ఆన్‌లైన్‌లోకి స్పెన్సర్స్ రిటైల్!
తెలంగాణ, ఏపీలో మరో 3 హైపర్ స్టోర్లు
కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రామనాథన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ సంస్థ స్పెన్సర్స్ ఆన్లైన్ విక్రయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తోంది. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోకి కూడా విస్తరించాలన్నది ఆలోచన అని స్పెన్సర్స్ రిటైల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎమ్.రామనాథన్ తెలిపారు. ఎప్పుడు కొత్త వేదికలోకి ప్రవేశించేదీ ఇప్పుడే చెప్పలేనని అన్నారు. హైదరాబాద్ మల్కాజిగిరిలో 30,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన హైపర్ స్టోర్‌ను శుక్రవారం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టుకల్లా హైదరాబాద్‌లో మరో రెండు, డిసెంబర్‌కల్లా విజయవాడలో మరొక హైపర్ స్టోర్ రానుందని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భవిష్యత్తులో ఔట్లెట్లు నెలకొల్పుతామన్నారు. స్టోర్‌ను ఎక్కడ, ఎంత సామర్థ్యంతో నెలకొల్పేదీ సమగ్ర అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ విచ్చేశారు.
10 శాతం పెరిగిన వ్యయం..: గతేడాదితో పోలిస్తే స్పెన్సర్స్ కస్టమర్ సగటు కొనుగోలు వ్యయం హైదరాబాద్‌లో 10% పెరిగింది. వినియోగం గణనీయంగా అధికమైందని, ధరలు కూడా హెచ్చడం ఇందుకు కారణమని రామనాథన్ తెలిపారు. ‘వ్యవస్థీకృత రంగ స్టోర్లలో ఆఫర్లకుతోడు ఉత్పత్తులు అందుబాటు ధరలో ఉంటాయన్న భావన కస్టమర్లలో పెరిగింది. సంఘటిత రంగంలో రిటైల్ స్టోర్ల విస్తృతి ఏడాదిలో 3 నుంచి సుమారు 7 శాతానికి ఎగసింది’ అని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం స్పెన్సర్స్ 36 హైపర్, సూపర్ స్టోర్లను నిర్వహిస్తోంది.