కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని దిగ్గజ కంపెనీలు సైతం ఆదేశించాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా సిటీ బ్యాంక్ ఇండియా మాత్రం మహిళా ఉద్యోగులకు పరిమిత కాలం 'వర్క్ ఫ్రమ్ హోమ్' సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతి స్త్రీ తల్లి అయినప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత ఉంటుందని అనాదిగా వింటున్నాం. అయితే ఆధునిక కాలంలో కొన్ని సందర్భాల్లో భార్య, భర్త తప్పకుండా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. స్త్రీ గర్భధారణ నుంచి మాతృమూర్తిగా మారి పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనిని దృష్టిలో ఉంచుకుని సిటీ బ్యాంక్ ఇండియా 12 నెలలు లేదా సంవత్సరం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది.
ఇప్పటికే 6 నెలలు మెటర్నిటీ లీవ్స్ అందిస్తోంది.. దానికి తోడు ఇప్పుడు 12 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తోంది. ఇది నిజంగా మహిళలకు గొప్ప వరం అనే చెప్పాలి. మొత్తానికి మహిళా ఉద్యోగులు 21 నెలలు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి విధానం తీసుకువచ్చిన మొదటి కార్పొరేట్ బ్యాంకుగా 'సిటీ బ్యాంక్' రికార్డ్ సృష్టించింది.
ప్రస్తుతం ఈ విధానాన్ని భారతదేశంలో ప్రారంభించి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరిస్తామని సిటీ బ్యాంక్ ఇండియా అండ్ సౌత్ ఆసియ హెచ్ఆర్ హెడ్ ఆదిత్య మిట్టల్ అన్నారు. తల్లిగా మారే మహిళ అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని చేసుకోవడానికి అవకాశం అందించడం చాలా ఆనందమని వెల్లడించారు. ప్రస్తుతం సిటీ బ్యాంకులో 30వేలకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 38 శాతం మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచడానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment