ఇక అందరి దృష్టి ‘ఫలితాల’పైనే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈనెల 12వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, 13న మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. జిల్లాలో 50 మంది కార్పొరేటర్లుగా, 91 మంది కౌన్సిలర్లుగా ఎన్నికకానున్నారు. అనంతరం కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్‌ను, మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. 583 మంది ఎంపీటీసీ సభ్యులు 36 మంది ఎంపీపీలు, అంతే సంఖ్యలో వైస్ ఎంపీపీలను, 36 మంది జడ్పీటీసీ సభ్యులు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. కార్పొరేషన్లో ఒకరికి, మూడు మున్సిపాలిటీల్లో కలిపి ముగ్గురికి, 36 మండల పరిషత్‌లలో కలిపి 36 మందికి, జిల్లా పరిషత్‌లో ఒకరికి కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం దక్కనుంది.
నామినేటెడ్ పదవులు..
మార్చి 5న ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలైంది. అదే సమయంలో 10వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రెండు నెలల వ్యవధిలో మూడు ప్రధాన ఎన్నికలు రావడంతో పలువురు ఆశావహులు ఎన్నికల బరిలో నిలిచారు. రిజర్వేషన్లు, పొత్తులు తదితర కారణాలతో ఇంకా చాలా మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. అయితే ఆయా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని కీలక నేతలు.. తమ పార్టీ గెలిస్తే నామినేటెడ్ పదవులు లభిస్తాయన్న ఆశతో ఉన్నారు. ఓటమి పాలయ్యే నేతలూ ఈ పదవులపై కన్నేసే అవకాశాలున్నాయి.