Citibank
-
ప్రభుత్వ బ్యాంకులనూ వదలని ఆర్బీఐ - రూ.10.34 కోట్లు ఫైన్!
గత కొన్ని రోజులుగా నిబంధనలను అతిక్రమిస్తున్న బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేయడమే కాకుండా కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు కోట్ల రూపాయాల ఫైన్ వేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు ఈ రోజు రూ. 10.34 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా'పై ఆర్బీఐ ఏకంగా రూ. 4.34 కోట్లు జరిమానా విధించింది. కామన్ ఎక్స్పోజర్ సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేయడంలో RBI ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) ప్రభుత్వ రంగంలోని మరో దిగ్గజ బ్యాంక్ 'ఇండియన్ ఓవర్సీస్'పై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయలు జరిమానా విధించింది. బ్యాంక్ లోన్స్, అడ్వాన్సులకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. సిటీ బ్యాంక్ (City Bank) ప్రైవేట్ రంగంలో 'సిటీ బ్యాంక్'పై RBI ఏకంగా రూ. 5 కోట్లు ఫైన్ వేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ విధానాలను అమలు చేయడంలో ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించడం వల్ల ఈ జరిమానా విధించారు. -
12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి!
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని దిగ్గజ కంపెనీలు సైతం ఆదేశించాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా సిటీ బ్యాంక్ ఇండియా మాత్రం మహిళా ఉద్యోగులకు పరిమిత కాలం 'వర్క్ ఫ్రమ్ హోమ్' సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి స్త్రీ తల్లి అయినప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత ఉంటుందని అనాదిగా వింటున్నాం. అయితే ఆధునిక కాలంలో కొన్ని సందర్భాల్లో భార్య, భర్త తప్పకుండా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. స్త్రీ గర్భధారణ నుంచి మాతృమూర్తిగా మారి పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనిని దృష్టిలో ఉంచుకుని సిటీ బ్యాంక్ ఇండియా 12 నెలలు లేదా సంవత్సరం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది. ఇప్పటికే 6 నెలలు మెటర్నిటీ లీవ్స్ అందిస్తోంది.. దానికి తోడు ఇప్పుడు 12 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తోంది. ఇది నిజంగా మహిళలకు గొప్ప వరం అనే చెప్పాలి. మొత్తానికి మహిళా ఉద్యోగులు 21 నెలలు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి విధానం తీసుకువచ్చిన మొదటి కార్పొరేట్ బ్యాంకుగా 'సిటీ బ్యాంక్' రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ విధానాన్ని భారతదేశంలో ప్రారంభించి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరిస్తామని సిటీ బ్యాంక్ ఇండియా అండ్ సౌత్ ఆసియ హెచ్ఆర్ హెడ్ ఆదిత్య మిట్టల్ అన్నారు. తల్లిగా మారే మహిళ అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని చేసుకోవడానికి అవకాశం అందించడం చాలా ఆనందమని వెల్లడించారు. ప్రస్తుతం సిటీ బ్యాంకులో 30వేలకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 38 శాతం మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచడానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
నిష్క్రమణ బాటలో విదేశీ బ్యాంకులు
న్యూఢిల్లీ: భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్న విదేశీ బ్యాంకుల జాబితాలో తాజాగా సిటీబ్యాంక్ కూడా చేరింది. 2011లో డాయిష్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్‌కు విక్రయించింది. 2013లో యూబీఎస్ వైదొలిగింది. మోర్గాన్ స్టాన్లీ తమ బ్యాంకింగ్ లైసెన్సును రిజర్వ్ బ్యాంక్‌కు సరెండర్ చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్, బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ 2015లో తమ కార్యకలాపాలను తగ్గించుకున్నాయి. 2016లో కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా నిష్క్రమించింది. అదే ఏడాది హెచ్ఎస్బీసీ రెండు డజన్లపైగా శాఖలను మూసివేసింది. బీఎన్పీ పారిబా 202లో తమ వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని మూసివేసింది. దక్షిణాఫ్రికాకు చెందిన రెండో అతి పెద్ద బ్యాంక్ ఫస్ట్‌ర్యాండ్‌బ్యాంక్ సైతం దేశీ మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించింది. 1984 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఆస్ట్రేలియా అండ్ న్యూజిల్యాండ్ బ్యాంక్ 2000లో తమ గ్రిండ్లేస్ బ్యాంక్‌ను స్టాండర్డ్ చార్టర్డ్‌కు విక్రయించి తప్పుకుంది. అయితే, 2011లో ముంబైలో కొత్త బ్రాంచ్ ద్వారా తిరిగివచ్చింది. దేశీ బ్యాంకుల నుంచి పోటీ పెరిగిపోతుండటం, పాటించాల్సిన నిబంధనలు వివిధ రకాలుగా ఉండటం, అసెట్ క్వాలిటీపరమైన సమస్యలు మొదలైనవి విదేశీ బ్యాంకుల నిష్క్రమణకు దారి తీస్తున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. పలు విదేశీ బ్యాంకులు తప్పుకుంటున్నప్పటికీ కొన్ని మాత్రం నిలదొక్కుకుంటున్నాయి. జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్‌కు భారత్‌లో 16 శాఖలు ఉన్నాయి. 2020లో లక్ష్మి విలాస్ బ్యాంక్‌ను డీబీఎస్ బ్యాంక్ ఇండియా కొనుగోలు చేసింది. -
యాక్సిస్ గూటిలో సిటీ రిటైల్
న్యూఢిల్లీ/ముంబై: విదేశీ సంస్థ సిటీబ్యాంకు రిటైల్ బిజినెస్ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్‌ను మినహాయించిన డీల్ ప్రకారం తుదిగా రూ. 11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్ సిటీ కస్టమర్లను యాక్సిస్ పొందింది. డీల్ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌధురి తెలియజేశారు. తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, చెక్ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్ మరో 2.5 మిలియన్ క్రెడిట్ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ. 4 లక్షల కోట్ల రిటైల్ బుక్ కలిగిన యాక్సిస్ సిటీబ్యాంక్ ఇండియాకు చెందిన 3 మిలియన్ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్ బ్యాంక్ వినియోగించుకోనుంది. -
ఎయిర్టెల్ ఆఫ్రికాకు సిటీ రూ.1,000 కోట్ల రుణం
ముంబై: ఎయిర్టెల్ ఆఫ్రికా 125 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,000 కోట్లు) రుణ సదుపాయం కోసం అమెరికాకు చెందిన సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. 14 ఆఫ్రికా దేశాల్లో ఎయిర్టెల్ ఆఫ్రికా టెలికం, మొబైల్ మనీ సేవలు అందిస్తోంది. స్థానిక కరెన్సీతోపాటు, డాలర్ మారకంలో ఈ రుణ సదుపాయం ఉంటుందని ఎయిర్టెల్ ఆఫ్రికా ప్రకటించింది. ఈ సదుపాయం 2024 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎయిర్టెల్ ఆఫ్రికా కార్యకలాపాలకు మద్దతుగా, నాలుగు సబ్సిడరీ కంపెనీల్లో పెట్టుబడులకు వినియోగించనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు చెందిన ముంబై యూనిట్ ద్వారా ఈ డీల్ చేసుకున్నట్టు ప్రకటించింది. -
వ్యాక్సిన్ మస్ట్.. లేదంటే జాబ్‌కే ఎసరు?
ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గరిష్ట సంఖ్యలో ఉద్యోగులను ఇంకొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోంకే పరిమితం చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఆఫీసులకు వచ్చినా.. హైబ్రిడ్ వర్క్‌లో కొనసాగినా.. వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్నా సరే వ్యాక్సిన్ వేయించుకుని తీరాలని కండిషన్లు పెడుతున్నాయి కంపెనీలు. లేకుంటే ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయి. ఈ మధ్యే గూగుల్, ఇంటెల్ కంపెనీలు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు పంపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో దిగ్గజం చేరింది. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ ఇన్కార్పొరేటెడ్, ఎంప్లాయిస్‌కు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కంపెనీ ఎంప్లాయిస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని జనవరి 14వ తేదీన డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ అప్లోడ్ చేయని పక్షంలో అన్‌పెయిడ్ లీవ్ కింద వాళ్లను పరిగణించి.. ఈ నెలాఖరులోపు వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ముందస్తు సంతకాలు ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్‌కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఉద్యోగ నియామకాల టైంలోనూ, ఉద్యోగులకు బోనస్‌లు చెల్లించే ఒప్పందాల సమయంలోనూ వ్యాక్సినేషన్ పాలసీని ముందుపెడుతూ తప్పనిసరిగా సంతకాలు చేయించుకుంటున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్లకు ఎవరైతే దూరంగా ఉంటారో.. వాళ్లను అన్‌పెయిడ్ సెలవులపై పంపించడం, జీతాల కోతల, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతతో పాటు ప్రభుత్వాలు తీసుకొస్తున్న వ్యాక్సినేషన్ మస్ట్ పాలసీలకు తలొగ్గుతున్న దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా ఈ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నాయి. అయితే మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. మన దేశంలోనూ.. వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో మినహాయింపులు సైతం ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్‌కు ‘హై రిస్క్’ ట్యాగ్‌ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావించి వ్యాక్సిన్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చదవండి: ఉద్యోగులకు గుడ్‌న్యూస్! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్‌కు గుడ్‌బై!
ముంబై: భారత్‌లో క్రెడిట్ కార్డులు, గృహ రుణాలు తదితర కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపార కార్యకలాపాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీబ్యాంక్ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకపై సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు ముంబై, పుణే తదితర నగరాల్లోని కేంద్రాల నుంచి అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాలకు సర్వీసులు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు సిటీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆషు ఖుల్లార్ తెలిపారు. భారత్‌లో తమకున్న అయిదు ’సిటీ సొల్యూషన్ సెంటర్స్’ కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, గృహ రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ సేవలు మొదలైనవి కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపార విభాగం కింద ఉన్నాయి. దీన్నుంచి నిష్క్రమించే విధానానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇందుకు నియంత్రణ సంస్థపరమైన అనుమతులు కూడా కావాల్సి ఉంటుంది. ‘ప్రస్తుతానికైతే మా కార్యకలాపాల్లో తక్షణ మార్పులేమీ ఉండవు. అలాగే మా ఉద్యోగులపైనా దీని ప్రభావమేమీ ఉండదు. నిష్క్రమణ నిర్ణయం అమల్లోకి వచ్చే దాకా కస్టమర్లకు పూర్తి నిబద్ధతతో సేవలు అందించడం కొనసాగిస్తాం‘ అని ఖుల్లార్ వివరించారు. భారత్ సహా 13 దేశాల్లో కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఆయా మార్కెట్లలో వ్యాపార వృద్ధికి పెద్దగా అవకాశాల్లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిటీ బ్యాంక్ గ్లోబల్ సీఈవో జేన్ ఫ్రేసర్ పేర్కొన్నారు. 1985 నుంచి కన్సూమర్ బ్యాంకింగ్.. దాదాపు శతాబ్దం క్రితం 1902లో సిటీ .. భారత్‌లో అడుగుపెట్టింది. 1985 నుంచి కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ విభాగంలో 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 35 శాఖలు ఉన్నాయి. -
ఐఫోన్, ఐప్యాడ్లపై రూ.23వేల క్యాష్‌బ్యాక్
ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ రెండూ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. ఆపిల్, సిటీ బ్యాంకు రెండు జతకట్టి ఓ స్పెషల్ కోంబో ఆఫర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.23వేల వరకు క్యాష్ బ్యాక్‌ను అందిచనున్నట్టు ఆపిల్ తెలిపింది. అయితే ఈ కొత్త ఫోన్లతో పాటు ఐప్యాడ్ కూడా కొనుగోలుచేసిన వారికే ఈ కోంబో ఆఫర్ వర్తించనుంది. అదేవిధంగా ఐప్యాడ్ కొనుగోలు చేసిన వారికీ ఈ క్యాష్ బ్యాక్ వర్తించనుంది. కానీ వారు కూడా ఆపిల్ లేటెస్ట్గా విడుదల చేసిన ఐఫోన్ మోడల్స్ ఫోన్లలో ఏదో ఒకదానికి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని ఒకేసారి, ఒకేస్టోర్లో కొనుగోలు చేయాలి. ఈ ఆఫర్ కేవలం సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు మాత్రమే వర్తించనుంది. ఒకవేళ అవసరమైతే వీటిని కొనుగోలు చేసేటప్పుడు ఇచ్చే ఫోన్ నెంబర్ కూడా రెండింటిలోనూ ఒకేలా ఉండాలి. ఆపిల్-సిటీబ్యాంకు అందిస్తున్న ఐఫోన్-ఐప్యాడ్ కోంబో ఆఫర్ కేవలం ఎంపికచేసిన ఆఫ్‌లైన్ ఆపిల్-ఆథరైజడ్ రీసెల్లర్స్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ శుక్రవారం నుంచి ప్రారంభమై, 2016 డిసెంబర్ 31కి ముగియనుంది. ఆఫర్ కాలంలో కస్టమర్లు గరిష్టంగా నాలుగు లావాదేవీలు మాత్రమే జరపాల్సి ఉంటుంది. ప్రతి నెలా రెండు లావాదేవీలకు కంపెనీ అనుమతించనున్నట్టు తెలిపింది. ఐఫోన్ 7 లేదా ఐఫోన్ 7 ప్లస్ కొనుగోలు చేసే కస్టమర్లు ఐప్యాడ్ మినీ2, ఐప్యాడ్ మినీ4ను కొనుగోలు చేస్తే, రూ.17వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందనున్నారు. ఒకవేళ ఐప్యాడ్ ఎయిర్2 కొంటే, రూ.18వేలు, ఐప్యాడ్ ప్రొ మోడల్‌కు రూ.23వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాలు కొనుగోలు చేసిన తర్వాత 90 రోజుల్లో సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులో క్రెడిట్ కానున్నాయి. -
రెండు గంటల్లో క్రెడిట్ కార్డు..
బ్యాంకులు మళ్లీ విరివిగా క్రెడిట్ కార్డులు ఇస్తున్నప్పటికీ.. వీటిని తీసుకోవాలంటే బోలెడు ప్రక్రియ, సమయం పట్టేస్తోంది. అయితే, సిటీ బ్యాంక్ మాత్రం కొన్ని చోట్ల కేవలం రెండు గంటల్లోనే ఇన్‌స్టంట్‌గా క్రెడిట్ కార్డు అందిస్తోంది. కస్టమర్ చేయాల్సిందల్లా బ్యాంక్ బ్రాంచీలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఐడీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్‌తో పాటు శాలరీ స్లిప్, ఫొటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అందజేయడమే. సదరు బ్రాంచీ సిబ్బంది అప్పటికప్పుడు సిబిల్ స్కోరును, ఇతరత్రా అంశాలను పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉన్న పక్షంలో దరఖాస్తుదారు పేరుతో అప్పటికప్పుడు కార్డును చేతికి అందిస్తారు. ఈ ప్రక్రియంతా గంటా, రెండు గంటల్లో పూర్తయిపోతుంది. ప్రస్తుతానికైతే, ముంబై, బెంగళూరులో మాత్రమే సిటీ బ్యాంక్ ఈ తరహా కార్డులు జారీ చేస్తోంది. -
కంపెనీల వీఆర్ఎస్ బాట
న్యూఢిల్లీ: కాలానుగుణంగా బిజినెస్ వాతావరణంలో ఏర్పడే మార్పులను ఎదుర్కోవడం, వ్యయాల ఆదుపు వంటి చర్యలను చేపట్టే బాటలో ఇటీవల కంపెనీలు తమ ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకాన్ని ప్రవేశపెడుతున్నాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఫార్మా, ఎరువులు, రసాయనాలు, స్టీల్, టెక్స్టైల్స్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు అత్యధిక స్థాయిలో వీఆర్ఎస్ను అనుసరిస్తున్నాయి. మాన్సెర్ కన్సల్టింగ్ విడుదల చేసిన రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. కాగా, ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకునేందుకు ప్రధానంగా కంపెనీలు వీఆర్ఎస్ బాట పడుతున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ వీఆర్ఎస్ను ప్రవేశపెట్టే కంపెనీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అశోక్ లేలాండ్, నోకియా, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ను ఆఫర్ చేయడం గమనార్హం. పునర్వ్యవస్థీకరణ వ్యూహం గరిష్ట స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యే రంగాలలోని కంపెనీలు ప్రధానంగా వీఆర్ఎస్ను చేపడుతున్నాయని రాండ్‌స్టాండ్ ఇండియా సీఈవో మూర్తి కె.ఉప్పలూరి చెప్పారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని వివరించారు. దశాబ్దంకిందటి పరిస్థితుల తో పోలిస్తే ప్రస్తుతం వీఆర్ఎస్ అమలు చేయడం అధికమైందని తెలిపారు. బిజినెస్‌లలో స్థిరత్వం ఏర్పడేటంతవరకూ రానున్న కొద్ది త్రైమాసికాలపాటు ఈ ట్రెండ్ కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ లైట్‌హౌస్ పార్టనర్స్‌కు చెందిన మేనేజింగ్ పార్టనర్ రాజీవ్ బర్మన్ సైతం వ్యక్తం చేశారు. మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకుని వీఆర్ఎస్ ను కొనసాగిస్తాయని చెప్పారు. ప్రభుత్వ రంగ కంపెనీలు పనితీరును మెరుగుపరచుకునేందుకు వీఆర్ఎస్ అమలును చేపట్టాల్సి వస్తుందన్నారు.