చేయి తడపాల్సిందే!
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రభుత్వ శాఖల్లో కీలకమైన రెవెన్యూ విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. గత ఏడాది అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో ఈ శాఖ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. భూములకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో రెవెన్యూ శాఖ కీలకం. ఈ యంత్రాంగం చేయి తడపనిదే ఫైళ్లు కదలవనే అపవాదు ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నులు.. మైనింగ్.. రవాణా శాఖల్లోనూ అవినీతి వేళ్లూనుకుంది.
అయితే రెవెన్యూ శాఖతో అన్ని వర్గాలకు అవసరాలు పెరిగిపోవడంతో అవినీతి కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఏసీబీ అధికారులు గత సంవత్సరం 15 కేసులు నమోదు చేయగా.. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎనిమిది ఉండటం గమనార్హం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కేసులు 2, ఏపీసీపీడీసీఎల్ శాఖ సిబ్బందిపై 2.. రవాణా, వ్యవసాయం, రాజీవ్ విద్యా మిషన్ సిబ్బందిపై ఒక్కో కేసు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖలో వీఆర్వో మొదలుకొని తహశీల్దార్ వరకు వసూళ్లపర్వం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు, భూముల పట్టాలు, వారసత్వపు సర్టిఫికెట్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఇలా ఎన్నో ధ్రువపత్రాలు రెవెన్యూ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. వీటి జారీలో కీలకమైన వీఆర్ఓలు, తహశీల్దార్లు అధిక శాతం అందినంత దండుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది.
ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూకు కాసుల పంట పండిస్తున్నాయి. భూముల వివాదాలు, భూ విలువలను బట్టి పట్టాదారు పాస్ పుస్తకం జారీలో రూ.50 లక్షల వరకు చేతులు మారిన సందర్భాలు లేకపోలేదు. ఎలాంటి ఫీజు లేకుండా ఇవ్వాల్సిన పాస్ పుస్తకాలకు అన్నీ సవ్యంగా ఉన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. జూపాడుబంగ్లా తహశీల్దారుగా పని చేస్తున్న వెంకటేష్ నాయక్ పట్టాదారు పాస్ పుస్తకం జారీకి రూ.2 లక్షలు డిమాండ్ చేసి డబ్బు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల దాడుల్లో అత్యధికంగా లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి ఈయనే. నందవరం డిప్యూటీ తహశీల్దారు కూడా పట్టాదారు పాస్ పుస్తకం జారీకి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.
రుద్రవరం మండలంలో ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, వీఆర్ఓలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. తహశీల్దార్ల నేతతృ్వంలో పని చేయాల్సిన సర్వేయర్లు కొందరు భూముల కొలతల్లో అడ్డుగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దళారీలతో సంబంధం లేకుండా, తహశీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం లేకుండా.. మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ధ్రువ పత్రాలు పొందే అవకాశం కల్పించామని పాలకులు చెబుతున్నా అవినీతికి అడ్డుకట్ట పడని పరిస్థితి నెలకొంది. మీసేవ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ యంత్రాంగం కుమ్మక్కై పథకం ప్రకారమే ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం.