇటీవలే వండలూరు జూకు తరలించారు. నాలుగురోజుల క్రితం రోడ్డు వారగా మరో చిరుత సంచరించడాన్ని అటవీ సిబ్బంది చూశారు. దానిని బంధించేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
దింబంకు చెందిన రేశన్ అనే బేల్దారి కూలీ రోజూ ఉదయాన్నే తన పశువులను సత్యమంగళం అటవీహద్దులో వదిలి కూలికి వెళ్లేవాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అవే ఇంటికి వెతుక్కుంటూ వచ్చేసేవి. గురువారం సాయంత్రం పశువులు ఇంటికి రాకపోవడంతో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో వాటిని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్లాడు. అతను అలా వెళ్లగానే పశువులు ఇంటికి చేరుకున్నాయి. అయితే రేశన్ మాత్రం తిరిగిరాలేదు.
ఉదయాన్నే గ్రామస్తులు రేశన్ను వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్లగా అతని మృతదేహం కనపడింది. ఒంటరిగా వచ్చిన అతనిపై పులిదాడి చేసి గొంతుకొరికి చంపివేసినట్లుగా అటవీ అధికారులు నిర్దారించారు. మృతునికి భార్య సరోజ (34), ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిరుత దాడిలో మూడో వ్యక్తి బలికావడంతో అధికారులతో సహా ప్రజలు సైతం భయాందోళనలు గురవుతున్నారు.