వాచ్మెన్పై కత్తితో దాడి.. ఇద్దరు మహిళల అరెస్ట్!
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి వివేకానందనగర్లో సాయిభరద్వాజ అపార్టుమెంట్ వాచ్మెన్పై అదే అపార్టుమెంటులో నివసించే ఓ కుటుంబం కత్తితో దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సాయిభరద్వాజ అపార్టుమెంట్లోని ఓ ఫ్లాట్లో రిటైర్డు ఎస్సై జి.వి.రత్నం కుటుంబం అద్దెకు ఉంటోంది. శనివారం రాత్రి 2 గంటల సమయంలో ఏదో శబ్దం వస్తోందని రత్నం ఎదురు ఫ్లాట్లోని వ్యక్తి చెప్పడంతో చూసేందుకు వాచ్మన్ పైకి వెళ్లాడు. సౌండ్ చేయవద్దని వాచ్మన్ చెప్పడంతో రత్నం కుమార్తె ఒకరు కత్తితో దాడిచేయగా, మరో కుమార్తె సీసీ కెమెరాలపై నీళ్లు చల్లింది. దాడిలో వాచ్మెన్ తుంటిభాగంలో గాయమైంది. అతడి కేకలు విని అందరూ వచ్చి సంఘటన గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
రత్నం కుటుంబంపై కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాచ్మెన్ చికిత్స పొందుతున్నాడని, ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ కుటుంబం సైకోలా ప్రవర్తిస్తుంటుందని, అరుపులు కేకలతో అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తారని, దీంతో వాచ్మెన్లు పలువురు మారారని అప్టార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఇతర కుటుంబాలు తెలిపాయి. ఈ సంఘటనతో ఇతర ఫ్లాట్లలో ఉండేవారు భయాందోళనకు గురవుతున్నారు.