Retail Banking
-
నిష్క్రమణ బాటలో విదేశీ బ్యాంకులు
న్యూఢిల్లీ: భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్న విదేశీ బ్యాంకుల జాబితాలో తాజాగా సిటీబ్యాంక్ కూడా చేరింది. 2011లో డాయిష్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్‌కు విక్రయించింది. 2013లో యూబీఎస్ వైదొలిగింది. మోర్గాన్ స్టాన్లీ తమ బ్యాంకింగ్ లైసెన్సును రిజర్వ్ బ్యాంక్‌కు సరెండర్ చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్, బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ 2015లో తమ కార్యకలాపాలను తగ్గించుకున్నాయి. 2016లో కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా నిష్క్రమించింది. అదే ఏడాది హెచ్ఎస్బీసీ రెండు డజన్లపైగా శాఖలను మూసివేసింది. బీఎన్పీ పారిబా 202లో తమ వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని మూసివేసింది. దక్షిణాఫ్రికాకు చెందిన రెండో అతి పెద్ద బ్యాంక్ ఫస్ట్‌ర్యాండ్‌బ్యాంక్ సైతం దేశీ మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించింది. 1984 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఆస్ట్రేలియా అండ్ న్యూజిల్యాండ్ బ్యాంక్ 2000లో తమ గ్రిండ్లేస్ బ్యాంక్‌ను స్టాండర్డ్ చార్టర్డ్‌కు విక్రయించి తప్పుకుంది. అయితే, 2011లో ముంబైలో కొత్త బ్రాంచ్ ద్వారా తిరిగివచ్చింది. దేశీ బ్యాంకుల నుంచి పోటీ పెరిగిపోతుండటం, పాటించాల్సిన నిబంధనలు వివిధ రకాలుగా ఉండటం, అసెట్ క్వాలిటీపరమైన సమస్యలు మొదలైనవి విదేశీ బ్యాంకుల నిష్క్రమణకు దారి తీస్తున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. పలు విదేశీ బ్యాంకులు తప్పుకుంటున్నప్పటికీ కొన్ని మాత్రం నిలదొక్కుకుంటున్నాయి. జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్‌కు భారత్‌లో 16 శాఖలు ఉన్నాయి. 2020లో లక్ష్మి విలాస్ బ్యాంక్‌ను డీబీఎస్ బ్యాంక్ ఇండియా కొనుగోలు చేసింది. -
భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్‌కు గుడ్‌బై!
ముంబై: భారత్‌లో క్రెడిట్ కార్డులు, గృహ రుణాలు తదితర కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపార కార్యకలాపాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీబ్యాంక్ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకపై సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు ముంబై, పుణే తదితర నగరాల్లోని కేంద్రాల నుంచి అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాలకు సర్వీసులు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు సిటీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆషు ఖుల్లార్ తెలిపారు. భారత్‌లో తమకున్న అయిదు ’సిటీ సొల్యూషన్ సెంటర్స్’ కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, గృహ రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ సేవలు మొదలైనవి కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపార విభాగం కింద ఉన్నాయి. దీన్నుంచి నిష్క్రమించే విధానానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇందుకు నియంత్రణ సంస్థపరమైన అనుమతులు కూడా కావాల్సి ఉంటుంది. ‘ప్రస్తుతానికైతే మా కార్యకలాపాల్లో తక్షణ మార్పులేమీ ఉండవు. అలాగే మా ఉద్యోగులపైనా దీని ప్రభావమేమీ ఉండదు. నిష్క్రమణ నిర్ణయం అమల్లోకి వచ్చే దాకా కస్టమర్లకు పూర్తి నిబద్ధతతో సేవలు అందించడం కొనసాగిస్తాం‘ అని ఖుల్లార్ వివరించారు. భారత్ సహా 13 దేశాల్లో కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఆయా మార్కెట్లలో వ్యాపార వృద్ధికి పెద్దగా అవకాశాల్లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిటీ బ్యాంక్ గ్లోబల్ సీఈవో జేన్ ఫ్రేసర్ పేర్కొన్నారు. 1985 నుంచి కన్సూమర్ బ్యాంకింగ్.. దాదాపు శతాబ్దం క్రితం 1902లో సిటీ .. భారత్‌లో అడుగుపెట్టింది. 1985 నుంచి కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ విభాగంలో 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 35 శాఖలు ఉన్నాయి. -
జోరుగా ఐసీఐసీఐ బ్యాంక్ విస్తరణ...
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్‌లను, బ్రాంచీలను జోరుగా విస్తరిస్తోంది. రిటైల్ కార్యకలాపాల వ్యాపార వృద్ధి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఐసీఐసీఐ సీఈఓ, ఎండీ చందా కొచర్ చెప్పారు. అంతేకాకుండా 1,000కి పైగా కొత్త ఏటీఎమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. రిటైల్ బ్యాంకింగ్‌కు విస్తృతమైన బ్రాంచ్ నెట్వర్క్ కీలకమని అందుకే కొత్తగా బ్రాంచీలను, ఏటీఎమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. విస్తృతమైన బ్రాంచ్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్‌లకే ఖాతాదారులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు. తమ ఏటీఎమ్‌లు మినీ బ్రాంచ్‌లుగా పనిచేస్తున్నాయని చందా కొచర్ వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి ఐసీఐసీఐ బ్యాంక్‌కు 4,450 బ్రాంచ్‌లు, 13,766 ఏటీఎమ్‌లు ఉన్నాయి.