retail brand
-
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్‌తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
అమెరికాలో బ్రాండ్ల దివాలా..
న్యూయార్క్: అమెరికాలో శతాబ్దాలుగా కొనసాగుతున్న రిటైల్ దిగ్గజ సంస్థలు కరోనా వైరస్ దెబ్బతో మూతబడుతున్నాయి. రోజురోజుకూ ఈ లిస్టు గణనీయంగా పెరుగుతోంది. తాజాగా లార్డ్ అండ్ టేలర్, మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ బ్యాంక్స్ తదితర సంస్థలు దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. లార్డ్ అండ్ టేలర్ 1824లో ప్రారంభమైంది. దీన్ని గతేడాదే ఫ్రాన్స్‌కి చెందిన దుస్తుల రెంటల్ సంస్థ లె టోట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ రెండూ వేర్వేరుగా దివాలా పిటిషన్లు దాఖలు చేశాయి. కొనుగోలుదారు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లార్డ్ అండ్ టేలర్ వెల్లడించింది. దాదాపు శతాబ్దంపైగా తమ చేతుల్లోనే ఉన్న 11 అంతస్తుల భవంతిని ఈ కంపెనీ గతేడాదే విక్రయించింది. ఇక, సూట్లకు డిమాండ్ పడిపోవడంతో మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ బ్యాంక్స్ స్టోర్స్ వంటి బ్రాండ్ల మాతృసంస్థ టైలర్డ్ బ్రాండ్స్ కష్టాలు మరింత పెరిగి, దివాలాకు దారితీశాయి. మరోవైపు, దాదాపు అమెరికా అధ్యక్షులందరికీ దుస్తులు అందించిన 200 ఏళ్ల నాటి సంస్థ బ్రూక్స్ బ్రదర్స్ కూడా దివాలా పిటిషన్ వేసింది. మొత్తం మీద గతేడాది మొత్తంమీద దాఖలైన దివాలా పిటిషన్లతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో దాఖలైనవే ఎక్కువ కావడం గమనార్హం. కరోనా వైరస్ మహమ్మారి ప్రబలడం మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా రెండు డజన్లపైగా స్టోర్స్ దివాలా తీశాయి. జె క్రూ, జేసీ పెన్నీ, నైమాన్ మార్కస్, స్టేజ్ స్టోర్స్, ఎసెనా రిటైల్ గ్రూప్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. -
ఈ–కామర్స్‌లోకి బాంబే డైయింగ్..
• రిటైల్ బ్రాండ్‌గా కొనసాగుతాం • తయారీ పూర్తిగా నిలిపివేత • కంపెనీ సీఈవో నగేశ్ రాజన్న హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్స్టైల్ రంగంలో ఉన్న బాంబే డైయింగ్ సొంతంగా ఈ–కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే పలు ఈ–కామర్స్ సంస్థలు కంపెనీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి.ఫిబ్రవరికల్లా ఈ–కామర్స్‌లోకి అడుగు పెడుతున్నట్టు బాంబే డైయింగ్ రిటైల్ సీఈవో నగేశ్ రాజన్న సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. తయారీ పూర్తిగా నిలిపివేశామని, థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్ల నుంచిఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రిటైల్ పైన ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 30 దాకా సబ్ బ్రాండ్లలో 5,000 రకాల బెడ్ షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్ విక్రయిస్తున్నట్టు చెప్పారు.ఏటా 400 కొత్త రకాలను ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. అంతర్జాతీయ డిజైనర్లతో చేతులు కలపడం ద్వారా వినూత్న ఉత్పత్తులను తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది రిటైల్ విభాగం లాభాల్లోకి వస్తుందని తెలిపారు. భారీ లక్ష్యంతో ముందుకు..: కంపెనీకి దేశవ్యాప్తంగా 30 సొంత, 200 ఫ్రాంచైజీ ఔట్లెట్లు ఉన్నాయి. 5,000లకు పైగా దుకాణాల్లో బాంబే డైయింగ్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. 2020 లక్ష్యంలో భాగంగా బ్రాండ్ స్టోర్ల సంఖ్య500లకు, టచ్ పాయింట్లను 10 వేలకు చేర్చనున్ననట్టు నగేశ్ వెల్ల డించారు. ‘వచ్చే నాలుగేళ్లలో బ్రాండ్ ప్రమోషన్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తాం. 10% ఆదాయం సమకూరుస్తున్న ప్రధాన మార్కెట్లయిన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో 20% ఖర్చు పెడతాం. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి. రిటైల్ ద్వారా 2015–16లో రూ.305 కోట్ల ఆదాయం సమకూరింది. 2020 నాటికి దీనిని రూ.1,000 కోట్లకు చేరుస్తాం’ అనివివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో 50% అమ్మకాలు తగ్గాయని... చైనా నుంచి దిగుమతులూ పడిపోయాయని గుర్తు చేశారు.