ముంబై: భారత్‌లో క్రెడిట్ కార్డులు, గృహ రుణాలు తదితర కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపార కార్యకలాపాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీబ్యాంక్ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకపై సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు ముంబై, పుణే తదితర నగరాల్లోని కేంద్రాల నుంచి అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాలకు సర్వీసులు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు సిటీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆషు ఖుల్లార్ తెలిపారు. భారత్‌లో తమకున్న అయిదు ’సిటీ సొల్యూషన్ సెంటర్స్’ కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు.
క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, గృహ రుణాలు, వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు మొదలైనవి కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపార విభాగం కింద ఉన్నాయి. దీన్నుంచి నిష్క్రమించే విధానానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇందుకు నియంత్రణ సంస్థపరమైన అనుమతులు కూడా కావాల్సి ఉంటుంది. ‘ప్రస్తుతానికైతే మా కార్యకలాపాల్లో తక్షణ మార్పులేమీ ఉండవు. అలాగే మా ఉద్యోగులపైనా దీని ప్రభావమేమీ ఉండదు. నిష్క్రమణ నిర్ణయం అమల్లోకి వచ్చే దాకా కస్టమర్లకు పూర్తి నిబద్ధతతో సేవలు అందించడం కొనసాగిస్తాం‘ అని ఖుల్లార్ వివరించారు. భారత్ సహా 13 దేశాల్లో కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఆయా మార్కెట్లలో వ్యాపార వృద్ధికి పెద్దగా అవకాశాల్లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిటీ బ్యాంక్ గ్లోబల్ సీఈవో జేన్ ఫ్రేసర్ పేర్కొన్నారు.
1985 నుంచి కన్సూమర్ బ్యాంకింగ్..
దాదాపు శతాబ్దం క్రితం 1902లో సిటీ .. భారత్‌లో అడుగుపెట్టింది. 1985 నుంచి కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ విభాగంలో 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 35 శాఖలు ఉన్నాయి.
భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్‌కు గుడ్‌బై!
Published Fri, Apr 16 2021 6:03 AM | Last Updated on Fri, Apr 16 2021 6:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment