పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంపు
రిటైల్ ధర మాత్రం యథాతథం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రం గురువారం లీటర్‌కు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. కానీ దీని ప్రభావం వినియోగదారులపై ఉండదు. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు యథాతథంగానే ఉంటాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ నుంచి పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి ప్రభుత్వానికి సుమారు రూ. 6 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తాజాగా ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో వాస్తవానికి పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 3.22 చొప్పున, డీజిల్‌పై రూ. 3 చొప్పున ప్రభుత్వం తగ్గించాల్సి ఉంది. అయితే ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రత్యేకించి 15 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. కాగా, వంటగ్యాస్ వినియోగదారులు ఏడాదికి 12 సిలిండర్ల కోటా దాటాక కొనుగోలు చేసే సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను మాత్రం రూ. 43.50 (ఢిల్లీలో) మేర తగ్గించింది.