మనసును అదుపు చేసుకోలేని వారి జీవితం...
ప్రాకారం లేక పాడైన పురము
సువార్త
శత్రువులు దాడి చేయకుండా చైనా రాజులు తమ దేశం చుట్టూ 15 వేల మైళ్ల పొడవున, సగటున ఏడు మీటర్ల ఎత్తున చైనా గోడ కట్టారు. ప్రజలను పీడించి అందుకు బోలెడు డబ్బు, కాలం, శ్రమ వెచ్చించారు. కాని అది పూర్తయిన వందేళ్లలోపే శత్రువులు చైనాపై మూడు సార్లు దాడి చేశారు. వాళ్లు గోడెక్కి రాలేదు, గోడపై కావలి ఉన్న సైనికులకు లంచమిచ్చి లోపలికొచ్చారు. గోడమీది ధీమాతో వాళ్లు సైనికుల నిజాయితీ విషయం మర్చిపోయారు. తాళం వేసి గొళ్లెం మరిచారు.
దావీదు మహాచక్రవర్తి కొడుకుగా సొలొమోను చక్రవర్తికి ఎంతో సంపద, ఖ్యాతి, వైభవం కలిసొచ్చింది. యెరూషలేము మందిరాన్ని సైతం దేవుడు సొలొమోనుతోనే కట్టించాడు. దావీదు తన యుక్తితో, యుద్ధ నైపుణ్యంతో పొరుగు రాజులందరినీ లొంగదీసుకోగా శత్రుభయం లేని గొప్ప శాంతియుత సామ్రాజ్యం సొలొమోను ఒడిలో వచ్చి పడింది. పైగా దేవుడిచ్చిన జ్ఞానవివేచనవల్ల తెలివైన రాజుగా అతని ఖ్యాతి భూదిగంతాలకు పాకింది. కాని క్రమంగా సొలొమోను దేవుని మరిచిపోయాడు. స్త్రీలోలుడై వందలాది మంది భార్యలు, ఉపపత్నులను చేరదీశాడు. తన భార్యలు పూజించే దేవతలకు తానూ పూజించాడు. ప్రజలతో వెట్టి చాకిరి చేయించాడు. తన జ్ఞానంతో ప్రపంచంలో అభిమానులను సంపాదించుకున్నారు కాని అహంకారం, విచ్చలవిడితనంతో సొంత ప్రజలనే శత్రువులను చేసుకున్నాడు (1 రాజులు 11:4 ; 12:4-16). ఫలితంగా అతని తర్వాత ఇశ్రాయేలు దేశం రెండు ముక్కలై బలహీనమైంది.
ఆ తర్వాత పూర్తిగా విచ్ఛిన్నమైంది. జీవితాన్ని చేజేతులా పాడుచేసుకునే విద్యలో మనిషి ఆరితేరాడు. కళ్లెదురుగా గొయ్యి కనబడుతున్నా అందులో పడి కనీసం బురదంటుకోకుండా ప్రాణాలతో బయటపడగలనన్న ఆశావాదం ఆధునిక మానవునిది. అందుకే ఎన్నో గొప్ప విజయాలు సాధించిన మహనీయులు కూడా ఎంతో చిన్న విషయాల్లో విఫలమై చరిత్ర హీనులయ్యారు. అవిద్య, దారిద్య్రం, అజ్ఞానం మనిషిని పాడు చేస్తాయన్నది కొందరి అపోహ. కాని ఈ మూడింటి బాధితులైన మన పూర్వికులు ఈ మూడూ లేని మనకన్నా ఎంతో గౌరవప్రదంగా, శాంతిగా, సంస్కారయుక్తంగా, ఎంతో మందికి ప్రయోజనకరంగా బతికారన్నది నిర్వివాదాంశం.
మనిషిని నిజంగా పాడుచేసేది అహంకారం, దేవునితో అతను పెంచుకున్న దూరం. అందుకే ‘నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు’ అని యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు (యోహాను 15:5). మనిషికున్న జ్ఞానం, శక్తి అపారమే! అయినా తనను తాను నియంత్రించుకోవడంలో మాత్రం అతను ముమ్మాటికీ అశక్తుడే! మన ఇంద్రియాలను, అంతరేంద్రియాలను కూడా సృజించిన దేవుని నిరంతర సహవాసం, సాన్నిధ్యంలోనే మనిషికి ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది.
మనిషి తనను తాను అపరిమితంగా ప్రేమించుకోవడం, నమ్ముకోవడం ద్వారా దేవునికి దూరమవుతాడు, దైవవ్యతిరేక విధివిధానాలకు దగ్గరవుతాడు. దాన్నే బైబిల్ ‘పాపం’ అంటుంది. చాలామంది విశ్వసిస్తున్నట్టు మనిషికే గనుక తనపై తనకు నియంత్రణ ఉంటే ఇన్ని అనర్థాలకు తావేది? డాక్టర్ సలహా మేరకే కనీసం ఉప్పు, కారం, తీపి మానలేని మనిషి తనను తాను అదుపు చేసుకొని లోకకల్యాణాన్ని సాధిస్తాడనుకోవడం గొర్రెతోక పట్టుకొని గోదావరి ఈదాలనుకోవడం కాదా? అందుకే సొలొమోను తన చివరి రోజుల్లో స్వానుభవంతో ‘తన మనస్సును అణచుకోలేనివాని జీవితం ప్రాకారం లేక పాడైన పురము’లాంటిదన్నాడు (సామెతలు 25:28).
- రెవ.టి.ఎ. ప్రభుకిరణ్