ఆ టీఆర్ఎస్ నేత నుంచి ప్రాణాహాని ఉంది
సనత్‌నగర్: అధికార టీఆర్ఎస్ పార్టీ సనత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడితో పాటు ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి అబ్దుల్‌హమీద్ ఆరోపించారు. తన రెండో భార్యతో కలిసి తన ఆస్తిని కాజేయాలని వారు కుట్ర పన్నారన్నారు. ఆదివారం సనత్‌నగర్‌లోని తన నివాసంలో బాధితుడు అబ్దుల్ హమీద్ విలేకరులతో మాట్లాడారు. 1995లో తన మొదటి భార్య నూర్జహాన్‌బేగం చనిపోగా 2001లో వరంగల్‌కు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నానని తెలిపారు. తన రెండో భార్యకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానంటూ ఆ పార్టీ నాయకుడు ఖలీల్‌బేగ్ ఆమెతో సాన్నిహిత సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు.
ఆ తర్వాత రూ. ఐదు కోట్ల విలువ చేసే తన ఇంటిని తన పేరుపై మార్చుకుని కాజేయాలని ఖలీల్‌బేగ్ ప్రయత్నం చేశాడన్నారు. దీంతో ఆయన తన రెండో భార్యతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలతో సహా, వారి మోసంపై సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని హమీద్ చెప్పారు. ఆ తరువాత ఏప్రిల్ 29, 2015న రెండో భార్యతో విడాకులు తీసుకున్నానని తెలిపారు. అప్పటి నుంచి ఎక్కడ ఆస్తి చేజారిపోతుందోననే ఉద్దేశంతో ఖలీల్‌బేగ్ తనను చంపేస్తానని అల్లావుద్దీన్‌కోఠికి చెందిన ఖాజా, డీఎన్‌ఎంకాలనీకి చెందిన సాబేర్‌లతో కలిసి బెదిరిస్తున్నాడని తెలిపారు.
వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని హమీద్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు టీఆర్ఎస్ పార్టీలో పెద్దల నుంచి ఒత్తిళ్లు రావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాను మీడియా ద్వారా న్యాయం చేయాలని కోరుతున్నానని బాధితుడు తెలిపారు. కాగా ఖలీల్‌బేగ్, అబ్దుల్ హమీద్ రెండో భార్య (ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఆదివారం హల్చల్ చేయడం గమనార్హం.