మెరుపువేగంతో రేసుగుర్రం
లక్ష్య ఛేదనే ధ్యేయం. మెరుపు వేగమే నైజం. గెలుపు కోసం అలుపెరగని పరుగే ఆభరణం... రేసుగుర్రం అనగానే... అందరికీ కనిపించే క్వాలిటీలివి. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ కూడా ఇలాగే ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శనివారం వరకూ ఆర్ఎఫ్సీలో జరిగింది. అక్కడ హీరో ఇంటికి సంబంధించిన కీలక సన్నివేశాలను బన్నీ, ‘కిక్’శ్యామ్, సలోని, తనికెళ్ల భరణిలపై చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఈ షెడ్యూల్ మెరుపు వేగంతో జరుగుతోంది. డిసెంబర్ తొలివారం వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది.
భిన్నమైన కథ, కథనాలతో సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఇందులో బన్నీ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, బన్నీ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయేలా ఈ సినిమా ఉండబోతోందని యూనిట్ వర్గాల సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో సుహాసినీ మణిరత్నం, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతమ్‌రాజు, నిర్మాణం: శ్రీలక్ష్మినరసింహా ప్రొడక్షన్స్.