Residential Educational Society
-
మానస స్వప్నం నిరుపేదలకు ఓపాడ్ ఇళ్లు
సొంతింట్లో నివసించాలని కోరుకునే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు 23 ఏళ్ల పేరాల మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డ్రైనేజి నీటి పారుదల కోసం ఉపయోగించే.. పైపుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అతి తక్కువ ఖర్చుకే అందించనున్నట్లు మానస ప్రకటించింది. ప్రకటించినట్లుగానే రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది మానస. తను మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో మానసను, ఆమె చెల్లిని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి పడుతోన్న కష్టాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగిన మానస... తల్లి ప్రోత్సాహంతో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ అయిన తరువాత మరో ఆరు నెలలపాటు కొత్త కొత్త ఇళ్ల నిర్మాణ నమూనాలపై ఆమె పరిశోధనలు చేసింది. పరిశోధనలో భాగంగా జపాన్, హాంగ్‌కాంగ్, ఇతర ప్రదేశాల్లో అక్కడి వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా నిర్మించిన ఇళ్ల నమూనాలపై లోతుగా అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా మన దేశంలోని వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంటిని నిర్మించవచ్చో నిర్ణయించుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టడానికి రిజిస్టర్ చేసుకుంది. నిరుపేద కుటుంబాల కోసం 12 రకాల డిజైన్లు రూపొందించగా... ఇప్పుడు ఒక నమూనాతో ‘ఓపాడ్’ ఇంటిని నిర్మించింది. ఓపాడ్.. సిమెంటు తూములు (పైపు)ల్లో నిర్మించే ఈ ఇళ్లు చిన్నగా... చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓపాడ్ లో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, వాష్‌రూమ్‌లు ఉంటాయి. వస్తువులను పెట్టుకునేందుకు అల్మారాలు, ఎలక్ట్రిసిటీæ, వాటర్, డ్రైనేజీ సదుపాయాలు ఉంటాయి. పైపు పైన లాంజ్ లాంటి బాల్కనీ కూడా ఉంది. ఈ ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ ఇటూ కదపగల ఈ ఇళ్లæజీవిత కాలం వందేళ్లు అని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెప్పింది. సరికొత్త ఓపాడ్ ఇళ్లలో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ..‘‘పట్టణాలు, గ్రామాలు, స్లమ్స్‌లో నివసించే వారు ఎక్కువగా పూరి గుడిసె ల్లో నివసిస్తుంటారు. వర్షం పడిందంటే ఇళ్లలోకి నీరు చేరడం, పైకప్పు నుంచి వర్షం కురవడం, కొన్నిసార్లు నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడం వంటివి సంభవిస్తుంటాయి. నేను బి.టెక్ చదివేటప్పుడు ఇటువంటి సందర్భాలెన్నింటినో దగ్గరగా గమనించాను. సమస్యలు ఏవీ ఎదురుకాని ఇళ్లను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఓపాడ్ ఇళ్లను నిర్మిస్తున్నాను. ఈ ఇళ్లు ఎంతో చల్లగా ఉండడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిరుపేదలకోసం రూపొందించిన ఈ డిజైన్లలో కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులు, మొబైల్ హోమ్స్, మొబైల్ క్లినిక్‌లు, గెస్ట్ హౌస్, గార్డులు నివసించే రూములుగా కూడా ఉపయోగపడతాయి’’ అని వివరించింది. మానస తల్లి రమాదేవి మాట్లాడుతూ.. మా అమ్మాయి మానసకు వచ్చిన ఐడియాను మొదట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తన డిజైన్స్ గురించి మెచ్చుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మానస నిరుపేదలు ఖర్చుచేయగల సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని రమాదేవి చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మానసకు వచ్చిన ఆలోచన కొత్త ఆవిష్కరణలకు పునాది వేసేదిగా ఉంది. ఇది తన విజయ ప్రస్థానంలో కేవలం ప్రారంభం మాత్రమే. ముందుముందు తను మంచి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. మానస చెంగిచెర్లలో డెమో కోసం నిర్మించిన ఓపాడ్ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి రమాదేవితో మానస -
ఎస్సీలకు కార్పొరేట్ విద్య!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉండటంతో జిల్లాకు 100 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా రెసిడెన్షియల్ విద్యను అందిస్తోంది. తాజాగా జిల్లాల సంఖ్య పెరగడంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాను యూనిట్‌గా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కావడంతో.. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అన్ని జిల్లాలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 1,000 నుంచి 3,300కు పెరగనుంది. జిల్లా స్థాయిలో బీఏఎస్ లబ్ధిదారుల ఎంపిక, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపిక కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడంతో పాటు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రెసిడెన్షియల్ విద్యను కూడా అందిస్తారు. ఫీజులు పెంపు... బీఏఎస్ కింద ఎంపికైన వారిలో ఏడో తరగతిలోపు విద్యార్థులకు రూ. 20 వేలు, ఆపై తరగతుల వారికి రూ. 30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. నిర్వహణ భారీగా పెరగడంతో ఫీజులు పెంచాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తు త ఫీజులకు రెట్టింపు ఫీజులిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని త్వరలో ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమలు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ అన్నారు. -
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీల్లో 863 ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ) ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఆర్ఈఐ–ఆర్బీ కార్యనిర్వాహక అధికారిని ఆదేశించారు. జోన్, జిల్లా అంశాలతోపాటు రోస్టర్ పాయింట్లు, అర్హతలను నిర్ణయించి పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.. పోస్టుల వివరాలు: ప్రిన్సిపాల్ 15, లెక్చరర్ 616, లైబ్రేరియన్ 15, ఫిజికల్ డైరెక్టర్ 15, మెస్ మేనేజర్/వార్డెన్ 15, స్టాఫ్‌నర్సు 31, కేర్ టేకర్ 15, ల్యాబ్ అసిస్టెంట్ 62, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 22, జూనియర్ అసిస్టెంట్ 11, స్టోర్ కీపర్ 15. -
గురుకుల పాఠశాలలకు రూ. 239 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కస్తూర్బా గాంధీ, మోడల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం రూ. 239 కోట్లు మంజూరు చేసింది. ఈ మూడు కేటగిరీల్లోని పాఠశాలల్లో చదువుతున్న 1,75,000 మంది బాల బాలికలకు హాస్టళ్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి సంరక్షణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం ఆయా సంస్థల అధికారులతో సమీక్ష అనంతరం కడియం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెం చేందుకు నిధులు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వివిధ నిర్వహణ సంస్థల కింద నడుస్తున్న కస్తూర్బా పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈనెల 26న వైస్ చాన్స్లర్ల సమావేశం నిర్వహించనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు.