గురుకుల పాఠశాలలకు రూ. 239 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కస్తూర్బా గాంధీ, మోడల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం రూ. 239 కోట్లు మంజూరు చేసింది. ఈ మూడు కేటగిరీల్లోని పాఠశాలల్లో చదువుతున్న 1,75,000 మంది బాల బాలికలకు హాస్టళ్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి సంరక్షణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
సోమవారం ఆయా సంస్థల అధికారులతో సమీక్ష అనంతరం కడియం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెం చేందుకు నిధులు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వివిధ నిర్వహణ సంస్థల కింద నడుస్తున్న కస్తూర్బా పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈనెల 26న వైస్ చాన్స్‌లర్ల సమావేశం నిర్వహించనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు.