డిగ్రీ, పీజీల్లో 60% ఉంటేనే అర్హులు
గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో కఠిన నిబంధనలు
ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం ఉండాల్సిందే
బీఎడ్‌లోనూ 50 శాతం మార్కులు ఉండాల్సిందే
వెబ్సైట్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్
టీజీటీ పోస్టులకు మార్చి 19న ప్రిలిమినరీ, ఏప్రిల్ 30న మెయిన్
పీజీటీ పోస్టులకు మార్చి 19న ప్రిలిమినరీ, ఏప్రిల్ 23న మెయిన్
భాషలు మినహా మిగతా సబ్జెక్టులకు ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రాలు
గరిష్ట వయో పరిమితి పదేళ్లు సడలింపు
నిబంధనలపై నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో టీఎస్పీఎస్సీ కఠిన నిబంధనలు విధించింది. డిగ్రీ, పీజీల్లో జనరల్, బీసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతోపాటు బీఎడ్‌లోనూ కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో అనేక మంది అభ్యర్థులు నిరాశలో కూరుకుపోయారు. ఇప్పటివరకు ఏ ఉద్యోగ పరీక్షలోనైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉంటే చాలన్న నిబంధనే ఉండగా... గురుకులాల్లోని పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు నిర్ణయించిన విద్యార్హతలను చూసి షాకయ్యారు.
చాలా మందికి అశనిపాతమే!
ఐదేళ్ల కిందటి వరకు కూడా డిగ్రీ, పీజీలకు సంబంధించిన ఆర్ట్స్ గ్రూపుల్లో 55 శాతం మార్కులకుపైన సాధించే వారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేవారు. ఇప్పుడు పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారిలో అత్యధిక మంది వారే. 2012లో ఇంగ్లిష్ మీడియం మోడల్ స్కూళ్లలో చేపట్టిన పోస్టుల భర్తీలో డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులు సాధించి ఉంటే చాలన్న నిబంధన ఉంది. కానీ ఇప్పుడు గురుకుల పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 55 శాతం, మిగతా అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాలని టీఎస్పీఎస్సీ పేర్కొనడం అనేకమంది నిరుద్యోగులను ఆందోళనలో పడేసింది. చివరకు గ్రూప్–1, గ్రూప్–2 పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైతే చాలన్న నిబంధన ఉండగా.. గురుకుల టీచర్ పోస్టులకు మాత్రం ఇంత కఠిన నిబంధనలు విధించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. అసలు 60 శాతం, ఆపైన మార్కులు ఉండాల్సిందేననడం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధమని.. 50 శాతం, ఆపైన మార్కులుంటే సరిపోతుందని ఎన్సీటీఈ నిబంధనలు పేర్కొంటున్నాయని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
వచ్చే నెల 4 వరకు దరఖాస్తులు
అన్ని పోస్టులకు అభ్యర్థులు ఈనెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో వెల్లడించింది. టీజీటీ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష మార్చి 19న, మెయిన్ పరీక్ష ఏప్రిల్ 30న ఉదయం, మధ్యాహ్నం ఉంటుందని తెలిపింది. పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారా, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారా? అన్నది కమిషన్ ఇంకా నిర్ణయించలేదు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందే అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటీఆర్ చేసుకున్న వారు ఆ టీఎస్పీఎస్సీ ఐడీని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తంగా 4,362 టీజీటీ పోస్టులు ఉంటాయి. భాషలు మినహా మిగతా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నపత్రాలు ఉంటాయి. పీజీటీ పోస్టులకు మార్చి 19న ప్రిలిమినరీ, ఏప్రిల్ 23న ఉదయం, మధ్యాహ్నం మెయిన్ పరీక్షలు ఉంటాయి.
గరిష్ట వయో పరిమితి పదేళ్లు సడలింపు
అభ్యర్థులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. 1–7–2017 నాటికి జనరల్ అభ్యర్థులు కనీసంగా 18 ఏళ్లు, గరిష్టంగా 44 ఏళ్లలోపు ఉండాలి. అయితే రిజర్వేషన్లు కలుపుకొని 58 ఏళ్లు దాటిన వారు అర్హులు కాదు. పదేళ్ల సడలింపునకు అదనంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఆర్టీసీ వంటి వాటిల్లో చేస్తున్న వారికి మాత్రం వర్తించదు) ఎక్స్ సర్వీసుమెన్, ఎన్సీసీలో పనిచేసిన వారికి మూడేళ్ల అదనపు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు అదనపు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు రూ.350..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు కింద ప్రతి అభ్యర్థి కచ్చితంగా రూ.200 చెల్లించాలి. మరో రూ.150 పరీక్ష ఫీజు కింద చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష హెచ్ఎండీఏ పరిధిలో ఉంటుంది. జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించే అవకాశముంది. మెయిన్ పరీక్ష మాత్రం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంటుంది. పాత జిల్లాలు, జోన్ల ప్రకారం నియామకాలు, స్థానికత నిబంధనలు వర్తిస్తాయి.
కఠిన నిబంధనలపై విద్యార్థుల మండిపాటు
హైదరాబాద్: గురుకులాల్లో పోస్టుల భర్తీ నియమ నిబంధనలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మండిపడ్డారు. మంగళవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ లైబ్రరీని బహిష్కరించి.. ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేటు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయగా.. ఏబీవీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. డిగ్రీ, పీజీలలో 60 శాతం నిబంధనను రద్దు చేయాలని, డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, టెట్ వెయిటెజీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 13న టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని ప్రకటించారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లిన ఓయూ విద్యార్థి నాయకులు అదనపు కార్యదర్శి శివకుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
విద్యార్హతలివీ..
► ట్రెయినీ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీలో (బీఏ, బీఎస్సీ) కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ప్రథమ లేదా ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత మెథడాలజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. టెట్ పేపర్–2 అర్హత సాధించి ఉండాలి. మెయిన్ పరీక్ష స్కోర్‌కు 80 శాతం, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక జాబితా రూపొందిస్తారు.
► పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఏ, ఎంఎస్సీ వంటి మాస్టర్ డిగ్రీలో ప్రథమ శ్రేణి సాధించి ఉండాలి. లేదా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ప్రథమ లేదా ద్వితీయ శ్రేణిలో బీఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. 8 నుంచి 10వ తరగతి వరకు మూడేళ్లకు తగ్గకుండా బోధించిన అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
► స్టాఫ్ నర్సు పోస్టులకు మూడున్నరేళ్లు నర్సు ట్రైనింగ్ కోర్సు (జీఎన్ఎం), డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి.
► పీఈటీ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ యూజీ డిప్లొమా చేసి ఉండాలి.
► ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు డిగ్రీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉం డాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. గుర్తింపు పొందిన సెకండరీ స్కూల్ లేదా జూనియర్ కాలేజీలో పీఈటీగా లేదా పీడీగా మూడేళ్లకు తక్కువ కాకుండా పనిచేసి ఉండాలి.
► మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ మ్యూజిక్‌లో డిప్లొమా లేదా డిగ్రీ, డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్‌లో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. అలాగే మ్యూజిక్‌లో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
► లైబ్రేరియన్ పోస్టులకు సాధారణ డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి.
► క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఉడ్ వర్క్/టైలరింగ్/బుక్ బైండింగ్/ఎంబ్రాయిడరీ/ కార్పెంటర్/సేవింగ్ టెక్నాలజీ/ డ్రెస్ మేకర్ కోర్సులు చేసి ఉండాలి. లేదా ఉడ్ వర్క్/టైలరింగ్/బుక్ బైండింగ్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి.
ఆర్ట్ టీచర్ పోస్టులకు ఇంటర్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా ఇన్ ఆర్ట్స్ కోర్సు (ఫ్రీహ్యాండ్ ఔట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్ డిజైన్, పెయింటింగ్‌లలో ఏదేని కోర్సు) చేసి ఉండాలి. లేదా అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి ఉండాలి.
► వివిధ పరీక్షలకు సంబంధించిన స్కీం అండ్ సిలబస్, పరీక్ష విధానం (ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్), పరీక్ష కేంద్రాలు తదితర వివరాలు, జోన్లు, పాఠశాలలు, రిజర్వేషన్లు, మహిళలు, పురుషుల కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందవచ్చు.
వివిధ పోస్టులకు పరీక్ష తేదీలు
పీజీటీ: ప్రిలిమినరీ పరీక్ష మార్చి 19,
మెయిన్ ఏప్రిల్ 23న ఉదయం, మధ్యాహ్నం
టీజీటీ: ప్రిలిమినరీ మార్చి 19,
మెయిన్ ఏప్రిల్ 30న ఉదయం, మధ్యాహ్నం
పీఈటీ: ఏప్రిల్ 2న ఉదయం, మధ్యాహ్నం
స్టాఫ్ నర్సు: ఏప్రిల్ 2న ఉదయం, మధ్యాహ్నం
లైబ్రేరియన్: ఏప్రిల్ 16న ఉదయం, మధ్యాహ్నం
మ్యూజిక్ టీచర్: ఏప్రిల్ 2వ తేదీన
ఫిజికల్ డైరెక్టర్: ప్రిలిమినరీ మార్చి 19,
మెయిన్ ఏప్రిల్ 23
క్రాఫ్ట్ టీచర్: ఏప్రిల్ 2న
ఆర్ట్ టీచర్: ఏప్రిల్ 2న