ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గరిష్ట సంఖ్యలో ఉద్యోగులను ఇంకొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోంకే పరిమితం చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఆఫీసులకు వచ్చినా.. హైబ్రిడ్ వర్క్‌లో కొనసాగినా.. వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్నా సరే వ్యాక్సిన్ వేయించుకుని తీరాలని కండిషన్లు పెడుతున్నాయి కంపెనీలు. లేకుంటే ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయి.
ఈ మధ్యే గూగుల్, ఇంటెల్ కంపెనీలు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు పంపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో దిగ్గజం చేరింది. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ ఇన్‌కార్పొరేటెడ్, ఎంప్లాయిస్‌కు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కంపెనీ ఎంప్లాయిస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని జనవరి 14వ తేదీన డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ అప్‌లోడ్ చేయని పక్షంలో అన్‌పెయిడ్ లీవ్ కింద వాళ్లను పరిగణించి.. ఈ నెలాఖరులోపు వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ముందస్తు సంతకాలు
ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్‌కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఉద్యోగ నియామకాల టైంలోనూ, ఉద్యోగులకు బోనస్‌లు చెల్లించే ఒప్పందాల సమయంలోనూ వ్యాక్సినేషన్ పాలసీని ముందుపెడుతూ తప్పనిసరిగా సంతకాలు చేయించుకుంటున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్‌లకు ఎవరైతే దూరంగా ఉంటారో.. వాళ్లను అన్‌పెయిడ్ సెలవులపై పంపించడం, జీతాల కోతల, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతతో పాటు ప్రభుత్వాలు తీసుకొస్తున్న వ్యాక్సినేషన్ మస్ట్ పాలసీలకు తలొగ్గుతున్న దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా ఈ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నాయి. అయితే మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
మన దేశంలోనూ..
వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో మినహాయింపులు సైతం ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్‌కు ‘హై రిస్క్’ ట్యాగ్‌ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావించి వ్యాక్సిన్ సెంటర్‌ల వైపు పరుగులు తీస్తున్నారు.
చదవండి: ఉద్యోగులకు గుడ్‌న్యూస్! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది
Comments
Please login to add a commentAdd a comment